Telangana : తొమ్మిదేళ్లుగా అమరవీరులను పట్టించుకోని కేసీఆర్.. సడన్‌గా ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారెందుకు.. శంకరమ్మకు ఎమ్మెల్సీ ఆలోచన వెనుక ఇంత కథ నడిచిందా..!?

ABN , First Publish Date - 2023-06-22T21:45:45+05:30 IST

తెలంగాణ (Telangana) కోసం పోరాడిన అమరుల త్యాగాలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో న్యాయం జరిగింది.. కానీ వారి కుటుంబాలు మాత్రం దిక్కు మొక్కలేకున్నాయ్..! త్యాగాల పునాదులపై ఏర్పడిన సొంత రాష్ట్రంలో అమరులు కుటుంబాలకు ఒరిగిందేంటి..!

Telangana : తొమ్మిదేళ్లుగా అమరవీరులను పట్టించుకోని కేసీఆర్.. సడన్‌గా ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారెందుకు.. శంకరమ్మకు ఎమ్మెల్సీ ఆలోచన వెనుక ఇంత కథ నడిచిందా..!?

తెలంగాణ (Telangana) కోసం పోరాడిన అమరుల త్యాగాలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో న్యాయం జరిగింది.. కానీ వారి కుటుంబాలు మాత్రం దిక్కు మొక్కలేకున్నాయ్..! త్యాగాల పునాదులపై ఏర్పడిన సొంత రాష్ట్రంలో అమరులు కుటుంబాలకు ఒరిగిందేంటి..! ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ (KCR) ఇంతవరకూ ఆ కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదు..! త్యాగం అమరులది అయితే.. భోగం ఒక్క కుటుంబానిదే అనే విమర్శలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయ్..! అమరుల ఆకాంక్షలను కేసీఆర్ ఎందుకు నెరవేర్చలేకపోయారు..! అసలు తెలంగాణ ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా..? అంటే.. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానం లేదని రాజకీయ విశ్లేషకులు, అమరుల కుటుంబీకులు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఒకటి కాదు రెండు ఏకంగా తొమ్మిదేళ్లుగా కేసీఆర్‌కు కనిపించని అమరవీరుల కుటుంబాలు సడన్‌గా ఇప్పుడు గుర్తొచ్చాయి..? వారిపై ఇప్పుడు ఎందుకింత ప్రేమ ఒలకబోస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

kcr.jpg

ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో..?

‘జై తెలంగాణ’ (Jai Telangana) ఇదొక నినాదం కాదు.. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస, ఆత్మగౌరవం, అస్తిత్వం, ఆరాటం, పోరాటం, చైతన్యం, భావోద్వేగం. అన్నింటినీ మించి బలమైన ఆకాంక్ష. 1969లో తొలిదశ ఉద్యమం ఊపిరులూది.. 2009 తర్వాత ఎగసిన మలి దశ ఉద్యమం తారస్థాయికి చేరింది. ఒకటి కాదు రెండు కాదు.. వెయ్యిమందికిపైగా ప్రాణత్యాగాలతో స్వరాష్ట్రం సాకారమైంది.. ఆ తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు కూడా సర్కార్ జరుపుకుంటోంది. అయితే.. వెనక్కి తిరిగి చూస్తే.. ఉద్యమకారులు, అమరవీరులకు ఒరిగిందేమైనా ఉందా అంటే ప్రశ్నార్థకమే. అయితే ఇన్నాళ్లు గుర్తురాని కేసీఆర్‌కు ఇప్పుడే అమరుల కుటుంబాలకు ఎందుకు గుర్తొచ్చాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సీన్ కట్ చేస్తే.. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయ్. ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయని తాజాగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తెలంగాణకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో ఏయే వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి..? ఎవరికి ఏమేం చేయాలి..? ఇంకా చేయాల్సిన పనులేంటి..? అని కొందరు కీలక మంత్రులతో కేసీఆర్ నిశితంగా చర్చించారట. ఈ క్రమంలో అమరవీరులు, ఉద్యమకారుల గురించి ప్రస్తావన రాగా.. వారిపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారట. పైగా అమరవీరులు, ఉద్యమకారులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ కొనసాగితే కథ వేరేలా ఉంటుందనే నివేదికలు సైతం కేసీఆర్‌కు అందాయట. సరిగ్గా ఇదే సమయంలో ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబ సభ్యులను తమ పార్టీల్లో చేర్చుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా సన్నాహాలు చేస్తున్నాయట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించిందన్న విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కేసీఆర్‌ ఎట్టకేలకు మొద్దు నిద్రలేచారు!. అందుకే ఇక ఆలస్యం చేయకూడదని కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగిపోయారట.

KCR.jpg

ఇప్పుడిలా..!

