Viral: బాస్ పంపిన వాట్సాప్ మెసేజీ చూడగానే రిజైన్ ఇచ్చేసిన ఉద్యోగి..జరిగింది ఏంటంటే..
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:07 PM
జ్వరం వచ్చినా బాస్ సెలవు ఇవ్వకపోవడంతో వెంటనే రాజీనామా చేశాడో ఉద్యోగి. నెటిజన్లు కూడా ఉద్యోగికే మద్దతుగా నిలుస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు సెలవలు అడగడం బాస్‌లు నిరాకరించడం సాధారణమే. కానీ సెలవు అడిగినందుకు బాస్ అన్న ఒకే ఒక్క మాటతో ఓ ఉద్యోగి జాబ్‌కు గుడ్‌పై చెప్పేశాడు. ఆ తరువాత ఆ ఉద్యోగి తనకు ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది (Employee Quits Job After Boss Denies Sick Leave Without Doctors Note).
సదరు ఉద్యోగికి ఇటీవల ఓ రోజు జ్వరం రావడంతో సెలవు కావాలంటూ బాస్‌కు మెసేజ్ పెట్టాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లివచ్చినందుకు రుజువుగా చిట్టీ చూపిస్తేనే సెలవు దొరుకుతుందని బాస్ రిప్లై ఇచ్చాడు. దీంతో, ఉద్యోగి ఒకింత అసహనానికి గురయ్యాడు. తాను మూడేళ్లుగా ఒక్క రోజు కూడా డాక్టర్ వద్దకు వెళ్లలేదని, చిన్న జ్వరం కోసం డాక్టర్ వద్దకు వెళ్లేంత ఆర్థికస్తోమత కూడా లేదని అతడు చెప్పాడు. అంతకుముందు రోజు గంటకు 8 డాలర్లకు సమానమైన జీతం మాత్రమే తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. డాక్టర్ ఫీజులను కంపెనీ భరించదు కదా అని ఎదురు ప్రశ్నించాడు.
దీంతో, బాస్‌కు మరింత తిక్కరేగింది. ‘‘కరెక్టే కానీ డాక్టర్స్ రాసిన చిట్టీ లేకపోతే నీకు సెలవు దక్కదు. అయితే, నీకొచ్చింది ఫీవరేనని అంటున్నావు కాబట్టి ఆఫీసుకొచ్చి పనిచేయగలవని భావిస్తున్నాను. అయినా, నీకొచ్చే జీతం నువ్వు చేసే పనిబట్టే ఉంటుంది’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
బాస్ తీరుతో మండిపడ్డ ఉద్యోగి నేను రాజీనామా చేస్తున్నానంటూ చెప్పి చాట్‌కు ముగింపు పలికాడు. ఇదంతా చూసిన నెటిజన్లు ఉద్యోగికే మద్దతు పలికారు. ఇలాంటి వారి వద్ద అస్సలు పనిచేయకూడదని అనేక మంది కామెంట్ చేశారు.