Chhatriwali Movie Review: ఆలోచింప చేసే ఛత్రీవాలీ

ABN , First Publish Date - 2023-01-30T15:16:57+05:30 IST

నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మిగతా చాలామంది నటీమణుల్లా కాకుండా సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల మీద గళం విప్పుతూ ఉంటుంది. అలాగే సాంఘీక మాధ్యమాల్లో కూడా తాను ఏమి చెప్పాలని అనుకుంటుందో చెప్పి తీరుతుంది. అటువంటి రకుల్ 'ఛత్రీవాలీ' అనే సినిమా చేసింది.

Chhatriwali Movie Review: ఆలోచింప చేసే ఛత్రీవాలీ

నటీనటులు: రకుల్ ప్రీత్ సింగ్, సుమీత్ వ్యాస్, సతీష్ కౌశిక్, రాజేష్ తైలాంగ్, డాలీ అహ్లువాలియా, రాకేష్ బేడీ తదితరులు

ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ వాసాని

దర్శకుడు: తేజస్ డియోస్కర్

నిర్మాత: రోనీ స్క్రూవాలా

-- సురేష్ కవిరాయని

నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మిగతా చాలామంది నటీమణుల్లా కాకుండా సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల మీద గళం విప్పుతూ ఉంటుంది. అలాగే సాంఘీక మాధ్యమాల్లో కూడా తాను ఏమి చెప్పాలని అనుకుంటుందో చెప్పి తీరుతుంది. అటువంటి రకుల్ 'ఛత్రీవాలీ' అనే సినిమా చేసింది. సెక్స్ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో బోధించాలి లాంటి నేపధ్యంలో తీసిన రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. జీ5 ఓ.టి.టి. లో విడుదల అయింది. ఈ సినిమాకి రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్ కూడా. ఎందుకంటే ఈ సినిమాలో ఆమెదే ప్రధానమయిన పాత్ర. సుమీత్ వ్యాస్ (Sumeet Vyas), సతీష్ కౌశిక్ (Satish Kaushik), రాజేష్ తైలాంగ్ (Rajesh Tailang), ప్రాచీ షా పాండ్య (Prachee Shah Paandya) వంటి ప్రాముఖ్యం గల నటులు ఇందులో నటించారు. ఈ సినిమాకి తేజస్ దేవోస్కర్ (Tejas Deoskar) దర్శకత్వం వహించగా, రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala) దీనికి నిర్మాత.

chhatriwali1.jpg

Chhatriwali story:

ఈ కథ అంతా హర్యానాలోని కర్నాల్ అనే చిన్న టౌన్ లో జరిగింది. సాన్యా (రకుల్ ప్రీత్) కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేసి వుద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర పిల్లలకు చిన్న చిన్న ప్రయోగాలు చేసి చూపిస్తూ తాను రసాయన శాస్త్రం లో ప్రావీణ్యత ఉన్నదానిని అని చెపుతూ ఉంటుంది. సాన్యా ఒకసారి అనుకోకుండా ఒక కండోమ్ కంపెనీ అధినేత (సతీష్ కౌశిక్) ని కలుసుకుంటుంది, అతని కంపెనీ లో క్వాలిటీ కంట్రోల్ అధికారిగా జాయిన్ అవుతుంది. అప్పటి నుండి ఆమెకి తిప్పలు మొదలవుతాయి. ఎందుకంటే ఆమె ఒక కండోమ్ కంపెనీ లో పనిచేస్తోంది అంటే, ఇంట్లో ఒప్పుకోరు, సమాజం లో కూడా చిన్న చూపు. అందుకని గొడుగులు తయారు చేసే కంపెనీ లో పనిచేస్తున్నట్టుగా చెపుతుంది అందరికీ. సాన్యా వివాహం రిషి (సుమీత్ వ్యాస్) అనే అబ్బాయితో జరుగుతోంది. అతను పూజ సామాగ్రి ని అమ్ముకునే షాప్ నడుపుతూ ఉంటాడు. అతని కుటుంబం సంప్రదాయం అనే కట్టుబాట్లతో పాత పద్ధతుల్లోనే ఉండటం, ముఖ్యంగా రిషి అన్నయ్య రాజన్ (రాజేష్ తైలాంగ్) ఆ సంప్రదాయాన్ని బాగా వంటపట్టించుకునే వ్యక్తి. అతను బయాలజీ టీచర్ గా వుద్యోగం చేస్తూ పిల్లలకు పాటాలు చెపుతూ ఉంటాడు, అయినా సంప్రదాయాన్ని పట్టుకు వేలాడుతాడు. అలంటి కుటుంబం లోకి వెళ్లిన సాన్యా వుద్యోగం మానేసిందా, ఆ కుటుంబం ఆమెని ఆదరించిందా, కుటుంబాన్ని సమాజాన్ని ఎదిరించిందా, చివరికి ఏమైంది అనే విషయం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ (analysis):