తెలంగాణ మలి దశ పోరాట తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు (SrikanthaChari Mother) తొమ్మిదేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ (BRS) అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. గవర్నర్‌ కోటాలో శంకరమ్మను ఎమ్మెల్సీగా నియమించాలని నిర్ణయించడం.. ఆ వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి (Minister Jagadeesh Reddy) ఆమెతో మాట్లాడి, సీఎం నిర్ణయాన్ని వివరించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. అదే వేదికపై శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే శంకరమ్మకు ప్రభుత్వ వాహనంతోపాటు పీఏ, గన్‌మెన్‌ను కేటాయించడం జరిగింది. అయితే అధికారికంగా గురువారం రోజు ప్రకటిస్తారని సమాచారం వచ్చినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అమరవీరుల్లో మరింత అసంతృప్తి పెరిగినట్లయ్యింది. ఒకవేళ రేపో, మాపో ప్రకటిస్తారనుకోండి.. ఇలా ఒక్కరికే న్యాయం చేస్తే మిగిలిన అమరవీరుల కుటుంబం ఈ ఒక్కరికి సరే మిగిలిన వారి సంగతేంటి..? తెలంగాణ శ్వాసగా 1200 మంది ప్రాణత్యాగం చేశారు.. ఆ కుటుంబాల పరిస్థితేంటి..? వారికి కేసీఆర్ ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు..? ఇప్పుడు గులాబీ బాస్ ముందున్న పెను సవాల్.!

Shankaramma.jpg

అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా..!

రాష్ట్ర సాధన కోసం మొత్తం 1200 మందికి పైగా అమరులయ్యారంటూ రాష్ట్రం వచ్చిన మొదట్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ఓ తీర్మానం కూడా చేశారు! అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్లు ఇస్తామని.. వ్యవసాయానికి అనువైన భూమినీ అందిస్తామని మాటిచ్చారు. కానీ నేటికి అమరుల కుటుంబాలకు ఈ సాయం పూర్తిస్థాయిలో అందలేదు. అందునా.. అమరవీరులు ఎంత మంది? అనేదానిపై ప్రభుత్వం కొత్త లెక్కలు చెప్పుకొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైంది మునుపు చెప్పినట్లుగా 1200 మంది కాదని, 650 మందేనని గుర్తించామని ప్రకటించింది. చిత్రం ఏమిటంటే వీరిలోనూ ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా సాయం అందింది 528 మంది కుటుంబాలకు మాత్రమే! మిగతా వారిని గుర్తించే దిశగా సర్కారు సీరియస్‌గా చర్యలూ తీసుకోవడం లేదు. అమరులుగా 650మంది గుర్తించడంలోనూ ఓ ఫార్ములా అనుసరించింది. పోలీసు రికార్డుల్లో నమోదైన వారినే గుర్తించి, ఫైనల్‌ చేయాలని సర్కారు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు రికార్డుల్లో నమోదైన వారి జాబితా లెక్కిస్తే 650గా తేలింది. అయితే అమరులైన వారిలో చాలా మంది వివరాలు పోలీసు రికార్డుల్లో నమోదు కాలేదు. మరి.. ఆ కుటుంబాలకు సాయం పొందేందుకు అర్హత లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు.. ఉద్యమ సమయంలోని గణాంకాల ప్రకారం రాష్ట్రం కోసం 1,318 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని ఉద్యమనేతలు చెబుతున్నారు.

TS-Viplamvam.jpg

మొత్తానికి చూస్తే.. ఒక్క శంకరమ్మకు పదవి ఇచ్చి కేసీఆర్ చేతులు దులుపుకుంటే మాత్రం పరిస్థితులు వేరే ఉంటాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ కచ్చితంగా ఏదో ఒక పథకం ప్రారంభించాల్సిన అవసరం ఉందని లేకుంటే ఎన్నికల్లో కచ్చితంగా జరగాల్సిన నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గులాబీ బాస్ మనసులో ఏముంది..? ఫైనల్‌గా కేసీఆర్ ఏం ప్రకటిస్తారో..? అమరుల కుటుంబాలకు.. ఇతర వర్గాల్లోని అసంతృప్తులను ఏ మాత్రం శాంతిపజేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Udyamam.jpg

ఇవి కూడా చదవండి


YSRCP Manifesto : అమ్మ జగనా.. ఒకేసారి 100 జియో టవర్ల ప్రారంభం వెనుక ఇంత పెద్ద కథుందా.. ఈ విషయం బయటపడితే..?


TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!


TS Congress : సోదరుడు, శిష్యుడితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే..!


Kapu Politics : ద్వారంపూడిని పవన్ తిడితే ముద్రగడ రియాక్ట్ కావడమేంటి.. ఈ ఒక్క లేఖతో ఫుల్ క్లారిటీ వచ్చేసిందోచ్..!


Updated Date - 2023-06-22T21:47:42+05:30 IST