NRI: ఎడారిలో ఆభాగ్యులకు అండగా జి.డబ్ల్యూ.సి.ఏ

ABN , First Publish Date - 2023-02-17T19:39:59+05:30 IST

ఎడారిలో అభాగ్యులకు అండగా నిలుస్తున్న జీ.డబ్ల్యూ.సీ.ఏ

NRI: ఎడారిలో ఆభాగ్యులకు అండగా జి.డబ్ల్యూ.సి.ఏ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కష్టసమయాల్లో మన బాధలను ఇతరులకు చెప్పుకుంటేనే కొంతైన స్వాంతన దక్కుతుంది. పరిష్కారం లభించే అవకాశమూ పెరుగుతుంది.

గల్ఫ్ దేశాలలోని(Gulf Countries) తెలంగాణ ప్రవాసీయులలో(Telangana NRIs) క్రీయాశీలకంగా ఉండే జి.డబ్ల్యూ.సి.ఏ అనే ప్రవాసీయుల సంస్థ సభ్యులు ఈ సూత్రాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు. దిక్కు మొక్కూ లేని పేదలకు అండగా నిలిచే ఈ సంస్థ మరో మారు తన మానవత్వ పరిమళాన్ని వెదజల్లింది. ఎడారినాట ఉపాధి కోసం వచ్చి ప్రతికూల పరిస్థితుల కారణాన స్వదేశానికి తిరిగి వెళ్ళి ఆర్థిక సమస్యలతో విసుగెత్తి ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన ధ్యాకం సురేష్ కుటుంబానికి జి.డబ్ల్యూ.సి.ఏ సంస్థ సభ్యులు అండగా నిలిచారు.

పండుగలు, పబ్బాలు జరుపుకునే పెద్దోళ్ళ సంఘాల తరహా కాకుండా సగటు కార్మికులు ప్రత్యేకించి ఇంటి డ్రైవర్లు, ఇతర చిన్న చితకా ఉద్యోగాలు చేసే తెలంగాణ యువత కలిసి ఏర్పాటు చేసుకోన్న గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ (జి.డబ్ల్యూ.సి.ఏ) సంస్థలో సింహభాగం సగటు పేదలే! అయినా తోటి వారికి కష్టమొచ్చిందంటే మాత్రం ఈ సభ్యులందరు కలిసి ప్రతిసారి తమకు తోచిన విధంగా బాధిత కుటుంబాలను ఆదుకొంటాయి.

జి.డబ్ల్యూ.సి.ఏ అధ్యక్షుడు ధోనికెని కృష్ణ విజ్ఞప్తి మేరకు సంస్థ సభ్యులందరు సురేష్ కుటుంబానికి ఒక లక్ష రూపాయాల నగదు ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందించారు.

2.jpg

సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలలో చాలిచాలనీ వేతనాలతో చిన్న చితకా ఉద్యోగాలు చేసుకొనే సగటు పేద ప్రవాసీయులు ఈ రకమైన విషాదకర పరిస్థితుల్లో పెద్దోళ్ళ కంటే పెద్దలమని పెద్ద మనస్సును చాటుకున్నారు. గల్ఫ్ దేశాలలో లేదా ఇక్కడి నుండి స్వదేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత మృత్యువాతపడ్డ అనేక మందిని వీరు తలాకొంత విరాళాలిచ్చి ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

చుక్క చుక్క నీటి బొట్టు కలిస్తే కదా సముద్రమైనా ఏర్పడేది అన్నారు దోనికేని కృష్ణ. ఉన్నత ఉద్యోగాలు చేసే విధ్యాధికులయిన సంపన్న వర్గాలకు పరిమితమైన తెలంగాణ ప్రవాసీ లోకంలో సగటు పేద కార్మికుడి గూర్చి గళమెత్తిన వ్యక్తిగా పేరొందిన ఆయన బిందువు బిందువు కలిసి నదిగా మారి గోదావరి ఆంధ్రప్రదేశ్ లో బంగాళా ఖాతంలో సంగమిస్తుంది, కానీ గోదావరి తెలంగాణలో నిజామాబాద్ జిల్లా నుండి ప్రవేశించి నిర్మల్ జిల్లా మీదుగా ప్రవహిస్తుండగా ఖానాపూర్ మండలంలో ఒక చోట చిన్న పాయగా చీలె సదర్ మాట్ కు సమీపంలో ఉన్న మస్కాపూర్ అనే గ్రామం కృష్ణ నివాసం.

కొన్నాళ్ళు దుబాయిలో పని చేసి స్వదేశానికి తిరిగి వెళ్ళిన కృష్ణ గ్రామం నుండి గల్ఫ్‌లోని తన కార్యకర్తల యంత్రాంగంతో నిరంతరం సంప్రదిస్తుంటారు. ‘భీంశిలా’ పేర ఒక రెస్టారెంట్‌ను నడుపుతుంటారు. సుప్రసిద్ధ కేదార్‌నాథ్ మందిరంలో ఒక స్థూపం పేరు భీంశిలా. 2013లో వరద బీభత్సానికి కేదార్‌నాథ్ మందిర పరిసర ప్రాంతాలలో ప్రాణ నష్టం జరుగ్గా భీంశిలాలో ఉన్న వారికి ఏలాంటి నష్టం జరుగకుండా భీంశిలా కాపాడగల్గిందని విశ్వాసం.

గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కృష్ణ దాన్ని ఒక సామూహిక ఆవశ్యకతగా అందరు గుర్తించగలిగే విధంగా చేసారు. ఎడారి గడ్డపై ఉన్న పేద తెలంగాణ ప్రవాసీయులకు ప్రభుత్వ పరంగా ఎన్నారై పాలసీ అనేది ఒక భరోసా.. ఒక భీంశిలా అని కృష్ణ అంటారు.

1.jpg

Updated Date - 2023-02-17T20:23:13+05:30 IST