Rahul disqualification: కలిసి పోటీ చేస్తారా? సమీకరణలు మారుతాయా?

ABN , First Publish Date - 2023-03-25T19:59:11+05:30 IST

ఒకవైపు దూసుకు వస్తున్న లోక్‌సభ ఎన్నికలు, మరోవైపు రాష్ట్రాల్లో పెరుగుతున్న విపక్ష పార్టీల అసమ్మతి సెగలు, ఇదే సమయంలో..

Rahul disqualification: కలిసి పోటీ చేస్తారా? సమీకరణలు మారుతాయా?

న్యూఢిల్లీ: ఒకవైపు దూసుకు వస్తున్న లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections), మరోవైపు రాష్ట్రాల్లో పెరుగుతున్న విపక్ష పార్టీల అసమ్మతి సెగలు, ఇదే సమయంలో రాహుల్‌గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు.. ముప్పేట పరిణామాల మధ్య విపక్షాల ''ఐక్యతారాగం'' బలమైన ఫ్రంట్‌గా ఏర్పడుతుందా? కలిసికట్టుగా పోటీ చేసే స్థాయిలో ఇది తుదికంటూ కొనసాగుతుందా? కలిసి పోటీ చేస్తారా? సమీకరణలు మారుతాయా? దేశంలో ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే.

ఇదీ నేపథ్యం...

పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సంచలనాలకి కేంద్ర బిందువులయ్యాయి. అదానీ వివాదంపై దుమారం రేగుతుందని ముందే ఊహించిన అధికార బీజేపీకి రాహుల్ గాంధీ లండన్ పర్యటన అనుకోని అవకాశం రూపంలో వచ్చిపడింది. భారత ప్రజాస్వామ్యం బలహీనపడిందంటూ రాహుల్ విదేశాల్లో మన దేశాన్ని అప్రతిష్టపాలు చేసి, ప్రపంచశక్తుల జోక్యం కోరారని, ఇందుకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. అదానీ షెల్ కంపెనీలకు డబ్బులు ఎవరిచ్చారో చెప్పేందుకు అధికార పార్టీ సిద్ధంగా లేకపోవడం, తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో విపక్షాలు కన్నెర్ర చేశాయి. ఇదే తరుణంలో నాలుగేళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో రాహుల్‌కు గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం సంచలనమైంది. అంతకుమించిన సంచలనం లోక్‌సభ సచివాలయం ఉత్తర్వు రూపంలో వెలువడింది. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై వేటు వేసింది. సూరత్ కోర్టుపై రాహుల్‌కు 30 రోజుల్లో పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా, పైకోర్టు స్టే ఇస్తే రాహుల్‌కు ఉపశమనం కలిగే అవకాశం ఉన్నా... ఆయన లోక్‌సభ సభ్యత్వంపై గంటల వ్యవధిలోనే సెక్రటేరియట్ నిర్ణయం తీసుకోవడం పలు సంకేతాలకు తావిచ్చింది. విపక్షాలు మరోసారి రాహుల్‌కు బాసటగా నిలిచాయి. మోదీ నియంతృత్వానికి ఇది పరాకాష్ట అంటూ విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో నిరసనలు తెలిపాయి.

ఇక్కడికే పరిమితమా? కలిసొచ్చేదెవరు?

2024 ఎన్నికల కోసం విపక్షాల ఐక్యతారాగం ఇప్పటికైతే వేగం పుంజుకోలేదు కానీ, అనర్హత వేటుపై రాహుల్‌ను సమర్ధించిన వారంతా ఇప్పుడైనా కలిసికట్టుగా నిలుస్తారా? బలమైన ఫ్రంట్‌గా ఏర్పడతారా? ఇప్పటికిప్పుడైతే ఎవరూ కచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పలేరు కానీ, మునుముందు ఏదైనా జరగనూ వచ్చు.. జరగకపోనూ వచ్చు. పలు రాష్ట్రాల వారీగా చూసినప్పుడు...తమిళనాడులో మొదట్నించీ డీఎంకేతో కాంగ్రెస్ అనుబంధం కొనసాగుతోంది. 2024లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వెనుకంజ వేసే అవకాశాలు లేవు. రాహుల్‌పై అనర్హత వేటును విభేదించిన వారిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు సారథ్యంలోని బీఆరెస్‌తో పాటు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ వంటి నేతలు ఉన్నారు. వీరంతా కొద్దికాలంగా ప్రతిపక్షాల ఐక్యతారాగం వినిపిస్తున్నవారే. అయితే చివరివరకూ కలిసి వచ్చేవారెవరు? అనేది మాత్రం ఇప్పటికీ సందేహాస్పదమే.

