YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2023-03-31T16:38:21+05:30 IST

ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుకు ( Seediri Appalaraju ) సీఎంవో (AP CMO) నుంచి సడన్‌గా ఫోన్ కాల్ వచ్చింది. ఉన్నఫలంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు రమ్మని చెప్పడమే ఆ ఫోన్ కాల్ సారాంశం.

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుకు ( Seediri Appalaraju ) సీఎంవో (AP CMO) నుంచి సడన్‌గా ఫోన్ కాల్ వచ్చింది. ఉన్నఫలంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు రమ్మని చెప్పడమే ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో జిల్లాలో, నియోజకవర్గంలో హాజరుకావాల్సిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన క్యాంప్ ఆఫీస్‌కు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మరో సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు (Tammineni Sitharam) కూడా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఈ ఇద్దర్ని సీఎంవోకు ఎందుకు రమ్మన్నారు..? ఈ ఇద్దరితో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ఏం చర్చిస్తున్నారు..? అనే విషయాలు ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు ఈ భేటీ తర్వాత ఏం జరగొచ్చు..? అనేదానిపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏం జరుగుతోంది..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంచనాలకు అందవనే విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేగిన సమయంలో సరిగ్గా ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజుకు సీఎంవో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అర్జెంట్‌గా రమ్మని చెప్పారే తప్ప ఏం జరిగింది.. ఎందుకు పిలుపువచ్చిందనే విషయాలు మాత్రం బయటికి రావట్లేదు. ఆ ఫోన్‌కాల్‌తో మంత్రి సీదిరి, స్పీకర్ తమ్మినేని హుటాహుటిన క్యాంప్ ఆఫీస్‌కు వచ్చేశారు. సుమారు 15 నిమిషాలుగా క్యాంప్ ఆఫీస్‌లో ఈ ఇద్దరితో ప్రత్యేకంగా జగన్ చర్చిస్తున్నారు. ఏం చర్చిస్తున్నారు.. భేటీ తర్వాత ఏం జరగబోతోందనే విషయాలు ఊహకందట్లేదు. ఈ మధ్య సీదిరిపై భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం, ఇటీవల జరిగిన డాక్టర్ అచ్చన్న సంతాప సభలో మంత్రిపై ఎంఆర్‌పీఎస్ నాయకులు, మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతోందని మంత్రిని అడ్డుకున్నారు. అచ్చన్న ఎపిసోడ్‌లో నిందితుడిని అరెస్ట్ చేయాలని ఎంఆర్‌పీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కడప పశుసంవర్ధక శాఖలో డీడీగా పని చేస్తున్న దళిత ఉద్యోగి అచ్చన్న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రెండు పరిణామాలతో ఈ మధ్య సీదిరి హాట్ టాపిక్ అయ్యారు. దీనిపైనే భేటీలో జగన్ చర్చిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Tammineni-Sitharam.jpg

కేబినెట్ నుంచి తప్పిస్తారా..?

గత కేబినెట్ భేటీలో ముగ్గరు, నలుగురు మంత్రులు ఔట్ అవుతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మంత్రి వర్గ సమావేశంలో స్వయంగా జగన్ మోహన్ రెడ్డే ముగ్గురు, నలుగురు మంత్రులను పద్ధతి మార్చుకోకపోతే తొలిగిస్తానని తేల్చిచెప్పేశారు. జగన్ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా గత కొన్నిరోజులుగా సీదిరి ప్రవర్తిస్తున్నారని.. అందుకే ఆయన్ను క్యాంప్ ఆఫీస్‌కు జగన్ పిలిపించారని బయటికి వార్తలు వస్తున్నాయి. జగన్ మాటను లెక్కచేయని ఆయన్ను పక్కాగా మంత్రి పదవి నుంచి తొలగించే ఛాన్స్ ఎక్కువగా ఉందని సమాచారం. ఆ మంత్రి పదవిని ఉత్తరాంధ్ర సీనియర్ నేత.. ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు అప్పగిస్తారని కూడా తాడేపల్లిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఒకేసారి జగన్ దగ్గరికి రావడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే అయ్యింది. ఈ మధ్యనే జగన్ వార్నింగ్ ఇవ్వడం, ఇప్పుడు స్వయంగా ఆయనే క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించడంతో పక్కాగా మంత్రి పదవి పోతుందనే దానికి బలం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రెండోసారి మంత్రివర్గ విస్తరణలో మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపడంతో మత్స్యకారుల కోటా కింద సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని వార్తలు రావడం ఇప్పుడు సీదిరికి పిలుపు రావడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. జగన్‌తో సమావేశం తర్వాత ఏం జరుగుతుందో.. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2023-03-31T16:41:37+05:30 IST