Tiruppavai: ఆ తండ్రి పేరుకు ముందు ఊరు పేరు...

ABN , First Publish Date - 2023-01-13T22:42:11+05:30 IST

మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్య మోహనుడివల్ల అంతటా... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Tiruppavai: ఆ తండ్రి పేరుకు ముందు ఊరు పేరు...
Andal Tiruppavai Pasuram 30

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం చివరిరోజు; తిరుప్‌పావై చివరి ముప్పయ్యో పాసురమ్ రోజు.

పాసురమ్ 30

తిరుప్‌పావై వల్ల ప్రయోజనమేమిటో చివరి‌ ముప్పయ్యోపాసురమ్ ద్వారా ఉన్నతంగా ఉగ్గడిస్తోంది ఆణ్డాళ్; అదేమిటో తెలుసుకుందాం రండి...

మూలం-

వఙ్గక్‌కడల్ కడన్ద మాదవనైక్ కేసవనై

తిఙ్గళ్ తిరుముగత్తు సేయిళ్షయార్ సెన్ఱిరైఞ్‌జి

అఙ్గప్‌ పఱైకొణ్డ వాఱ్ట్రై అణిప్పుదువైప్

పైఙ్గమలత్ తణ్‌తెరియల్ బట్టర్‌పిరాన్ కోదై సొన్న

సఙ్గత్‌తమిళ్ష్‌మాలై ముప్పదుమ్ తప్పామే

ఇఙ్గిప్ పరిసురైప్పార్ ఈరిరణ్డు మాల్వరైత్తోళ్

సెఙ్‌కణ్ తిరుముగత్తు సెల్వత్తిరుమాలాల్

ఎఙ్గుమ్ తిరువరుళ్ పెఱ్ట్రిన్బుఱువరెమ్‌పావాయ్!

తెలుగులో-

అలలకడలిని మథించిన మాధవుణ్ణి, కేశవుణ్ణి

జాబిలిలాంటి మేలైన మోములతో నగలుపెట్టుకున్నవాళ్లు వెళ్లి కలిసి

అక్కడ తప్పెటను పొందిన వైనాన్ని రమ్యమైన విల్లిపుత్తూరు వాసి

కొంగొత్త కమలాల చల్లని మాలల బట్టర్‌పిరాన్ కోదై చెప్పిన

ఆశంసనీయమైన ముప్పై తమిళ్ష్ గీతాలను తప్పకుండా

ఇక్కడ పాడుకునేవాళ్లు కొండల్లాంటి నాలుగు భుజాలతో,

ఎఱ్ఱనికళ్లతో మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్యమోహనుడివల్ల

అంతటా మేలైన అనుగ్రహాన్ని‌ పొంది ఆనందంగా ఉంటారు; నా చెలీ!

అవగాహన-

క్షీరసాగరాన్ని మందరపర్వతంతో మథిస్తూండగా ఒకదశలో ఆ పర్వతం ఒరిగిపోతుంది. ఆ సమయంలో‌ మహావిష్ణువు కూర్మావతారంలో వెళ్లి దాన్ని పడిపోకుండా నిలిపి సాగర మథనం జరిగేట్లు చేస్తాడు. అందుకే "అలలకడలిని మథించిన మాధవుణ్ణి, కేశవుణ్ణి" అని అంది ఆణ్డాళ్.

"జాబిలిలాంటి మేలైన మోములతో నగలుపెట్టుకున్నవాళ్లు ..." అని అంటోంది. తొలి పాసురమ్‌లో "నగలుపెట్టుకున్న వాళ్లలారా" అంటూ గోపకన్యల్ని మేలినోముకు ఆహ్వానించింది ఆణ్డాళ్. నగలుపెట్టుకున్నవాళ్లు అనడం భక్తి భావనలు కలిగినవాళ్లు అని సూచించడం. భక్తిభావనలతో దైవాన్ని కలిసి అనుగ్రహాన్ని పొందాం అని చెబుతోంది.

