Viral: స్కూటీపై ట్రాఫిక్‌లో దూసుకుపోయిన వధువు.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు.. ఆమె పొరపాటు ఏంటంటే..
ABN , First Publish Date - 2023-06-11T18:17:09+05:30 IST
లైసెన్స్ లేకుండా హెల్మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్‌లో స్కూటీ నడిపిన ఓ వధువుకు పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: చదువుకున్న వాళ్లకు మంచి చెడుల విచక్షణ ఉంటుందని అంటారు కానీ కొందరు యువతీయువకులను చూస్తే మాత్రం ఇది నిజం కాదేమో అనిపించకమానదు. ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రమాదానికి ఎదురెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. హెల్మెట్ పెట్టుకోవడం తప్పని సరి అని ట్రాఫిక్ పోలీసు ఎంత మొత్తుకుంటున్నా వీరు పెడచెవిన పెడుతుంటారు. హెల్మెట్ లేకుండా టూవీలర్స్ నడుపుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే, సోషల్ మీడియా జమానాలో పోలీసులు కూడా తప్పుదారి పట్టిన యువతకు తమదైన శైలిలో బుద్ధిచెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
హెల్మెట్ పెట్టుకోకుండా(Helmet) స్కూటీ నడుపుతున్న ఓ వధువు(Bride) వీడియోను ఢిల్లీ పోలీసులు(Delhhi Police) నెట్టింట్ పోస్ట్ చేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా చట్టాన్ని ఉల్లంఘించిన ఆమెకు జరిమానా విధించడమే కాకుండా ఆమె స్కూటీ నడుపుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మూర్ఖత్వం వద్దు అంటూ ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా తగిలించారు. యువతికి విధించిన జరిమానా తాలూకు స్క్రీన్ షాట్‌ను కూడా ఈ వీడియోలో భాగం చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని యువతి వద్ద లైసెన్స్ కూడా లేదని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే, యువతికి బుద్ధి వచ్చేలా పోలీసులు తమ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా జత చేసి పంచుకున్నారు. బాలీవుడ్ పాటలను బ్యాక్‌గ్రౌంట్ మ్యూజిక్‌గా వాడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు.
ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. వీడియోపై వస్తున్న కామెంట్సే ఇందుకు నిదర్శనం. చట్టం ఉల్లంఘిస్తే వచ్చే ఫలితాలపై చాలా సృజనాత్మకంగా వీడియో చేశారు అంటూ అనేక మంది పోలీసులపై ప్రశంసలు కురిపించారు. యువతకు గుణపాఠం చెప్పేందుకు ఇలాంటివే అవసరం అని మరికొందరు అభిప్రాయపడ్డారు.