Tiruppavai: పెడసరివాళ్లను ఆకట్టుకునే మా మంచి గోవిందుడా...

ABN , First Publish Date - 2023-01-10T19:44:42+05:30 IST

పాల అన్నానికి పైపూతగా అఱిచేతి నుండి జాలువాఱేట్లు నెయ్యిపోసుకుంటాం... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Tiruppavai: పెడసరివాళ్లను ఆకట్టుకునే మా మంచి గోవిందుడా...
Andal Tiruppavai Pasuram 27

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవయ్యోడోరోజు; తిరుప్‌పావై ఇరవయ్యోడో పాసురమ్ రోజు.

పాసురమ్ 27

ఆణ్డాళ్, ఇరవయ్యేడోపాసురాన్ని ఇదిగో ఇలా ఇస్తోంది; అందుకుందాం రండి...

మూలం-

కూడారై వెల్లుమ్ సీర్కక్‌కోవిందా! ఉన్దన్నైప్

పాడిప్‌పఱై కొండు యామ్ పెఱు సమ్మానమ్;

నాడు పుగళ్షుమ్ పరిసినాల్ నన్ఱాగ

సూడగమే, తోళ్వళయే, తోడే, సెవిప్పూవే

పాడగమే ఎన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్,

ఆడైయుడుప్పోమ్, అదన్‌పిన్నే పాఱ్సోరు

మూడ నెయ్‌పెయ్దు ముళ్షఙ్గ్‌గై వళ్షివార

కూడియిరున్దు కుళిర్‌న్దేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

పెడసరివాళ్లను ఆకట్టుకునే మామంచి గోవిందుడా! నిన్ను

గానం చేసి, తప్పెటను అందుకుని మేం కానుకలు పొందుతాం;

దేశమే బాగా మెచ్చుకునే తీరులో

గాజులు, దండకడియాలు, దిద్దులు, చెవిపువ్వులు

నాణ్యమైన చెప్పులు వంటివి ధరిస్తాం;

శాలువల్ని కప్పుకుంటాం; అటుపైన పాల అన్నానికి

పైపూతగా అఱిచేతి నుండి జాలువాఱేట్లు నెయ్యిపోసుకుంటాం;

కలిసి ఉండి చల్లగా బతుకుతాం; ఓలాల నా చెలీ!

అవగాహన-

చాలమంది నాస్తికులు ఒకదశ తరువాత తమ తప్పు తెలుసుకుని ఆస్తికులైపోయిన చారిత్రికసత్యం మనకు తెలుసు. సరిగ్గా ఆ సత్యాన్నే "పెడసరివాళ్లను ఆకట్టుకునే మా మంచి గోవిందుడా" అంటూ తెలియజేస్తోంది ఆణ్డాళ్. నిన్ను గానం చేసి, తప్పెటను అందుకుని "కానుకలు పొందుతాం" అంటూ దైవగానం చేస్తూ తామూ ఎలా ఉంటామో చెబుతోంది. ఆ చెప్పడం "దేశమే బాగా మెచ్చుకునే తీరులో గాజులు, దండకడియాలు, దిద్దులు, చెవిపువ్వులు నాణ్యమైన చెప్పులు వంటివి ధరిస్తాం; శాలువల్ని కప్పుకుంటాం" అని చెబుతోంది.

నెయ్యి అత్యుత్తమమైన పదార్థం. ఏ మార్పూ పొందబోని స్థితి నెయ్యి.‌ పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ ఇలా రూపాంతరాలుంటాయి. నెయ్యికి రూపాంతరం ఉండదు. పాలను కాచి తోడుపెడితే పెరుగు, పెరుగును చిలికితే వెన్న, వెన్న కాచాక నెయ్యి వస్తాయి. పాలకు నెయ్యి ఉచ్చస్థితి. ఆణ్డాళ్ నెయ్యిని పరమాత్మకు ప్రతీకగా సూచిస్తోంది. పాల అన్నం వంటి తమ జీవితాలకు పైపూతగా నెయ్యిలాంటి పరమాత్మను నిలుపుకుంటాం అన్నదాన్ని సూచ్యార్థంగా చేసి "పాల అన్నానికి పైపూతగా అఱిచేతి నుండి జాలువాఱేట్లు నెయ్యిపోసుకుంటాం" అని చెబుతోంది ఆణ్డాళ్.‌‌

రెండవ పాసురమ్‌లో నోములో భాగంగా చెయ్యకూడని వాటిల్లో నెయ్యి తినం అని చెప్పిన ఆణ్డాళ్ ఇక్కడ నెయ్యి పోసుకుంటాం అని చెబుతోంది. దైవదర్శనానికి వెళ్లే ముందు నిష్ఠగా ఉపవాసం చెయ్యడం, దైవదర్శనం అయ్యాక తృప్తితో అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం అన్న ఆచరణే ఇది.

"కలిసి ఉండి చల్లగా బతుకుతాం" అంటూ 'కలిసి ఉండడమే చల్లగా బతకడం' అన్న వాస్తవాన్ని చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్.‌

పెడసరి అన్న‌ మాటతో మొదలయ్యే పంక్తితో పాసురాన్ని మొదలు పెట్టి, కలిసి ఉండి అన్న మాట ఉన్న పంక్తితో పాసురాన్ని ముగించింది ఆణ్డాళ్. భావం, శైలి, శిల్పం వీటి పరంగా ఉదాత్తమైన రచన ఇది. ఒక విశిష్టమైన రచన విప్పారడం అంటే ఇదే.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon02.jpeg

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-02-09T17:06:53+05:30 IST