విపక్ష ఐక్య ఫ్రంట్‌కు మమతా బెనర్జీ ముందు నుంచి పావులు కదుపుతున్నారు. అయితే, కాంగ్రెస్ లేని విపక్ష ఫ్రంట్ దిశగా ఆమె ఎత్తుగడలు సాగుతున్నాయి. కలిసొచ్చే సీఎంలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర ఇచ్చేందుకు మాత్రం ఇంతవరకూ మమత సిద్ధంగా లేరు. ప్రధాని పీఠంపై మమతకు ఆశలున్నాయనేది నిర్వివాదాంశం. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్యాడర్‌ను టీఎంసీలోకి చేర్చుకుని బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఆమె చేస్తున్నారని కాంగ్రెస్ ఇప్పటికీ మమతపై గుర్రుమంటోంది.ఈ క్రమంలో కాంగ్రెస్‌తో కలిసి ఐక్య ఫ్రంట్‌ ఏర్పాటుకు మమత సానుకూలంగా ఉంటారని అనుకోలేం. పీఎం పదవిని ఆశిస్తున్న మరో నేత బీహార్ సీఎం నితీష్ కుమార్. బయటకు కాదు కాదంటున్నా ఆయన కాంగ్రెస్‌ కీలకభూమికను గుర్తించారు. బలమైన విపక్ష కూటమికి కాంగ్రెస్ ముందుకు రావాలంటున్నారు.

ఇక, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు నేనుసైతం...అంటున్నారు కేసీఆర్. వివిధ రాష్ట్రాల సీఎంలను కలుస్తున్నారు. అయితే, సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కావడంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీతో చేతులు కలపడానికి, ఐక్య ఫ్రంట్‌లో పాలుపంచుకునేందుకు ఏమేరకు ఆయన ఇష్టపడతారనేది ప్రస్తుతానికి అస్పష్టం. ఒక్కో రాష్ట్రం చొప్పున కాస్తకాస్తగా విస్తరించుకుంటూ వెళుతున్న కేజ్రీవాల్‌ సైతం పీఎం పదవి వరించి వస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అయితే, ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అయినా, కాంగ్రెస్‌ కూడా ఆప్‌కు విపక్షమే. అదీగాక, గోవా సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్యాడర్‌ను చీల్చారనే అపప్రద ఆయన పార్టీపై ఉంది. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఈ పరిణామాలపై గుర్రుమంటోంది. ఎన్‌సీపీ నేత శరద్ పవార్ చాలాకాలంగా ప్రతిపక్షాల ఐక్యతారాగం వినిపిస్తున్నప్పటికీ ప్రధాని పదవి ఆయనను సైతం ఆకర్షిస్తూనే ఉంది. ఆయన కాంగ్రెస్‌తో కలిసి ఐక్య ఫ్రంట్‌కు సానుకూలంగానే ఉన్నారు. బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌తో కలిసి అధికారం పంచుకుంటున్న ఆర్జేడీ నేత తేజస్వి, యూపీలో ప్రధాన విపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ మాత్రం ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై వచ్చేందుకు ఇదే మంచి తరుణమని బలంగా చెబుతున్నారు. రాహుల్‌కు బాసటగా నిలుస్తున్న నేతల్లో ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఉంది.

బీజేపీ సెల్ఫ్ గోల్!

రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటం వెనుక 2019 కేసులో సూరత్ కోర్టు తీర్పు ప్రధాన నేపథ్యమే అయినా, క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాహుల్‌పై అనర్హత వేటు వేయడంపై రాజకీయ పండితులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీకి 'సెల్ఫ్ గోల్' అని, విపక్షాల ఐక్యత మరింత వేగం పుంజుకోవడానికి ఇది దారితీస్తుందని విశ్లేషకుల అంచనాగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను మూడు నెలలకు ఒకసారి కుప్పకూల్చి అధికారంలోకి రావడం బీజేపీకి పరిపాటైందని కారాలు మిరియాలు నూరుతున్న డజనుకు పైగా ప్రాంతీయ పార్టీల నేతలు తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని బలమైన ఫ్రంట్‌గా ఏర్పడితే 2024 ఎన్నికలు.. నువ్వా-నేనా అనే రీతిలో సంకుల సమరంగా మారే అవకాశాలు పుష్కలం. కానీ పిల్లిమెడకు గంట కట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పటికీ వీరిని వేధిస్తూనే ఉంది.

రాజకీయ వర్గాల అంచనా...

దేశంలో త్వరలో ప్రతిపక్షాల నేతృత్వలో బలమైన ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా తన నాయకత్వం గురించి ఆలోచించే పరిస్థితి లేదని, కలిసి పోరాడేందుకే సమాయత్తమవుతోందని అంటున్నారు. ముందు కలిసికట్టు పోరాటం, గెలుపు తర్వాతే ప్రధాని అభ్యర్థిత్వం.. అనే వ్యూహాత్మక ఎత్తుగడతో కాంగ్రెస్ ముందుకు వెళ్లే అవకాశాలు లేకపోదని చెబుతున్నారు. అదే జరిగితే..విపక్ష పార్టీల ఐక్యతారాగం సుసాధ్యం కావచ్చు. అప్పుడు మోదీ వెర్సస్ విపక్షాల మధ్య 2024 ఎన్నికలు సంకుల సమరం కావడం ఖాయం.

Updated Date - 2023-03-25T19:59:11+05:30 IST