Share News

TS Assembly Polls : ప్చ్.. కేసీఆర్‌లో పెరిగిపోయిన అసహనం.. సారూ ఏంటిది..!?

ABN , First Publish Date - 2023-11-14T16:19:31+05:30 IST

CM KCR Impatience : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) ముచ్చటగా మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లోనూ తానే పోటీచేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.! రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

TS Assembly Polls : ప్చ్.. కేసీఆర్‌లో పెరిగిపోయిన అసహనం.. సారూ ఏంటిది..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) ముచ్చటగా మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లోనూ తానే పోటీచేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.! రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. గులాబీ బాస్ ప్రసంగంలో ఎందుకో అసహనం ఎక్కువగా కనిపిస్తోంది. నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలిసిపోయిన పరిస్థితి. ఎలాగంటే బహిరంగ సభల్లో అసలు కేసీఆర్ అసహనం, ఆవేశం మాత్రమే కనిపిస్తోందే తప్ప.. పస ఉన్న ప్రసంగంలా కనిపించట్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి.


KCR-Angry.jpg

అసలేం జరిగింది..?

వాస్తవానికి కేసీఆర్ మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభల్లో మాట్లాడినా.. సభలకు జనాలు, నేతలు క్యూ కట్టేస్తుంటారు. ఇక రాష్ట్ర ప్రజలు అయితే టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రచారానికి శంఖారావం పూరించినప్పటి నుంచి.. కేసీఆర్ ప్రసంగంలో (KCR Speech) మునుపటిలా పస.. పంచ్‌లు, కౌంటర్లు మిస్సవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. కాసింత దృష్టిపెట్టి కేసీఆర్ స్పీచ్ వింటే ఇట్టే అర్థమైపోతుంది. సరిగ్గా ఇదే టైమ్‌లో సారు ఎందుకో అసహనం ప్రదర్శిస్తున్నారు. మంగళవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులోని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుంటే అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలేశారు. దీంతో కేసీఆర్‌కు చిర్రెత్తుకొచ్చింది. కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేస్తూ.. అరె హౌలా.. సభలో మాట్లాడాలా..? ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలారా..? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. సభలో కేసీఆర్ ప్రసంగం వినడం పక్కనెట్టి.. బాస్ ఎందుకిలా మాట్లాడారు..? ఎందుకింత అసహనం..? అసలెందుకీ ఆగ్రహం..? అంటూ నేతలు, సభకు వచ్చిన కార్యకర్తలు చర్చించుకుంటున్న పరిస్థితి.

BRS-Sabha.jpg

ఇక్కడి వరకూ ఓకే కానీ..?

ఈ ఎపిసోడ్ అనంతరం యథావిధిగా కేసీఆర్ ప్రసంగించారు.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా దేశంలో రావాల్సిన ప్రజాస్వామ్య పరిణతి ఇంకా రాలేదు. పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారు. ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలి. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని కోరుతున్నా. గ్రామాల్లో చర్చ పెట్టి, వాస్తవాలు తేల్చాలి. ఓటు విలువ గుర్తించక పోతే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎన్నికలు చాలా వస్తుంటాయి. వాళ్లకు అధికారం ఇస్తే ఏం చేసిండ్రు.. ఏం చేస్తారు..?. తెలంగాణ రాక ముందు తెలంగాణ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఎలా ఉంది.?. రైతు బంధు దుబారా.. అంటున్న నేతలకు బుద్ది చెప్పాలి. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు మాయం అయితది. తియ్యటి, పుల్లటి మాటలు నమ్మి మోసపోవద్దు. దేశాన్ని 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌తో మన బతుకులు మారాయా?.. అప్పుడు ఎందుకు చేయలేక పోయారు.? పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి. గతంలో ఇక్కడి నుంచి వేల మంది వలసపోయేవారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో లక్షా 30వేల ఎకరాలకు సాగునీరిచ్చాంఅని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. అయితే కేసీఆర్ ప్రసంగం అటుంచితే.. ఆయన అసహనం, ఆవేశం గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. మరి ఈ ఎపిసోడ్‌ను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎలా తీసుకుంటాయో.. రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

KCR-Sabha.jpg

Updated Date - 2023-11-14T16:50:28+05:30 IST