Viral: 14 ఏళ్లకే కోటీశ్వరుడైన బాలుడు.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోలో అద్భుతం!
ABN , First Publish Date - 2023-11-30T20:53:15+05:30 IST
హర్యానాకు చెందిన ఓ 14 ఏళ్ల కుర్రాడు కోన్ బనేగా కరోడ్ పతీ షోలో చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ షోలో కోటి గెలుచున్న అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాకు చెందిన ఓ 14 ఏళ్ల కుర్రాడు కోన్ బనేగా కరోడ్ పతీ షోలో(Kaun Banega Crorepati) చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ షోలో కోటి గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు(14-Year-Old Becomes Youngest Contestant To Win ₹ 1 Crore). ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అబ్బురపరిచిన ఈ కుర్రాడి పేరు మయాంక్. మహేంద్రఘడ్ జిల్లాకు చెందిన అతడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తాజా 15వ ఎడిషన్‌లో పాల్గొన్న అతడు బిగ్ బీ అడిగిన 16వ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానమిచ్చి ఏకంగా కోటి గెలుచుకున్నాడు.
చదువుల్లో టీచర్లు కూడా ఆశ్చర్యపోయేలా ప్రతిభ కనబరిచే మయాంక తొలి నుంచి నేర్పుగా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ వేళ్లాడు. ఎటువంటి లైఫ్‌లైన్స్ వాడుకోకుండా అతడు రూ.3.2 లక్షల వరకూ గెలిచాడు. ఆపై రూ 12.5 లక్షల ప్రైజ్ మనీ ఉన్న ప్రశ్న కోసం తొలిసారిగా లైఫ్‌లైన్ వాడాడు. కోటి రూపాయల బహుమతి ఉన్న 15వ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా జవాబు చెప్పి ఆటలో కీలక మైలురాయిని చేరుకున్నాడు. అమెరికా పేరు ఉన్న ప్రపంచమ్యాప్‌కు ఎవరనే ప్రశ్నకు మార్టిన్ వాల్డ్సీముల్లర్ అని సమాధానం చెప్పి కోటి కొల్లగొట్టాడు. అయితే, ఏడు కోట్ల బహుమతి ఉన్న క్లిష్టమైన ప్రశ్న అతడికి సవాలుగా మారడంతో ఆట నుంచి నిష్క్రమించేందుకు మయాంక్ నిర్ణయించాడు. చివరిగా రూ. కోటి బహుమతితో వెనుదిరిగాడు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మయాంక్ ప్రతిభకు అబ్బురపడ్డారు. ఎక్స్ వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోటి గెలుచుకోవడంపై మయాంక్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. షో సందర్భంగా తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన కేబీసీ వ్యాఖ్యాత అమితాబచ్చన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తల్లిదండ్రులు ఇచ్చిన మద్దతు కూడా గొప్పదని వ్యాఖ్యానించాడు.