Tiruppavai: తిరుప్‌పావైలో ఏముంది? ఆణ్డాళ్ ఎవరు?

ABN , First Publish Date - 2022-12-14T22:29:21+05:30 IST

ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష్ మూలంలో పంక్తి పంక్తికీ ఏ భావం ఉంటుందో తెలుగులోనూ పంక్తి పంక్తికీ ఆ భావమే అమరేట్టుగా ఈ అనువాదం..

Tiruppavai: తిరుప్‌పావైలో ఏముంది? ఆణ్డాళ్ ఎవరు?

ఆణ్డాళ్ తిరుప్‌పావై పరిచయం, వివరణ

-- రోచిష్మాన్

భారతదేశభక్తిసాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవసాహిత్యం నాలాయిరదివ్యప్రబన్దమ్‌లో తిరుప్‌పావై ఒకటి‌ ఆపై విశేషమైంది. తిరుప్‌పావై ముప్పై పాసురాల సంప్రయోగం. పాసురాలను సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్.

ఆణ్డాళ్ (ఆండాళ్ కాదు, ఆణ్డాళ్ అనడం సరైంది) సీతలాగా భూజాత. పెరియ ఆళ్ష్వార్ లేదా విష్ణుచిత్తర్ లేదా బట్టర్‌పిరాన్‌కు తులసీవనంలో శిశువుగా దొరికింది ఆణ్డాళ్. ఆణ్డాళ్ తొలి పేరు కోదై. కోదై అంటే పూలమాల అని అర్థం. ఆణ్డాళ్‌ను వేదాంతదేశికులు గోదా అని అన్నారు. వేదాంతదేశికులు గోదా స్తుతి చే(రా)శారు ఇలా:

"శతమఖమణినీలా చారుకల్హారహస్తా

స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసిందుః

అళకవినిహితాభిః స్రగ్బిః ఆకృష్టనాథా

విలసతుహృదిగోదా విష్ణుచిత్తాత్మజానః"

పరాశరభట్టార్యులు కూడా గోదా అని అన్నారు. ఆణ్డాళ్ పన్నెండుమంది ఆళ్ష్వార్లలో ఏకైక స్త్రీ. ఆణ్డాళ్ కాలం ఎనిమిదోశతాబ్ది. కొందఱు వ్యావహారిక శకం 716 నుండి 732 వఱకూ ఆణ్డాళ్ కాలమనీ, కొందఱు 776 ఆణ్డాళ్ జన్మ సంవత్సరమనీ చెబుతారు. ఆణ్డాళ్ జన్మనక్షత్రం పుబ్బ అనీ, రాశి సింహ అనీ చెబుతారు‌. భక్తిలో లోతుగా మునిగి ఉన్న పురుషుణ్ణి ఆళ్ష్వార్ అంటారు. స్త్రీ కాబట్టి ఆళ్ష్వాళ్ అనీ ఆ ఆళ్ష్వాళ్ ఆణ్డాళ్ అయింది అనీ చెబుతారు.

తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని‌ అర్థం. తిరు-పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతోంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై అనే ఉండాలి.

ఆళ్ష్వారులు పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది.‌‌ పాశురం కాదు. తమిళ్ష పదాలలో శ కారం ఉండదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు మ్ ఉండాలి.‌ పాసురమ్ అనడమే సరైంది‌.

తిరుప్‌పావై లోని పాసురమ్ ఎనిమిది పంక్తుల రచన. మౌలికంగా ఈ పాసురాలకు ఇయల్ తరవిణై కొచ్చక కలిప్‌పా ఛందస్సు. ఆ ఛందోనియమాలను‌ దాటి కూడా తిరుప్‌పావై పాసురాలు సాగాయి. ఈ పాసురాల వ్యక్తీకరణలకు నిగూఢార్థాలు కూడా ఉన్నాయని అర్థమౌతోంది.

ప్రతి పాసురమ్‌లోనూ 'ఓలాల నా చెలీ!' అనేది భావానికి అతీతమైన మకుటంగా ఉంటుంది. తమిళ్ష్‌లో ఇది 'ఏల్ ఓర్ ఎమ్‌పావాయ్'. తమిళ్ష గ్రామీణ ఊతపదాలు ఏల్ ఓర్ వీటికి నా (లేదా మా) కన్నెపిల్లా అన్న అర్థం వచ్చే ఎమ్‌పావాయ్ కలిసింది. ఏల్ ఓర్ లు కలిసిపోయి ఏలోర్ అయి, అది ఎమ్‌పావాయ్‌తో కలిసిపోయి ఏలోరెమ్‌పావాయ్ అయ్యాక దానికి పాసురాల పంక్తుల్లోని పూర్వపదాలతో సంధి జరిగి పడిన్దేలోరెమ్‌పావాయ్, ఉగన్దేలోరెమ్‌పావాయ్, సెప్పేలోరెమ్‌పావాయ్ వంటి రూపాల్లో మనకు తెలియవస్తూ ఉంటుంది.

మూలంలో ఉన్నట్టుగానే  ఈ తెలుగు అనువాదంలోనూ ప్రతి పాసురమూ ఎనిమిది పంక్తుల రచనగానే ఉంటుంది. తమిళ్ష్ మూలంలో పంక్తి పంక్తికీ ఏ భావం ఉంటుందో తెలుగులోనూ పంక్తి పంక్తికీ ఆ భావమే అమరేట్టుగా ఈ అనువాదం ఉంటుంది. తిరుప్‌పావైకు భావానువాదమో, స్వేచ్ఛానువాదమో చెయ్యడం, అనుసృజన చెయ్యడం సరికాదు. ఆణ్డాళ్ చెప్పిన తమిళ్ష పదాలకూ, చేసిన వ్యక్తీకరణలకూ నిగూఢార్థాలు కూడా  ఉన్నందువల్ల ఆణ్డాళ్ అర్థాల్నీ, వ్యక్తీకరణల్నీ యథాతథంగా అనువాదం చెయ్యాలి. తిరుప్‌పావై పాసురాల్లో సన్నివేశ చిత్రణ తొణికిసలాడుతూ ఉంటుంది. ఆ చిత్రణ‌ చెదిఱిపోకుండా, ఆణ్డాళ్ శైలి, శిల్పం‌ ఈ రెండూ లోపించకుండా అనువాదం జరగాలి. ఆ నిబద్ధతతోనే ఈ అనువాదం జరిగింది.

ఆణ్డాళ్ శ్రీ కృష్ణ భగవానుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ ఈ పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది.

ఆణ్డాళ్ విరచిత తిరుప్‌పావైకు తెలుగు లిపిలో మూలాన్నీ, మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగు అనువాదాన్ని , అవగాహనను పవిత్రమైన ధనుర్మాసంలో ఆంధ్రజ్యోతి వెబ్ ఎడిషన్ ద్వారా పాఠకులు ఆస్వాదించండి.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

Updated Date - 2023-01-14T22:53:40+05:30 IST