Karnataka next CM: బెంగళూరులో నాటకీయ పరిణామాలు.. మే 18న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం!

ABN , First Publish Date - 2023-05-14T19:18:24+05:30 IST

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎల్‌పీ భేటీ నేపథ్యంలో బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Karnataka next CM: బెంగళూరులో నాటకీయ పరిణామాలు.. మే 18న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం!

బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎల్‌పీ భేటీ నేపథ్యంలో బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీకే శివకుమార్, సిద్ధరామయ్య నివాసాల వద్ద వారివారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడి అనుకూల నినాదాలు చేస్తున్నారు. డీకేను సీఎం చేయాలంటూ ఆయన ఇంటి వద్ద, సిద్ధరామయ్యను సీఎంను చేయాలంటూ ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు సీఎల్‌పీ సమావేశం కోసం బెంగళూరులోని షంగ్రిల్లా హోటల్‌కు చేరుకున్నారు. సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ కూడా హోటల్‌కు చేరుకున్నారు. ఈ భేటీలో సీఎల్‌పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎం అభ్యర్థిపై చర్చించనున్నారు. అయితే సీఎం ఎంపికపై తుది నిర్ణయాన్ని అధిష్ఠానికే అప్పగించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రేపు ప్రకటించే అవకాశాలున్నాయిన తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమవనున్నారు.

కాగా మే 18న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి కేబినెట్‌ కసరత్తును పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలను ఆహ్వానించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా సారూప్య భావజాలమున్న పార్టీలను తప్పకుండా ఆహ్వానించాలని చూస్తోంది.

Updated Date - 2023-05-14T19:21:51+05:30 IST