NRI: వైభవంగా తొలి అంతర్జాతీయ స్వరరాగ శతావధానం
ABN , First Publish Date - 2023-04-23T21:43:40+05:30 IST
సంగీత సరస్వతి సంపూర్ణ కృపా పాత్రులు, గాన విద్యాప్రవీణ, స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ మొట్టమొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినది.
సంగీత సరస్వతి సంపూర్ణ కృపా పాత్రులు, గాన విద్యాప్రవీణ, స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ మొట్టమొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినది. "వీధి అరుఁగు, నార్వే", "యస్ యస్ మ్యూజిక్ అకాడెమీ - ఇంటర్నేషనల్" సంస్థలు సంయుక్తంగా ఒక అపూర్వ అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ స్వరరాగ శతావధానం కార్యక్రమంలో భాగంగా అంతర్జాల వేదికపై నిర్విరామంగా ఏప్రిల్ 14 వ తేదీ నుండి మొదలుకొని ఏప్రిల్ 22వ తేదీ వరకు 17 దేశాల నుంచి సంగీతజ్ఞులైనటువంటి 108 మంది పృచ్ఛకులతో, 15 మంది సమన్వయకర్తలతో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది.

సరస్వతీ ఉపాసనే నాదోపాసన. ఆ నాదోపాసన స్వరరాగతాళ రసరమ్య రూపమై నాభీహృత్కంఠరసనాల నుండి ఉద్భవించడం అనేది ఒక అద్భుతమైన సునాద ప్రక్రియ అది కేవలం కారణజన్మములకే సాధ్యం. స్వయంగా ఆ వరాన్నిఅమ్మవారి కృపతో పొందిన వరపుత్రులు శృతియుత మధుస్రవంతీ స్వర మాధుర్యసమన్విత లలిత శాస్త్రీయసంగీత కళాపోషకులు పూజ్యుగురులు అవధాని గరికిపాటి వెంకట ప్రభాకర్ గారు. అవధాన ప్రక్రియలో భాగంగా సంగీతజ్ఞులైన పృచ్ఛకులు శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు అతి స్వల్పవ్యవధిలో ఒకసారి రాగ వర్ణనతో, మరోసారి నిషిద్ధస్వర విన్యాసంతో, ఒకతూరి రాగమాలికల కూర్పులతో, స్వరాక్షరాలతో, ఒకపరి రాగతాళరసమార్పుల కూర్పులతో బదులిస్తూ, అప్రస్తుత ప్రసంగ ప్రభంజనాన్నిఅలవోకగా అడ్డుకుంటూ, సంగీత పాలసముద్రం చిలకగా వచ్చిన అమృత గుళికలు తన స్వరరాగావధానంగా రూపుదాల్చిన కార్యక్రమమే ఈ స్వరరాగావధానం. ప్రభాకర్ ఎంతో సునాయాసంగా, అద్భుతంగా, అవలీలగా చేసారీ స్వరరాగావధానం. కొన్ని చోట్ల అవధాని గారి రసస్ఫూర్తి అనితరసాధ్యం అనేలా ప్రకటితమైంది. ఈ అపూర్వసంగీత విషయాల సారమును తెలుసుకొన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా సంతృప్తి చెంది, కరతాళ ధ్వనులతో తమ ఆమోదం తెలియచేసారు.

ఈ కార్యక్రమానికి సమనవ్యకర్తగా ఖతార్ నుండి విక్రమ్ సుఖవాసి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా తెలుగు భాషాసేవకులు, భాషాకోవిదులు కీ.శే. సముద్రాల లక్ష్మణయ్య గారి కుమారులు సముద్రాల విజయానంద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డా. విజయ్ భాస్కర్ దీర్ఘాశి గారు, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి , వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెం రాజు, తానా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు రత్న కుమార్, ఇంకా ఎందరో మహానుభావులు విచ్చేసి గురుదేవుల ఆమోఘమైన పాండిత్యం చూసి వేనోళ్ళ కొనియాడారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీధిఅరుఁగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల ఇలాంటి కార్యక్రమాలు ముందుతరాల వారికి ఒక నిఘంటువుగా ఉంటాయని తెలుపుతూ, గురువుగారి అపార ప్రతిభాపాటవాలకు మరియు సంగీతానికి చేస్తున్న కృషికి వారికి గౌరవ డాక్టరేట్ రావాలని కోరుకుంటూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సభలో గురుదేవులను సత్కరించుకున్న పిమ్మట నిర్వాహకులను, పృచ్ఛకులను, ముఖ్య అతిథులను, స్వయంసేవకులను, ఇంకా ప్రత్యక్షముగా, పరోక్షంగా సేవలందించిన అందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించారు. అంతర్జాతీయంగా మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ శతావధానం కార్యక్రమాన్ని వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పొందుపరిచి అంగీకార పత్రాన్ని అందజేశారు. గురుదేవులు అందరికీ శుభం కలగాలని, ప్రతి ఒక్కరికీ శుభాశీస్సులు అందించటంతో ఈ 4 రోజుల అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం మహాద్భుతంగా పూర్తయినది.

పూర్తి కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది లింక్స్‌పై క్లిక్ చేయండి
14 ఏప్రిల్ 2023 (ప్రారంభం): https://www.youtube.com/live/WKIutSKDuug
15 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/fCFCxZBDmh8
15 ఏప్రిల్ 2023 (సాయంత్రం): https://www.youtube.com/live/5Ictoq3Dc0k
16 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/rQkF_v0JI-s
16 ఏప్రిల్ 2023 (సాయంత్రం): https://www.youtube.com/live/a-wRSMI-JWw
22 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/kHKJ03GAvro
22 ఏప్రిల్ 2023 (ముగింపు): https://www.youtube.com/live/JPx3Dgs4aEM