NRI: ఖతర్‌లో తెలంగాణ ప్రజా సమితి అధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-03-21T16:39:05+05:30 IST

తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఖతర్‌లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

NRI: ఖతర్‌లో తెలంగాణ ప్రజా సమితి అధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పిట్ట కొంచెం కూత ఘనం.. గల్ఫ్‌లోని చిన్న దేశాలలో ఒకటయిన ఖతర్ భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాల విషయాలలో మాత్రం ఇతర పెద్ద దేశాల కంటె మంచిగా ఉంది. ఖతర్‌లో ఉంటున్న భారతీయులలో తెలుగు ప్రవాసీయుల సంఖ్యాబలం అంతంత మాత్రమే ఉన్నా తెలుగు పండుగల నిర్వహణలో తమదైన శైలీలో మోత్తం గల్ఫ్‌లో తమకంటూ ఒక ప్రత్యేకతను కల్గి ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల విభజనానంతరం ఇక్కడి సంఘాలు కూడా వేర్వేరుగా ఏర్పడగా అందులో తెలంగాణ ప్రజా సమితి ఒకటి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1969లో ఏర్పడ్డ తెలంగాణ ప్రజా సమితి తన ప్రభావం కోల్పోయినా అదే పేరుతో ఖతర్‌లో ఏర్పడ్డ తెలంగాణ ప్రవాసీయుల సంఘం మాత్రం అనతికాలంలో ఎడారి నాట తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ఒకప్పుడు తెలంగాణ బోనం ఎత్తడానికి సిగ్గుపడే పరిస్ధితి నుండి సగర్వంగా బోనమెత్తి ధూంధాం చేసే స్థాయికి తెలంగాణ ప్రవాసీయులను తీసుకోవచ్చింది. వేడుకల నిర్వహణలో ఇతరుల తరహా అనుభవం లేకున్నా దృఢసంకల్పం ఉంటే చాలు అంటూ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది.

2.jpg

ప్రాంతీయ వాదం ఏదైతెనేమి, పండుగలు మాత్రం ఒక్కటే కదా, అందునా తెలుగు పంచాంగం ప్రమాణికంగా ఉండే ఉగాది ఉత్సవాలను తెలంగాణ ప్రజా సమితి అంగరంగ వైభవంగా నిర్వహించింది. వేప పువ్వూ, మామిడికాయ, బెల్లం మిశ్రమం ఉగాదిలో ఆచారం. దానికి తగినట్లుగా అన్ని ప్రాంతాలతో వారితో కలిసి శనివారం దోహాలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను నిర్వహించగా పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయుల కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన చలనచిత్ర, టివి రంగ కళాకారులు తమ మధుర సంగీతంతో సభికులను అలరింపజేసారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమ వేదిక చివరి క్షణంలో మారినా పూర్తిగా పండుగ వాతవారణంలో కొనసాగింది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన స్థానిక వ్యాపారవేత్త బుయ్యని ప్రవీణ్ కుమార్ ను తెలంగా ప్రజా సమితి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సన్మానించింది.

3.jpg

Updated Date - 2023-03-21T16:39:05+05:30 IST