ఎక్కడివక్కడే!
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:42 PM
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏడాది కాలంగా గత ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున లేఅవుట్లను ప్రతిపాదించి స్థలాలను విక్రయించింది.
హడావుడిగా ప్లాట్లు విక్రయించిన గత సర్కార్
పలు లేఅవుట్లలో నేటికీ ప్రారంభం కాని పనులు
అన్నిచోట్లా పనుల పురోగతిపై ప్రత్యేక నివేదిక
ప్రభుత్వానికి డీపీఆర్‌లు అందజేసిన అధికారులు
అభివృద్ధిపై హెచ్‌ఎండీఏ దృష్టి
హైదరాబాద్ సిటీ, డిసెంబర్29 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏడాది కాలంగా గత ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున లేఅవుట్లను ప్రతిపాదించి స్థలాలను విక్రయించింది. ఆయా లేఅవుట్లను ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామని కొనుగోలుదారులకు హామీ ఇచ్చింది. కానీ నేటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. దీంతో ఆయా లేఅవుట్లలో సత్వరమే పనులు పూర్తి చేసే దిశగా హెచ్‌ఎండీఏ డెవల్‌పమెంట్ విభాగం దృష్టి సారించింది. ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా వచ్చిన దాన కిశోర్‌కు సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులపై నివేదికను అందజేశారు. అలాగే హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన అభివృద్ధి పనుల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లను కూడా ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది.
అభివృద్ధిలో కీలకంగా..
గత పదేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల అభివృద్ధిలో హెచ్‌ఎండీఏ కీలకంగా వ్యవహరిస్తోంది. జీహెచ్‌ఎంసీతోపాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజల అవసరాలకనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి చర్యలు తీసుకుంటోంది. పదేళ్ల కాలంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లింకు రోడ్లను, పార్కులను అభివృద్ధి చేయడం, గతంలో ఉన్న పార్కులను అధునాతనంగా తీర్చిదిద్దడం వంటి పనులు చేపట్టింది. ప్రధానంగా ఉప్పల్ స్కైవాక్, బాలానగర్ ప్లైఓవర్ నిర్మాణం, గండిపేట పార్కు అభివృద్ధి, హుస్సేన్‌సాగర్ తీరాన లేక్ ఫ్రంట్ పార్కు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డును అధునాతనంగా తీర్చిదిద్దడం, భారీ జాతీయ జెండా, బీరంగూడ నుంచి రోడ్డు వెడల్పు, ఔటర్ సర్వీసు రోడ్డు వెడల్పు, సైకిల్ ట్రాక్ ఏర్పాటు, చెరువుల సుందరీకరణ, నగర శివారులోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఇలా అనేక పనులను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఏడాదిగా అదే పరిస్థితి
ఆ లేఅవుట్లలోని స్థలాలను విక్రయించిన సందర్భంలో వచ్చిన ఆదాయంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మినహాయించి మిగతా సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరింది. హెచ్‌ఎండీఏ వద్ద ఉన్న ఆ నిధుల ద్వారే ఆయా లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే టెండర్లనుఖరారు చే సింది. ప్రధానంగా బుద్వేల్, మోకిల్ల, తొర్రూరు, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడలలో లేఅవుట్ల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉంది. తొర్రూరు, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ తదితర ప్రాంతాల్లో స్థలాలు విక్రయించి ఏడాదికిపైగా అవుతున్నా.. ఇంకా అభివృద్ధి పనులు పూర్తికాలేదని ప్లాట్ల కొనుగోలుదారులు వాపోతున్నారు. త్వరగా ఆయా లేఅవుట్లను అభివృద్ధి చేసి సుందరీకరించాల్సిందిగా వారు కోరుతున్నారు.
అక్కడక్కడ సా..గుతున్న పనులు
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా మెహదీపట్నంలో స్కైవాక్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. రక్షణ శాఖకు చెందిన కొంత భూ సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ పనులు ఆగిపోయాయి. ఇటీవల భూసేకరణకు క్లియరెన్స్ రావడంతో పనులు ఊపందుకున్నాయి. కొత్వాల్‌గూడలో దేశంలోనే అతిపెద్ద పక్షుల సంరక్షణ కేంద్రం(బర్డ్ సాంక్చురీ), అక్వేరియం ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ప్రతిపాదిత అక్వేరియంను ఏర్పాటు చేసేందుకు పీపీపీ పద్ధతిలో సంస్థలు ముందుకు రావడం లేదని తెలిసింది. బాచుపల్లిలో ప్లైవోవర్ పనులు, బాచుపల్లి నుంచి బహదూర్‌పల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు సాగుతున్నాయి. అదేవిధంగా పెద్ద అంబర్‌పేట నుంచి పసుమాముల వరకు, ఉప్పల్ నల్ల చెరువు నుంచి పీర్జాదిగూడ వరకు రోడ్డు వెడల్పు పనులు సాగుతున్నాయి.
డబుల్ డెక్కర్ ప్లైవోవర్‌కు డీపీఆర్
ఎన్టీఆర్ మార్గ్‌ను అధునాతనంగా తీర్చిదిద్ధే పనులు, పలు ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అయితే హుస్సేన్‌సాగర్‌లో మ్యుజికల్ ఫౌంటెయిన్‌ను పీపుల్స్‌ప్లాజాకు తరలించే పనులు వివిధ కారణాలతో మధ్యంతరంగా నిలిచిపోయాయి. మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గండిమైసమ్మ ఎక్స్ రోడ్డు వరకు రోడ్డు వెడల్పు పనులు, మూసీ నదిపై వివిధ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఆయా పనులకు సంబధించిన వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేసిన్నట్లు తెలిసింది. హైదరాబాద్ మహా నగరంలో మౌలిక సదుపాయాలకు కీలకమైన వివిధ ప్రతిపాదిత పనుల డీపీఆర్‌లను హెచ్‌ఎండీఏ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన్నట్లు తెలిసింది. అందులో ప్రధానంగా ప్యారడైజ్ నుంచి కొంపల్లి వరకు డబుల్ డెక్కర్ ప్లైవోవర్, జేబీఎస్ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ ప్లైవోవర్ ప్రాజెక్టు ప్రతిపాదిత పనులు ఉన్నాయి. అదేవిధంగా శివారు ప్రాంతాల లింకు రోడ్డు నిర్మాణ పనులు కూడా ఉన్నాయి.