NRI: గల్ఫ్‌లో ‘పఠాన్’ ధూం ధాం.. ‘మై నేం ఈస్ ఖాన్’ నుండి ‘పఠాన్’ వరకు..

ABN , First Publish Date - 2023-01-31T17:22:21+05:30 IST

గల్ఫ్‌లో దుమ్మురేపుతున్న పఠాన్ సినిమా. తెలుగు నాట పఠాన్‌ల చరిత్ర ఇది.

NRI: గల్ఫ్‌లో ‘పఠాన్’ ధూం ధాం.. ‘మై నేం ఈస్ ఖాన్’ నుండి ‘పఠాన్’ వరకు..

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సాధారణంగా ఖాన్‌గా ప్రాచుర్యం పొందిన పఠాన్ల ఇతివృత్తంగా హిందీ సినిమాలు అనేకం, అగ్రనటులు దీలిప్ కుమార్, అమితాబచ్చన్ నుండి మొదలు అన్ని తరాల నటులు పఠాన్లుగా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించినా తాజాగా విడుదలయిన పఠాన్ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద దూసుకోపోతుంది.

జాతి ప్రయోజనాల దృష్ట్యా విదేశాలలో రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించే అత్యున్నత నిఘా సంస్థ ‘రా’(RAW) ఏజెంటుగా విదేశీ గడ్డపై ఒక భారతీయుడు చేసే సాహసాలు ఇతివృత్తంగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ చలన చిత్రం ఇప్పటి వరకు విడుదలయిన అన్ని హిందీ చలన చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం పూర్తిగా అంకిత జాతీయ భావంతో విదేశీ మిషన్‌పై రూపొందింది. దుబాయి మొదలు అఫ్ఘానిస్తాన్, టర్కీ, రష్యా, స్పెయిన్, ఫ్రాన్స్ ఇటలీ దేశాలలో చిత్రీకరణ జరిగిన ఈ సినిమా విదేశాలలో భారతీయ నిఘా సంస్ధ అయిన ‘రా’ ఏ విధంగా దేశ ప్రయోజనాల కోసం ప్రాణాలకు తెగించి పని చేస్తుందో కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. విదేశీ గడ్డపై పాకిస్తాన్‌కు చెందిన ఐయస్ఐ భారత్‌కు వ్యతిరేకంగా చేసే కుట్రలను ఏ విధంగా అడ్డుకొంటుందో సినిమా తెలియజేసింది. దుబాయిలో ఒక శాస్త్రవేత్తల సదస్సుకు వచ్చే భారత రాష్ట్రపతిను పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాదుల అపహరణ పథకాన్ని భగ్నం చేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీని షూటింగ్ కోసం దుబాయికు వచ్చిన షారూఖ్ ఖాన్‌ను చూసిన జనం అప్పట్లో సామాజిక మాధ్యమాలలో కూడా ఆ ఫోటోలను షేర్ చేసుకోన్నారు.

విదేశాలలో హిందీ సినిమా ....

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 100కు పైగా దేశాలలో 8000 స్ర్కీన్లపై ప్రదర్శితమవుతున్న పఠాన్.. బాక్సాఫీసు బద్దలు కొడుతుంది. విదేశాలలో విడుదలైన తొలి రోజు 36.69 కోట్ల రూపాయాలతో మొదలై 540 కోట్లకు పఠాన్ చేరుకోగా, అందులో అత్యధికంగా గల్ఫ్ దేశాలలో వసూలయింది.

సౌదీ అరేబియాలో 53 స్క్రీన్ల పై ప్రదర్శితమవుతున్న మొట్టమొదటి చిత్రమని సౌదీలోని సినీ పరిశ్రమలో పని చేసే నవీన్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అయిదు రోజులలోపు 25 మిలియన్ డాలర్లకు చేరుకొన్న మొట్టమొదటి హిందీ సినిమాగా పఠాన్‌ను సినీ పరిశ్రమ విశ్లేషకులు పెర్కొంటున్నారు. గల్ఫ్ దేశాలలో గురువారం నుండి ఆదివారం వరకు వినోద రోజులుగా భావిస్తుండగా యూరోప్, అమెరికా ఇతర దేశాలలో శుక్రవారం నుండి ఆదివారం వరకు వసూలయిన కలెక్షన్ల ఆధారంగా సినిమా బాక్సాఫీసు రేటింగును నిర్ణయిస్తారు. ఈ విధంగా ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలలో అతి పెద్ద హిట్‌ సినిమాగా పఠాన్ గత ఆయిదు రోజులుగా రికార్డుకెక్కింది.

గల్ఫ్ దేశాలలో ఇప్పటి వరకు 2018లో విడుదలయిన పద్మావత్ సినిమా మాత్రమే 10.8 మిలియన్ డాలర్ల వసూళ్లతో హిట్‌గా నిలిచింది. ఇక భారతదేశంలో మొత్తంగా చూస్తే బహుబలి-2 హిట్‌గా ఉన్నా గల్ఫ్ దేశాలకు వచ్చే వరకు పద్మావత్ హిట్‌గా ఉండగా ఇప్పుడు పఠాన్ సినిమా దుమ్ము రేపుతుంది.

