Arun Subramanian: ఎవరీ అరుణ్ సుబ్రహ్మణ్యన్..? అమెరికా సెనేట్ ఏరి కోరి మరీ ఈ భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని ఇవ్వడం వెనుక..!

ABN , First Publish Date - 2023-03-08T21:33:19+05:30 IST

అరుణ్ సుబ్రహ్మణ్యన్ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తిగా ఎంపికైన తొలి దక్షిణాసియా సంతతి జడ్జిగా తాజాగా రికార్డు సృష్టించారు.

Arun Subramanian: ఎవరీ అరుణ్ సుబ్రహ్మణ్యన్..? అమెరికా సెనేట్ ఏరి కోరి మరీ ఈ భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని ఇవ్వడం వెనుక..!

ఎన్నారై డెస్క్: అరుణ్ సుబ్రహ్మణ్యన్(Arun Subramanyam)..న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తిగా(Southern district of Newyork Judge) ఎంపికైన తొలి దక్షిణాసియా సంతతి జడ్జిగా తాజాగా రికార్డు సృష్టించారు. ఆయన ఎంపికకను సెనెట్ ఆమోదముద్ర వేసింది. అమెరికా పెద్దల సభ(Senate) అరుణ్‌ను 58-37 మెజారిటీతో ఎన్నుకుంది. ఈ సందర్భంగా సెనెట్ మెజారిటీ లీడర్ చక్ షూమర్ అరుణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘అరుణ్ చరిత్ర సృష్టించారు. తన జీవితమంతా సగటు అమెరికన్ తరపున పోరాడారు. ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ప్రజ్ఞ గొప్పది’’ అంటూ అరుణ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.

సుబ్రహ్మణ్యన్ పెన్సిల్వేనియా(Pennsylvania) రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్(Pittsburg) నగరంలో 1979లో జన్మించారు. భారతీయులైన ఆయన తల్లిదండ్రులు(Indian immigrants) 1970 దశకం తొలినాళ్లలో అమెరికాకు వలస వెళ్లారు. అరుణ్ తండ్రి అమెరికాలో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి కూడా ఉద్యోగస్తురాలే. అరుణ్..కేస్ వెస్టర్న్ రిసర్వ్ యూనివర్సిటీ‌లో డిగ్రీ చదువుకున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులుగా డిస్టింక్షన్‌లో పాసయ్యారు. మూడేళ్ల అనంతరం.. కొలంబియా లా స్కూల్‌లో న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. జెమ్స్ కెంట్ అండ్ హార్లన్ ఫిస్కీ స్టోన్ స్కాలర్‌గా నిలిచారు. అంతేకాకుండా..యూనివర్సిటీకి చెందిన కొలంబియా లా రివ్యూ పత్రికలో ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్స్ ఎడిటర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం ఆయన సూస్మన్ గాడ్‌ఫ్రీ ఎల్ఎల్‌పీ సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. 2006-07 మధ్య కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బేడర్ గిన్స్‌బర్గ్‌ వద్ద లా క్లర్క్‌గా చేశారు. వినియోగదారుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే అరుణ్ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి పలు కేసుల్లో బాధితుల పక్షాన బలమైన వాదనలు వినిపించారు. నోవార్టిస్ ఫార్మాసిటుకల్స్ కేసులో ఆయన విజయం సాధించడంతో అమెరికా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సుమారు 400 మిలియన్ డాలర్లు దక్కాయి. తన రంగంలో అద్భుత ప్రతిభ కనబర్చిన అరుణ్‌ను సెనెట్ తాజాగా న్యాయమూర్తిగా ఎంపిక చేసింది.

Updated Date - 2023-03-08T21:33:19+05:30 IST