Venky Atluri: ‘సార్’ ప్రీమియర్ స్పందన చూశాక.. ప్రశాంతంగా నిద్రపోయా..

ABN , First Publish Date - 2023-02-17T21:03:26+05:30 IST

‘సార్’ మూవీ ప్రీమియర్ స్పందన చూశాక.. ప్రశాంతంగా నిద్రపోయానని అన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). ఆయన దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన ద్విభాషా చిత్రం

Venky Atluri: ‘సార్’ ప్రీమియర్ స్పందన చూశాక.. ప్రశాంతంగా నిద్రపోయా..
Director Venky Atluri

‘సార్’ మూవీ ప్రీమియర్ స్పందన చూశాక.. ప్రశాంతంగా నిద్రపోయానని అన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). ఆయన దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళ్‌లో ‘వాతి’) (Sir Movie). ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మాతలు. ధనుష్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటించింది. భారీ అంచనాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలవగా.. ముందు రోజు సాయంత్రం ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. విడుదల తర్వాత సినిమాకి వచ్చిన స్పందన చూసి చిత్రయూనిట్ తమ ఆనందాన్ని తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి (Director Venky Atluri) మాట్లాడుతూ.. ‘‘చాలా సంతోషంగా ఉంది. 2018లో వచ్చిన నా మొదటి సినిమా ‘తొలిప్రేమ’ (Tholiprema) తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరి నుంచి ఫోన్లు వస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. కానీ విడుదలకు ముందు రోజున వేసిన ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. శుక్రవారం ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చాను. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నేను భాగమైన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఇంత మంచి స్పందన రావడం గర్వంగా ఉంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లిన వంశీగారికి ధన్యవాదాలు. ఆయన చెప్పినట్లుగా ముందు 2 ప్రీమియర్లు అనుకున్నాం.. కానీ అవి పెరుగుతూ 40 షోల వరకు వెళ్లాయి. ఈ 40 షోలకు వచ్చిన స్పందనతో తమిళ్‌లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి’’ అని అన్నారు.

ఇంకా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..

ఈ తరహా కథ చిత్రాలను తీసే ప్రతిభను ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు?

మొదటి సినిమా విజయం సాధించినప్పుడు మనకు అదే సరైన రూట్ అనిపించి అటు వెళ్ళడానికే ప్రయత్నిస్తాం. నేనూ అదే చేశాను. ‘మిస్టర్ మజ్ను’ (Mr Majnu) విషయంలో కొంత అతి విశ్వాసం దెబ్బ తీసింది. ‘రంగ్ దే’ (Rang De) ప్రయత్న లోపం అని చెప్పలేను కానీ.. వరుసగా మూడో లవ్ స్టోరీ కావడం, పరిస్థితుల ప్రభావం వల్ల దానికి జరగాల్సిన న్యాయం జరగలేదు. దాంతో నా దారిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. వరుసగా 3 ప్రేమ కథల తర్వాత ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ప్రేక్షకులను నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకున్నట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ చిత్రం చేయడం జరిగింది. కేవలం సందేశం మాత్రమే ఇవ్వాలనుకోలేదు. వినోదం కూడా పంచాలనుకున్నాను. సినిమా చూసి ప్రేక్షకులు.. అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. విడుదలకు ముందు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నాను. ఈ చిత్రం చాలా కాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. (Director Venky Atluri On Sir Result)

సినిమా విడుదల తర్వాత ధనుష్ గారి స్పందన ఏంటి? (Dhanush Reaction on Sir Movie)

ధనుష్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రే ఫోన్ చేసి ప్రీమియర్ల స్పందన ఏంటని అడిగారు. బాగుంది సార్ అంటే రేపు ఉదయం వరకు ఆగు అన్నారు. అప్పుడు ఆయన అలా ఎందుకు అన్నారో అర్థంకాలేదు. చెన్నైలో నేను ప్రేక్షకుల మధ్యలో షో చూశాక.. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అడిగారు. చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే.. అందుకే నిన్ను ఆగమన్నాను అన్నారు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల ధనుష్ గారితో పాటు టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.

ఈ కథకి స్ఫూర్తి ఏంటి?

ఈ కథ కల్పితం. కానీ ఇదంతా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో చూసిన, అనుభవించిన కథలు. నేను చూసిన, చుట్టుపక్కల జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. అందుకే అంత సహజంగా ఉంది.

Updated Date - 2023-02-17T21:03:29+05:30 IST