పఠాన్ అనే ఒక ఏజెంటు భరతమాత కోసం చేసే సాహసోపేతమైన పోరాటంగా ఈ సినిమా ఇంటా బయట విశేష ప్రాచుర్యం లభించడానికి దీన్ని వివాదస్పదం చేయడం కారణం. వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా దక్కని ప్రచారం కొందరు మతోన్మాదుల కారణంగా ఉచితంగా దక్కింది. అంతకు ముందు పద్మావత్ కూడా ఇదే రకంగా ఉత్తి ప్రచారం పుణ్యమా అని రికార్డు సృష్టించింది. ఆ సినిమాలో కూడా పఠాన్‌లో నటించిన నాయిక దీపిక పడుకోన్ పద్మావత్ చిత్రంలోనూ నటించింది.

ఎవరీ పఠాన్, ఏమిటీ పఠాన్ల కథ

పఠాన్... అఫ్ఘానిస్తాన్ మూలాలున్న ఈ తెగకు చెందిన వారి పేర్లలో చివరగా ఖాన్ అని ఉంటుంది. ఏ పేరులోనైనా చివరకు ఖాన్ ఉందంటే అతను లేదా అమె పఠాన్.

మై నేమ్ ఈస్ ఖాన్ నుండి పఠాన్ వరకు... హిందీ సినిమా ఒక అధ్యాయాన్ని అధిగమించింది. పఠాన్ చలన చిత్రం కథా నాయకుడు షారూఖ్ ఖాన్ స్వయాన పఠాన్. “ మెహమాన్ నవాజీ పఠాన్ కే ఘర్ పర్” (పఠాన్ ఇంటి వద్ద అతిథ్యం) అని ముంబాయిలోని తన నివాసం ముందు గూమిగూడిన అభిమానులను ఉద్దెశించి ఆయన సామాజిక మాధ్యమాలలో చేసిన పోస్టుకు విశేష స్పందన లభించింది. గతంలో కూడా ఒకసారి తన పూర్వీకులు అఫ్ఘానిస్తాన్ వారిని కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించడం జరిగింది. మరో ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), ఫెరోజ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తండ్రి ప్రఖ్యాత కథా రచయిత సలీం ఖాన్ వీరందరి పూర్వీకులు కూడా అఫ్ఘానిస్తాన్ లేదా దాని పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోని పఖ్తూన్‌ఖ్వా నుండి అవిభక్త భారతదేశానికి వచ్చిన వారే. అమితాబచ్చన్‌ను నటుడిగా నిలబెట్టిన జంజీర్ (1973) చిత్రంలో అమితాబచ్చన్ కంటే అందులో విలన్ పాత్రలో నటించిన పఠాన్ అయిన షేర్‌ఖాన్ విలక్షణ నటన కారణమంటారు.

తెలుగు నాట పఠాన్లు ....

ఇక తెలుగు నాట కడప జిల్లా రాయచోటి నుండి మొదలు అటు శ్రీకాకుళం వరకు ఏలిన నవాబులు లేదా ఫౌజుదారులలో అత్యధికులు పఠాన్లు. ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఆధిపత్య పోరులో ఇద్దరి మధ్య పఠాన్ పాలకులు లాభపడ్డారు. యానాం, మచిలీపట్నంలను ఫ్రెంచి, డచ్ కంపెనీలకు అటు తిరుమల తిరుపతి దేవస్థానాలను ఈస్టిండియా కంపెనీకి అప్పగించింది కూడా పఠాన్లే. అదే విధంగా నిజాం, టిప్పు సుల్తాన్ వైరం నుండి మొదలు విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య పంచాయితీల వరకు కూడా పఠాన్లు ప్రయోజనం పొందారు. బొబ్బిలి అనే పేరు కావడానికి కూడా షేర్ మోహ్మద్ ఖాన్ అనే పఠాన్ కావడం అశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇక గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న పాకిస్తానీయులలో పంజాబీల తర్వాత పఠాన్ల సంఖ్య ఎక్కువ. దుబాయి నగరంతో పాటు గల్ఫ్‌లోని ఇతర ప్రముఖ నగరాలలోని దాదాపు టాక్సీ డ్రైవర్లందరు కూడా పాకిస్తాన్‌కు చెందిన పఠాన్లు. ఇతర రంగాలలో ప్రత్యేకించి నిర్మాణ రంగంలో తీవ్ర ఉష్ణోగ్రతలో సిమెంట్, తారు వేసే పనులలో వీరి సంఖ్య ఎక్కువ. ఇక మాతృభూమి విషయానికి వస్తే, కశ్మీర్ హింసాకాండలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులలో అనేకులు పఠాన్లు అదే విధంగా పాకిస్తాన్‌లో జరిగే నిత్య హింసలో కూడా వీరి పాత్ర ప్రముఖమని చెబుతారు.

అంతిమంగా సినిమా అనేది వినోదం.. దాన్ని వినోదంగానే పరిగణించాలి. ఇతివృత్తం ఏదైనా సినిమాలోని కళా స్వభావాన్ని అస్వాదించే భారతీయులు దాన్ని కేవలం ఒక కళా రూపంలో వీక్షిస్తుండడంతో పఠాన్ విజయవంతమైందని చెప్పవచ్చు.

Updated Date - 2023-01-31T17:26:44+05:30 IST