తమిళ్షులకు ఒక వ్యక్తి పేరుకు ముందు తండ్రి పేరు వస్తుంది. ఆ తండ్రి పేరుకు ముందు ఊరు పేరు ఉంటుంది. ఆ విధంగా తన ఊరు రమ్యమైన విల్లిపుత్తూరు అని, తన తండ్రి పేరు బట్టర్‌పిరాన్ అని, తనపేరు కోదై అని చెబుతోంది ఆణ్డాళ్. విల్లిపుత్తూర్ బట్టర్‌పిరాన్ అన్నది పెరియ ఆళ్ష్వార్ అసలు పేరు. పిరాన్ అంటే 'వీడిపోనివాడు' అని అర్థం. దైవాన్ని అంటిపెట్టుకునే ఉండే పురుషుణ్ణి పిరాన్ అని, స్త్రీని 'పిరాట్టి' (వీడిపోనిది) అని అంటారు. పెరుమాళ్(మహావిష్ణువు)కు గర్భాలయ కైంకర్యాలు చేసే వ్యక్తిని బట్టర్ అని అంటారు. "రమ్యమైన విల్లిపుత్తూరు వాసి కొంగొత్త కమలాల చల్లని మాలల బట్టర్‌పిరాన్..." అంటూ తన తండ్రి బట్టర్‌పిరాన్ కొంగొత్త కమలాల చల్లని మాలలు కట్టి పెరుమాళ్ లేదా విష్ణువుకు సమర్పించే వ్యక్తి అని చెబుతోంది ఆణ్డాళ్.

కృష్ణుడి నుంచి తప్పెటను (అనుగ్రహాన్ని) పొందిన వైనాన్ని తాను పాటలుగా వివరించాక వాటిని "ఆశంసనీయమైన (తమిళ్ష్‌పదం సఙ్గ) ముప్పై తమిళ్ష్ గీతాలను..." అని అంటూ ఈ (తిరుప్‌పావై) ముప్పైగీతాలు ఆంశంసనీయమైనవి అని చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్. ఈ గీతాలను‌ పాడుకునేవాళ్లు "కొండల్లాంటి నాలుగు భుజాలతో, ఎఱ్ఱని కళ్లతో, మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్య మోహనుడివల్ల అంతటా మేలైన అనుగ్రహాన్ని‌ పొంది ఆనందంగా ఉంటారు" అని తెలియజేస్తోంది. "మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్య మోహనుడివల్ల అంతటా మేలైన అనుగ్రహాన్ని‌ పొంది ఆనందంగా ఉంటారు" అని చెప్పడం గొప్పగా ఉంది.

భగవద్గీత(అధ్యాయం11 శ్లోకం 43)లో అర్జునుడు నీకన్నా మేలైనవాడు లేడు అని కృష్ణుడితో ఇలా అన్నాడు:

"పితాऽసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్

నత్వత్సమోऽస్త్యభ్యధికఃకుతోऽన్యో లోకత్రయేऽప్యప్రతిమ ప్రభావ"

నువ్వు చరాచరాలకు, ఈ లోకానికి తండ్రిగానూ, పూజనీయుడివిగానూ అత్యున్నతమైన గురువుగానూ ఉన్నావు. నీకు సమానమైనవాడు లేడు. సాటిలేని ప్రభావం కలవాడా! నీకన్నా మేలైనవాడు మూడు లోకాల్లోనూ మఱొకడు ఎట్లా ఉంటాడు? అని ఆ మాటలకు అర్థం. అక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి మేలైనవాడు (అభ్యధికః) అన్నట్లుగానే ఇక్కడ అణ్డాళ్ కృష్ణుణ్ణి మేలైన మోమువాడైన మేలైన ఐశ్వర్య మోహనుడు అంటోంది.

అక్కడ, ఇక్కడ, అంతటా అనే పదాలు వాడుతూ పొంతనతో ఈ పాసురమ్‌లో భావాన్ని‌ నడిపించడం ఆణ్డాళ్ రచనానిర్మాణ కౌశలాన్ని తెలియజేస్తోంది.

భగవంతుడి మేలైన అనుగ్రహాన్ని‌ పొందితే‌ ప్రతి ఒక్కరూ మేలైన ఆనందంతో ఉంటారు. 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్' అని ముండకోపనిషత్ ఉపదేశించింది. ప్రతి జీవికీ ఆనందం ఆవసరం. ఆ ఆనందానికి దైవానుగ్రహం అవసరం. దైవానుగ్రహానికి భక్తి అవసరం. ఆ ఎఱుకను ఆణ్డాళ్ మనకు ఈ తిరుప్‌పావై ద్వారా అందించింది. తిరుప్‌పావైను అందుకోవడం కూడా ఆనందమే.

తిరుప్‌పావై ఆనందాన్ని మనకు అందించిన కృష్ణపిరాట్టి ఆణ్డాళ్‌కు ఆనందాభివందనం.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon02.jpeg

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-01-14T07:03:45+05:30 IST