Cocktail Party Effect: ‘ద కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్’ అంటే తెలుసా? మనిషి మెదడుకు అంత శక్తి ఉందా??
ABN , First Publish Date - 2023-03-30T10:57:16+05:30 IST
రైల్వే ప్లాట్‌ఫారంపై ఉన్నప్పుడు రణగొణధ్వనులు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు కదా? అయినా....
రైల్వే ప్లాట్‌ఫారంపై ఉన్నప్పుడు రణగొణధ్వనులు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు కదా? అయినా.. మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే.. అంతటి నాయిస్‌లో కూడా.. ఎదుటి వారి మాటలను మీరు స్పష్టంగా వినగలుగుతారు..!
ఓ పబ్‌కి వెళ్తే.. ఇతరుల హంగామా, మ్యూజిక్, డ్యాన్సులు.. ఇలా పీక్‌లో శబ్దాలు వస్తున్నా.. మీరు మీ ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు, ఎలాంటి ఆటంకం లేకుండా వారి మాటను వినగలరు.. వారూ మీ మాటను స్పష్టంగా ఆలకిస్తారు..! ఇదంతా ఎలా సాధ్యం?? ఈ ప్రశ్నకు మానసిక శాస్త్రవేత్తలు అది మన మెదడుకు ఉన్న శక్తివల్లే సాధ్యం అని చెబుతున్నారు. ఇలా రణగొణ ధ్వనుల్లోనూ.. అనవసర శబ్దాలను ఫిల్టర్ చేసి, కావాల్సిన శబ్దాలను మాత్రమే మన మెదడు వినగలదని, దీన్ని ‘ద కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్ (The cocktail party effect) అని పిలుస్తారని వివరించారు. ఒక విధంగా చెప్పాలంటే.. వీడియో, ఆడియో రికార్డింగ్ నిపుణులు ‘నాయిస్ రిడక్షన్’ను ఎలాగైతే వాడుతారో.. ద కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌లో మన మెదడు మనకు కావాల్సిన శబ్దాలను మాత్రమే వినగలుగుతుందని, ఇంకా చెప్పాలంటే.. అధునాతన నాయిస్ రిడక్షన్ సాఫ్ట్‌వేర్లతో పోలిస్తే.. మన మెదడుకు కొన్ని లక్షల రెట్ల మేర అనవసర ధ్వనులను త్యజించే(Noise Filtering) శక్తి ఉందంటున్నారు.
1950 నుంచి పరిశోధనలు..
కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌పై 1950 నుంచి పరిశోధనలు జరుపుతున్నారు. 1953లో మిషిగాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మెదడుకు ఎంతటి నాయిస్ ఉన్నా.. ఒక వ్యక్తి మాట్లాడే మాటలను గుర్తుంచుకుని, ఆ తర్వాత ఆ వ్యక్తి మాట్లాడబోయే మాటలను గుర్తించేందుకు అటెన్షన్‌గా ఉండే శక్తి ఉందని నిరూపించారు. ‘‘ఏకకాలంలో ఏక ధ్వనిని వినే శక్తి మెదడుకు ఉంది. ఆ సమయంలో మిగతా ధ్వనులను ఫిల్టర్ చేసుకుంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి రెండు చెవుల్లో, రెండు వేర్వేరు సందేశాలను ఏకకాలంలో చెబితే, మెదడు దాన్ని గ్రహించదు. లేదా.. ఏదో ఒక సందేశాన్ని మాత్రమే గ్రహిస్తుంది. అందులోనూ.. ఎడమ చెవి వైపు నుంచి వచ్చే సందేశాన్నే తొలుత గ్రహించగలదు’’ అని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ఆ తర్వాతి కాలంలో కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌పై పరిశోధనల విస్తృతి పెరుగుతూ వచ్చింది. బ్రెయిన్ మెకానిజం(brain mechanisms), సెలెక్టివ్ అటెన్షన్(selective attention), భావోద్వేగ అంశాల ప్రభావం(influence of emotional content), వయసుల వారీగా కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌కు స్పందించే తత్వంలో తేడాలు వంటి అంశాలపై పరిశోధనలు జరిగాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌లో ఎదుటి వారి మాటలను వినే శక్తి సన్నగిల్లుతుందని తేలింది.
మన దేశంలో పరిశోధనలిలా..
1. ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) నిర్వహించిన పరిశోధనలో వయసు ప్రభావం కూడా కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌పై ఉంటుందని తేలింది. వయసు పైబడ్డవారు రద్దీ ప్రదేశాల్లో ఎదుటివారు మాట్లాడేదాన్ని అర్థం చేసుకోలేరని పేర్కొంది.
2. బెంగళూరులోని నేషనల్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(NIMHANS) పరిశోధనలో కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌కు మెదడులో ఉండే తటస్థ మెకానిజం ఉపయోగపడుతుందని తేలింది. వ్యక్తుల దృఢ స్వభావాలను బట్టి.. వారి మెదడు శబ్దాలను వినాలా? విస్మరించాలా? అనే నిర్ణయాన్ని తీసుకుంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.
3. ఐఐటీ-ఢిల్లీ(IIT-Delhi) పరిశోధకులు కూడా ఈ అంశంపై అధ్యయనం చేశారు. సంగీతంలో ప్రవేశం ఉన్నవారు కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌లో ఇతరుల కంటే ఎక్కువ సమర్థంగా తమకు కావాల్సిన మాటలను వినగలరని తేల్చారు.
4. యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలు జర్నల్ ఆఫ్ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ హియరింగ్ రీసెర్చ్(Journal of Speech, Language, and Hearing Research)లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో.. ఒకటికంటే ఎక్కువ భాషలు తెలిసినవారు కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌ను సమర్థంగా ఎదుర్కొంటారని తేలింది.
5. ‘జర్నల్ ఆఫ్ ఆడియాలజీ’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. వయోవృద్ధులు కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్‌ను సమర్థంగా ఎదుర్కోలేరని, వారికి ధ్వనులను ఫిల్టర్ చేసి, ప్రత్యేకంగా ఒకరి మాటలను వినలేరని నిరూపితమైంది.
6. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఒటాలజీలో ప్రచురితమైన లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences) అధ్యయనంలో వినికిడి పరికరాలను ఉపయోగించేవారిలో కాక్‌టైల్ పార్టీ ఎఫెక్ట్ సందర్భాల్లో ఎదుటివారి మాటలను ఎక్కువగా వినే శక్తి ఉంటుందని తేలింది.