Share News

మెట్రో.. రూట్‌ చేంజ్‌!

ABN , Publish Date - Dec 24 , 2023 | 04:04 PM

నగర ప్రజారవాణాలో మెట్రో అత్యంత కీలకమైనది.

మెట్రో.. రూట్‌ చేంజ్‌!

  • పాతబస్తీకి మెట్రో రైలు సౌకర్యం

  • ఎల్‌బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు లైన్‌

  • ప్రజా రవాణాను మెరుగుపర్చే ప్రయత్నం

  • ‘రాయదుర్గం- ఎయిర్‌పోర్టు’ రూట్‌ కు గుడ్‌బై

  • తక్కువ వ్యయంతో ఎయిర్‌పోర్టు మార్గం పూర్తికి యోచన

  • పగ్గాలు చేపట్టగానే సీఎం రేవంత్‌ వేగంగా నిర్ణయం

  • ఫలక్‌నుమా, ఎల్‌బీనగర్‌ మార్గాలపై అధ్యయనానికి ఆదేశాలు

  • సతమవుతున్న మెట్రో అధికారులు.. సర్వేకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజారవాణాలో మెట్రో అత్యంత కీలకమైనది. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత రాకపోకలు చాలావరకు సులువయ్యాయి. నిత్యం 4-5 లక్షల మంది వేగంగా వీటిల్లో ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వారి ప్రాధాన్యాలు కూడా మారుతున్నాయి. సీఎం రేవంత్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన సమీక్షలో మెట్రోపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం- ఎయిర్‌పోర్టు కారిడార్‌ను పక్కకు పెట్టమని ఆదేశించడంతో దాదాపు ఆ మార్గం పూర్తిగా లేనట్లే.

ఎక్కువ ప్రాంతాలకు విస్తరణ

గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లను కొత్త సర్కారు పక్కకుపెట్టి కొత్త మార్గాలపై ప్రణాళికలు రూపొందించాలని ఇప్పటికే ఆదేశించింది. ప్రధానంగా రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కారిడార్‌ను దాదాపు మార్చే ఆలోచనలో ఉంది. మెట్రో వస్తుందన్న ఉద్దేశంతో ఇప్పటికే చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసిన రియల్‌ ఎస్టేట్‌, పరిశ్రమల వ్యాపారులు పూర్తిగా నీరుగారిపోయారు. అనుకున్నది ఒకటైతే.. ప్రభుత్వం చేస్తున్నది మరొకటని ఆందోళనకు గురవుతున్నారు.

మూడు కారిడార్లలో నిత్యం రద్దీ

ప్రస్తుతం ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్‌- ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్ల మధ్య ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మూడు కారిడార్ల పరిధిలోని 57 స్టేషన్ల గుండా ప్రతిరోజు 1,028 సర్వీసులు నడుస్తుండగా..సగటున 4.80 లక్షల 5.10 లక్షలమంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎల్‌బీనగర్‌- మియాపూర్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుండగా.. జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మార్గంలో రోజుకు సుమారు 40-50వేల మంది రాకపోకలు సాగిస్తుంటారని అంచనా.

పాతబస్తీకి ఏది కూత ?

మొదటిదశలో జేబీఎ్‌స-ఫలక్‌నుమా వరకు (16 కి.మీ.) పనులను ప్రతిపాదించారు. అయితే ఎంజీబీఎస్‌ స్టేషన్‌ దాటిన తర్వాత రోడ్డు మధ్యలో ప్రార్థనా మందిరాలు, చిల్లాలు అడ్డొస్తుండడంతో అప్పట్లో అభ్యంతరాలు వచ్చాయి. అలైన్‌మెంట్‌ మార్చాలని మజ్లిస్‌ నేతలు, స్థానికుల నుంచి ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రార్థన మందిరాలు తగులకుండా కొత్త అలైన్‌మెంట్‌ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగినా ముందుకు సాగలేదు. దీంతో జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ వరకు పనులు పూర్తిచేసి రైళ్లను నడిపిస్తున్నారు. అప్పటి నుంచి ఎంజీబీఎ్‌స-ఫలక్‌నుమా (5.5 కి.మీ) పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఆచరణలో బీఆర్‌ఎస్‌ విఫలం

