Balineni: తొలి ప్రయత్నం విఫలం.. జగన్ అంతసేపు సమావేశమై బాలినేనికి ఫైనల్‌గా చెప్పిందొక్కటే..!

ABN , First Publish Date - 2023-06-02T17:34:13+05:30 IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిల సంయుక్త సమావేశానికి సీఎం జగన్‌ చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయన్న సమాచారాన్ని ఇచ్చినందుకు వైవీని సీఎంను కలవలేదు.

Balineni: తొలి ప్రయత్నం విఫలం.. జగన్ అంతసేపు సమావేశమై బాలినేనికి ఫైనల్‌గా చెప్పిందొక్కటే..!

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వైసీపీలో కీలక నాయకులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిల సంయుక్త సమావేశానికి సీఎం జగన్‌ చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయన్న సమాచారాన్ని ఇచ్చినందుకు వైవీని సీఎంను కలవలేదు. కాగా తనను కలిసిన బాలినేనితోనే జగన్‌ జిల్లా పార్టీ వ్యవహారాలపై లోతైన చర్చ చేశారు. అటు వైవీ ఇటు బాలినేనితో మాట్లాడేందుకు సీఎం ప్రయత్నించటం గురువారం తనను కలవాలని వేర్వేరుగా సమాచారం పంపటం తెలిసిందే. అయితే బాలినేని ఒక్కరే గురువారం సాయంత్రం జగన్‌తో తాడేపల్లిలో భేటీ అయ్యారు.

బుధవారం హైదరాబాద్‌లో ఉన్న వైవీ అక్కడి నుంచి రాత్రికి రాత్రే తిరుపతి చేరుకున్నట్లు తెలిసింది. దీంతో తనను కలిసిన బాలినేనితో జగన్‌ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పార్టీ వ్యవహారాలపై లోతైన చర్చ చేసినట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు ఇద్దరితో తాను మాట్లాడేందుకు సిద్ధం కావాలని బాలినేనికి సీఎం సూచించినట్లు తెలిసింది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో కూడా భేటీ కావాలని, ప్రత్యేకించి ఒకరిద్దరు నాయకులతో సమావేశమై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బాలినేని తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు అంశాలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

కేడర్‌కు న్యాయం చేయాలి

జిల్లాలో సమస్యలు ఎదుర్కొంటున్న ద్వితీయశ్రేణి నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలే తప్ప అనవసరమైన ప్రత్యేక సమావేశాలు అవసరం లేదని బాలినేని సీఎంతో స్పష్టంచేసినట్లు తెలిసింది. తొలుత వైవీతో కలిసి తన వద్ద సమావేశం కావాలన్న జగన్‌ సూచనపై కూడా బాలినేని సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు. అయితే జగన్‌ మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ఇద్దరు కలిసి తన వద్ద సమావేశం కావాల్సిందేనని, అలాగే కొన్నిచోట్ల ఉన్న పరిస్థితులపై అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో కలిసి రాష్ట్ర నాయకుల సమక్షంలో మాట్లాడుకోవాల్సిందేనని అన్నట్లు తెలిసింది. ఆ సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం.

కొండపి, పర్చూరు, చీరాల, కనిగిరి, గిద్దలూరుల్లో పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన నాయకులతో సమావేశమైతే బాగుంటుందని జగన్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ సందర్భంగా బాలినేని ప్రత్యేక భేటీలు అవసరం లేదని తొలి నుంచి పార్టీ కోసం పనిచేసి వారికి అండగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో వేడెక్కిన వాతావరణం, ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పరిస్థితులను చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉందని జగన్‌ అంటూ అవసరానికి అనుగుణంగా సమన్వయంతో ముందుకుపోదామని చెప్పినట్లు తెలిసింది.

అంతా అస్పష్టమే..

ఒక దశలో బాలినేని తాను ఒంగోలుకే పరిమితమై ముందుకుపోతున్నానని అదనపు భారం కూడా తనకు అక్కర్లేదని అన్నట్లు తెలిసింది. ఒంగోలుకు మీరు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న విషయం కనిపిస్తోందని, అది అవసరమేనని కానీ మీ అవసరం ఉమ్మడి జిల్లా మొత్తం ఉందని జగన్‌ అన్నట్లు సమాచారం. అయితే రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి బాలినేని చేసిన రాజీనామా వ్యవహారంపై ప్రత్యేక చర్చ జరగలేదని తెలుస్తోంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బాలినేని కూడా కొన్ని అంశాలపై అస్పష్టంగానే వివరాలు వెల్లడించారు.

జగన్‌తో భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డితో బాలినేని చాలాసేపు సమావేశమై మాట్లాడటం విశేషం. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లేందుకు ఫ్లైట్‌ టైమ్‌ అయిందని చెప్పి విమానాశ్రయంకు వెళ్లారు. రెండుమూడు రోజుల అనంతరం తిరిగి ఒంగోలు వస్తానని తనతోపాటు వచ్చిన వారికి బాలినేని చెప్పినట్లు తెలిసింది. చర్చల సారాంశం పూర్తి వివరాలు వారికి వెల్లడికానప్పటికీ వైవీతోను, ఒకరిద్దరు నియోజకవర్గాల బాధ్యులతో సంయుక్త సమావేశాలు జరగాలన్న సీఎం ప్రతిపాదన మున్ముందు ఏ మలుపు తిరుగుతుందనేది వేచి చూడాలి.

Updated Date - 2023-06-02T17:38:53+05:30 IST