Bhuma Akhila Priya vs AV Subba Reddy: అఖిల, సుబ్బారెడ్డి.. లోకేశ్ పాదయాత్రలో జరిగిన గొడవలో తప్పెవరిదని తేల్చారంటే..

ABN , First Publish Date - 2023-05-24T19:04:24+05:30 IST

లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో చోటు చేసుకొన్న ఘటనలో..

Bhuma Akhila Priya vs AV Subba Reddy: అఖిల, సుబ్బారెడ్డి.. లోకేశ్ పాదయాత్రలో జరిగిన గొడవలో తప్పెవరిదని తేల్చారంటే..

అఖిలను ఏవీ సుబ్బారెడ్డి కొట్టడంతో గొడవ మొదలు

తర్వాత అఖిలప్రియ వర్గీయులు సుబ్బారెడ్డిపై దాడి

పోలీసులకు ఫిర్యాదు చేయొద్దన్నా సుబ్బారెడ్డి వినలేదు

దాడి సమయంలో అఖిల భర్త లేకపోయినా ఆయన పేరు

నంద్యాల ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక

అమరావతి (ఆంధ్రజ్యోతి): లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో చోటు చేసుకొన్న ఘటనలో మాజీ మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ పరిధులు దాటారని త్రిసభ్య కమిటీ నివేదించినట్టు సమాచారం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేతలు అఖిల ప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. సుబ్బారెడ్డి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అక్కడి పోలీసులు ఆమెను, ఆమె భర్తను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదో నిర్ధారించడానికి పార్టీ అధినేత చంద్రబాబు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్‌నాథరెడ్డి, కడప జిల్లాకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు ఆ రోజు నంద్యాలలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను, పార్టీ నేతలను, ఏబీ సుబ్బారెడ్డిని విచారించారు. తర్వాత నంద్యాల జైలుకు వెళ్లి అఖిలప్రియతో కూడా మాట్లాడారు. తమ దృష్టికి వచ్చిన అంశాలతో పార్టీ అధినేతకు ఒక నివేదిక సమర్పించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నివేదికలోని ముఖ్యాంశాలు దిగువ విధంగా ఉన్నాయి.

లోకేశ్‌ పాదయాత్రలో అఖిలప్రియ, సుబ్బారెడ్డి ఇద్దరూ పాల్గొన్నారు. ఈ ఇద్దరికీ మధ్య పాత వైరాలు ఉన్నాయి. పాదయాత్ర సమయంలో తోపులాట వల్లో, మరో కారణంతోనో.. సుబ్బారెడ్డి అఖిల ప్రియకు తగిలారు. తన మీద పడటం ఏమిటని ఆమె సుబ్బారెడ్డిని తిట్టారు. దీంతో సుబ్బారెడ్డి ఆమెను అందరి ముందే కొట్టారు. ఆమె ఈ విషయాన్ని తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డికి చెప్పారు. పాదయాత్ర నడుస్తున్న సమయంలో దీన్ని పెద్దది చేయొద్దని, తర్వాత మాట్లాడదామని ఆయన అఖిలప్రియకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై ఆగ్రహంతో ఉన్న అఖిలప్రియ వర్గీయులు తర్వాత సుబ్బారెడ్డిని కొట్టారు. విషయం పెద్దదవుతోందని గ్రహించిన ఇతర నేతలు కలుగజేసుకొని వారిని విడదీశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఇద్దరికీ చెప్పారు. కానీ సుబ్బారెడ్డి వెంటనే నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చోటుచేసుకొన్న సమయంలో అఖిలప్రియ భర్త అక్కడ లేరు. కానీ, ఆయన పేరు కూడా జోడించి సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత గొడవలన్నీ అందులో వివరించి అఖిలప్రియ భర్త కుట్ర చేశారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

మర్నాడు తెల్లవారుజామున అఖిలప్రియ ఇంటికెళ్లి భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. తనపై సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారని తెలుసుకొని ఆ తర్వాత అఖిల ప్రియ కూడా సుబ్బారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు స్పందించలేదు. సుబ్బారెడ్డి ఫిర్యాదుపై పోలీసులు ఆఘమేఘాలపై స్పందించి అఖిలప్రియను అరెస్టు చేయడం వెనుక వైసీపీ నేతల జోక్యం ఉందని టీడీపీ త్రిసభ్య కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ వివరిస్తూ కమిటీ తన నివేదికను పార్టీ అధినేతకు అందచేసింది. దీనిపై చంద్రబాబు ఇంకా స్పందించలేదు. లోకేశ్‌ పాదయాత్ర గత రెండు రోజులుగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న అఖిలప్రియ జైల్లో ఉండటంతో యాత్రలో పాల్గొనలేకపోయారు. ఆమె తరపున తమ్ముడు జగత్‌విఖ్యాత్‌ రెడ్డి యాత్ర బాధ్యతలు తీసుకొన్నారు.

Updated Date - 2023-05-24T19:07:08+05:30 IST