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెట్రో విస్తరణపై అంచనాలు రూపొందించేందుకు ప్రాధాన్యమిచ్చిందే తప్పా.. కిలోమీటరు పనికూడా పూర్తి చేయలేదనే విమర్శలున్నాయి. 2012లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే మొదటిదశ పనులకు అంకురార్పణ జరిగింది. ఈ పనులన్నీ ప్రైవేట్‌, పబ్లిక్‌, పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిన సాగాయి. మొదటిదశలోని 72 కిలోమీటర్లలో 69.2 కిలోమీటర్లు (ఇందులో ఎలివేటెడ్‌ కారిడార్లు, స్టేషన్లు) పూర్తి చేశారు. అక్కడక్కడ మిగిలిన 2.8 కిలోమీటర్లను కనీసం పట్టించుకోలేదు. అయితే 2017లో మొదటిదశ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినా మెట్రో కార్యకలాపాలను నిర్లక్ష్యం చేసింది. కరోనా సమయంలో నిర్వహణ భారంతో ఎల్‌అండ్‌టీ వెళ్లిపోతామని చెప్పడంతో రూ.1000 కోట్ల పరోక్ష సాయం అందిస్తామని చెప్పినా అందులో కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదనే వాదనలు అప్పట్లో వినిపించాయి. ఈ తరుణంలో రెండో దశలో డీపీఆర్‌ సిద్ధమైన రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కారిడార్‌ (31 కిలోమీటర్లు), బీహెచ్‌ఈఎల్‌-లక్డీకపూల్‌ మధ్య (26 కిలోమీటర్లు), నాగోలు- ఎల్‌బీనగర్‌ మధ్య (5 కిలోమీటర్లు) తామే సొంతంగా పూర్తిచేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టు కారిడార్‌కు రూ.6,250 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులకు గతేడాది డిసెంబర్‌ 9న అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అయితే గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించి పనులను మూడేళ్లలోపు పూర్తిచేస్తామని చెప్పినా.. నిధుల లేమితో వీటిని కూడా పక్కన పెట్టింది. చివరిదశకు వచ్చిన ఎల్‌-1 (లోయస్ట్‌ కమర్షియల్‌ బిడ్‌)ను ఎంపిక చేయడంలోనూ సాగదీస్తూ వచ్చింది. అయితే రెండోదశకే మోక్షం చూపించని బీఆర్‌ఎస్‌ సర్కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ కూడా మెట్రోను నడిపిస్తామని గత జూలైలో జరిగిన కేబినెట్‌లో బీరాలు పలికింది. ఈ మేరకు వరంగల్‌, మహబూబ్‌నగర్‌, విజయవాడ, కరీంనగర్‌ ఓఆర్‌ఆర్‌ చుట్టూ 278 కిలోమీటర్లను పదేళ్లలోపు పూర్తిచేస్తామని ప్రకటించింది. ఈ పనులకు రూ.69,100 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అయితే పనులన్నీ సాధ్యమవుతాయా.. లేదా.. అన్నది చూడకుండానే నిధుల ప్రకటన చేయడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల స్టంట్‌ కోసమే రెండో, మూడో దశ మెట్రో విస్తరణను తెరమీదకు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

కొత్త పంథాలో సీఎం రేవంత్‌

రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ నిర్మాణంతో తమ భూములకు రెక్కలు వస్తాయన్న ఆశతో చాలామంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరి అంచనాలను సీఎం రేవంత్‌రెడ్డి తారుమారు చేశారు. రాయదుర్గం-శంషాబాద్‌ కారిడార్‌కు బదులుగా ఫలక్‌నుమా, ఎల్‌బీనగర్‌ నుంచి మెట్రో మార్గాన్ని సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. డీపీఆర్‌ సిద్ధం చేసి, టెండర్‌ (ఎల్‌-1) ఎంపిక దశలో ఉన్న సమయంలో కారిడార్‌ను మార్చుతుండడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సీఎం ఆదేశాలను పాటిస్తూ కొత్త రూట్‌ ఎంపికలో పడ్డారు. ఫలక్‌నుమా, ఎల్‌బీనగర్‌ నుంచి క్షేత్రస్థాయి సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కారిడార్‌-2కు అనుసంధానంగా..

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో విస్తరణపై కీలకమార్పులు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. పాతబస్తీకి మెట్రో రైలును తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆయన..పనిలో పనిగా ఇదే మార్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను తీసుకెళ్తే నగరంలోని ఐటీ కారిడార్‌తోపాటు సెంట్రల్‌, తూర్పు వైపున ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నది సీఎం ఆలోచన. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. దీనిని పూర్తిచేసి ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పీ-7రోడ్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు (13 కి.మీ)ఒక ప్రతిపాదన తెచ్చారు. లేకుంటే ఎల్‌బీనగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట, బార్కస్‌, పహడీషరీఫ్‌, శ్రీశైలం రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టుకు (19 కి.మీ)మరో ప్రతిపాదన ఉంది. ఈ లెక్కన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం నుంచి శంషాబాద్‌ కారిడార్‌ (31 కి.మీ)తో పోల్చితే సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన ఫలక్‌నుమా, ఎల్‌బీనగర్‌ కారిడార్ల దూరం సగం వరకే ఉంది. ఈ విధంగా పనులు చేస్తే నిర్మాణ వ్యయం కూడా భారీగా తగ్గనుంది.

భిన్నవాదనలు

ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ మార్పుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రాయదుర్గం కారిడార్‌ నుంచే ఎక్కువమంది ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటారని..ఇక్కడి నుంచి పనులు చేస్తే అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే పాతబస్తీ నుంచి, ఎల్‌బీనగర్‌ నుంచి వేయడం ద్వారా కూడా సామాన్య ప్రజలకు మెట్రో సౌకర్యం అందే అవకాశం ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 04:04 PM