TarakaRatna: తారకరత్న ఎలాంటోడో తెలియాలంటే ఇతని గురించి మీకు తెలియాల్సిందే..!

ABN , First Publish Date - 2023-02-19T15:02:17+05:30 IST

సినీ నటుడు తారకరత్న (Taraka Ratna) ఇక లేరని తెలుసుకుని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆయన అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. జిల్లాలో ఆయనకు ఎంతో..

TarakaRatna: తారకరత్న ఎలాంటోడో తెలియాలంటే ఇతని గురించి మీకు తెలియాల్సిందే..!

మొన్నే కదా.. వచ్చివెళ్లావు..!

తారకరత్న మృతితో అనంత విషాదం

అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న అభిమానులు

అనంతపురం అర్బన్‌/గుంతకల్లుటౌన్‌/ధర్మవరం: సినీ నటుడు తారకరత్న (Taraka Ratna) ఇక లేరని తెలుసుకుని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆయన అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. జిల్లాలో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 2007లో గుంతకల్లు పట్టణంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం నగరంలోని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గౌస్‌మొద్దీన్‌ ఇంటికి తారకరత్న దాదాపు ఆరుసార్లు వచ్చారు. గత సార్వత్రి ఎన్నికల్లో తన హిందూపురంలో కొన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేశారు. హిందూపురంలో టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ కూతురు వివాహానికి జనవరి 26న తారకరత్న హాజరయ్యారు. లోకేష్‌ పాద యాత్రకు వెళ్తూ కర్ణాటక రాష్ట్రం నందిహిల్స్‌ వద్ద హిందూపురం నుంచి వెంట వెళ్లిన అభిమానులతో కలిసి భోజనం చేశారు.

STT.jpg

చివరి నివాళి

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా నందమూరి తారకరత్న రామగిరి మండలంలోని వెంకటాపురంలో జనవరి 24న నివాళులు అర్పించారు. వారి ఇంటికి వెళ్లి పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్థార్థతో ముచ్చటించారు. నందమూరి కుటుంబం, పరిటాల కుటుంబం వేరువేరు కాదని ఈ సందర్భంగా తారకరత్న అన్నారు. పరిటాల రవీంద్ర తనకు సోదరసమానుడని అన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా షూటింగ్‌ కోసం జిల్లాకు వచ్చిన సమయంలో కలిసి భోజనం చేసేవారని అన్నారు. రామగిరి మండలంలో గాలిమరల వద్ద తారకరత్న ‘మగాడు’ సినిమా షూటింగ్‌లో దాదాపు 22 రోజులపాటు పాల్గొన్నారు. వెంకటాపురం నుంచి హిందూపురం వెళుతూ, తన అభిమాని అవుకు హరి ఆహ్వానం మేరకు చెన్నేకొత్తపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి తేనీరు స్వీకరించారు. హరి, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తారకరత్నను శాలువాతో సత్కరించారు. తమ అభిమాన నటుడు లేడని తెలుసుకుని, ఈ ప్రాంతవాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మా ఇంటి బిర్యానీ అంటే తనకు ఇష్టం..

తారకరత్న నాకంటే చిన్న వాడైనా నాకు మంచి స్నేహితుడు. ఆరు సార్లు మా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుడిలాగా గడిపాడు. నేను హైదరాబాదుకు వెళ్లినప్పుడు తారకరత్న ఇంటి వెళ్లేవాడిని. అన్ని విషయాలు పంచుకుని, సరదాగా గడిపేవాళ్లం. మా ఇంట్లో చేసిన బిర్యానీ అంటే తారకరత్నకు ఎంతో ఇష్టం. ఎప్పుడైనా బిర్యాన్ని తినాలి అనిపిస్తే పార్సిల్‌ పంపించాలని అడిగేవాడు. ఆయన అడిగిందే తడువుగా హైదరబాదుకు పంపిచ్చేవాడిని. అలాంటి వ్యక్తి మరణించడం మా కుటుంబానికి తీరనిలోటు.

- గౌస్‌మొద్దీన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌

Updated Date - 2023-02-19T15:03:47+05:30 IST