Share News

కనువిందు చేసే ఫ్లవర్‌ పరేడ్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:49 AM

పూలతో అలంకరించిన నిలువెత్తు శకటాలు.... ఒకదానికి మించి మరొకటి ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన పడవలు...

కనువిందు చేసే ఫ్లవర్‌ పరేడ్‌

పూలతో అలంకరించిన నిలువెత్తు శకటాలు.... ఒకదానికి మించి మరొకటి ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన పడవలు... వాటిని చూస్తూ ప్రేక్షకుల హర్షధ్వానాలు... వెరసి ఆ ఫ్లవర్‌ పరేడ్‌లకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు. ఎటు చూసినా పూల వనాలతో ఆకట్టుకునే నెదర్లాండ్స్‌లో జరిగే ఫ్లవర్‌ పరేడ్‌ల విశేషాలు ఇవి..

కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించిన రంగురంగుల పూలతోటలకు నెదర్లాండ్స్‌ ప్రసిద్ధి. అంతేకాదు ఆ పూలతో ఏటా వాళ్లు నిర్వహించే ఫ్లవర్‌ పరేడ్‌లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. నెదర్లాండ్స్‌లోని జుండెర్ట్‌లో ఏటా జరిగే ఫ్లవర్‌ పరేడ్‌ వీక్షకులను కనువిందు చేస్తుంది. ఇక్కడ 80 ఏళ్లుగా ఈ ఫ్లవర్‌ పరేడ్‌ జరుగుతోంది. మొట్టమొదటి ఫ్లవర్‌ పరేడ్‌ 1936లో జరిగింది. రాణి విల్‌హెల్మినా గౌరవార్థం ఈ వేడుకను నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నారు. ఫ్లవర్‌ పరేడ్‌లో పాల్గొనేందుకు కొన్ని వారాల ముందు నుంచి పనులు ప్రారంభిస్తారు. కార్డ్‌బోర్డ్‌, మెష్‌, వైర్‌తో శకటాన్ని డిజైన్‌ చేస్తారు. తరువాత పూలతో అలంకరిస్తారు. ఈ పరేడ్‌ కోసమే ప్రత్యేకంగా పూల తోటలు పెంచుతారు. ఒక్కో శకటం తయారీకి అవసరమైన పూలను కొన్ని గ్రామాల వారు కలిసి పండిస్తారు. చుట్టు పక్కల ఉన్న 20 హామ్లెట్‌ గ్రామాలు పరేడ్‌కు అవసరమైన శకటాలు తయారుచేయడంలో పాల్గొంటాయి. ఏటా సెప్టెంబరు మొదటి ఆదివారం రోజున ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇందులో స్థానికులు వాలంటీర్లుగా పాల్గొనడం చేస్తుంటారు. ఈ కలర్‌ఫుల్‌ వేడుకను వీక్షించడానికి చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. జుండెర్ట్‌ టౌన్‌ కల్చర్‌ని కాపాడుకోవడానికి ఈ వేడుకను జరుపుతున్నామని స్థానికులు అంటారు. ఈ ఏడాది జరిగిన పరేడ్‌లో దాదాపు 80 లక్షల పూలను ఉపయోగించారు.

తులిప్‌ పూలతో..

నెదర్లాండ్స్‌లో జరిగే మరో ముఖ్యమైన వేడుక కీకెన్‌హాఫ్‌ ఫ్లవర్‌ పరేడ్‌. తులిప్‌ పూల తోటల చుట్టూ సాగే ఈ పరేడ్‌ ఆద్యంతం కనువిందు చేస్తుంది. దీన్ని స్ర్పింగ్‌ ఫ్లవర్‌ పరేడ్‌ అని కూడా పిలుస్తారు. ఈ పరేడ్‌లో సాగే శకటాలను తులిప్‌ పూలతో అలంకరిస్తారు. 42 కిలోమీటర్ల మేర సాగే ఈ వేడుకను వీక్షించడానికి కొన్ని లక్షల మంది ప్రజలు తరలివస్తారు. ఏడు దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. పరేడ్‌ నిర్వహణ వాలంటీర్లు చూసుకుంటారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 20న 77వ పరేడ్‌ జరగనుంది.

సెయిలింగ్‌ ఫ్లవర్‌ పరేడ్‌

పూలు, పూల మొక్కలు, కూరగాయలతో పడవలను అలంకరించి నిర్వహించే పరేడ్‌ ఇది. ఇందులో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే వెస్ట్‌ల్యాండ్‌లో ఉన్న కాలువల్లో ఈ పరేడ్‌ సాగుతుంది. కాలువకు ఇరువైపులా ప్రజలు కూర్చుని పరేడ్‌ను వీక్షిస్తారు. వెస్ట్‌ల్యాండ్‌, స్కిప్లూడెన్‌ మాసూయిస్‌, దిహేగ్‌, వ్లారిండ్‌జెన్‌లోని కాలువల వెంట నాలుగురోజుల పాటు సాగే పరేడ్‌ను చూడటానికి వేల మంది తరలివస్తారు. కొన్ని వందల పడవలు ఇందులో పాల్గొంటాయి.

Updated Date - Dec 17 , 2023 | 11:49 AM