ఈమధ్య సామజిక అవగాహన మీద చాల హిందీ సినిమాలు వచ్చాయి. 'పాడ్ మేన్', 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ', 'టప్పడ్' లాంటివి చాల వచ్చాయి. దర్శకుడు తేజస్ డియోస్కర్ కూడా ఒక సామజిక అవగాహన వున్న అంశాన్ని తీసుకొని, దాన్ని కొంచెం కామెడీ గా చెప్పాలని ఈ 'ఛత్రీవాలీ' తో వచ్చాడు. సెక్స్ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో ఉండాలని, దాని మీద చిన్నప్పటి నుంచే అవగాహన ఉంటే సమాజం మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పడం లో సఫలీ కృతుడు అయ్యాడనే చెప్పాలి. ఇలాంటి సున్నితమయిన అంశాలు డాక్యుమెంటరీ లో చూస్తూ ఉంటాము, కానీ దర్శకుడు ఇక్కడ ఆ అంశాన్ని చాలా చక్కగా, సరదా సన్నివేశాలతో మేళవించి చూపించాడు. సన్నివేశాలు ఎలా ఉంటాయి, ఏమి వుంటాయో అని ముందుగా తెలిసినా, ఎక్కడా బోర్ లేకుండా తను చెప్పాలని అనుకున్నది చక్కగా చూపించాడు దర్శకుడు. అయితే అక్కడక్కడా మరీ సినిమాటిక్ సన్నివేశాలున్నా కూడా ఇది ఒక మంచి సామజిక అవగాహనా కల్పించే చిత్రం అని చెప్పొచ్చు.

chhatriwali2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమా అంతా రకుల్ ప్రీత్ బుజాల మీదకి ఎత్తుకుంది. చాలా కాలం తరువాత ఒక హిందీ సినిమాలో రకుల్ ప్రీత్ నటనకి పని చెప్పే పాత్ర దొరికింది. ఈ పాత్రని రకుల్ కూడా అంతే చక్కగా పోషించింది, తన ప్రతిభని నిరూపించుకుంది. ఒక్క గ్లామర్ పాత్రలే కాకుండా, ఇలాంటి నటనకి ప్రాధాన్యం వున్న పాత్రలు కూడా తాను చెయ్యగలను అని ఈ సినిమాలో సాన్యా పాత్ర తో నిరూపించింది. తరువాత సుమీత్ వ్యాస్ కూడా అంతే చక్కని నటన కనబరిచాడు. ఆధునికాయ యువతికి భర్తగా, అలాగే సంప్రదాయాల మధ్య కొట్టుమిట్టాడుతున్న అన్నయ్య కి తమ్ముడిగా బా చేసాడు. రాజేష్ తైలాంగ్, సతీష్ కౌశిక్, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా న్యాయం చేశారు. ఛాయాగ్రహణం కూడా బాగుంది.

చివరగా, 'ఛత్రీవాలీ' అనే సినిమా సామాజిక అవగాహనతో తీసిన సినిమా. సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్ నుండే బోధించాలి, సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునికతకి కూడా అలవాటు పడాలి, ఆరోగ్యం మహాభాగ్యం ముఖ్యంగా అడ్డవాళ్లకు ఇలా అన్నీ అంశాలు జోడించి సరదాగా చెప్పే చిత్రం ఇది. రకుల్ ప్రీత్ సింగ్ కి ఇది ఒక మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. ఆమె నటన చాలా ఆకట్టుకుంటుంది.

Updated Date - 2023-01-30T15:16:59+05:30 IST