Tiruppavai: ఇలాంటివారే మార్గశిర స్నానాన్ని కోరుకుంటారు...

ABN , First Publish Date - 2023-01-09T19:41:11+05:30 IST

ఆ బీజం సకల సృష్టికీ మూలం. వటపత్రం ఆదిశేషుడనీ,‌ ఆదిశేషుడంటే ఆధ్యాత్మికత అనీ... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Tiruppavai: ఇలాంటివారే మార్గశిర స్నానాన్ని కోరుకుంటారు...
Andal Tiruppavai Pasuram 26

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవయ్యాఱోరోజు; తిరుప్‌పావై ఇరవయ్యాఱో పాసురమ్ రోజు.

పాసురమ్ 26

నిన్ను గానం చేసి దుఃఖాన్ని తీర్చుకుని సంతోషిస్తాం అని కృష్ణుడితో చెప్పుకున్నాక ఆణ్డాళ్ ఇరవయ్యాఱో పాసురమ్‌గా ఇదిగో ఇలా అంటోంది...

మూలం-

మాలే! మణివణ్ణా! మార్గళ్షి నీరాడువాన్

మేలైయార్ సెయ్‌వనగళ్ వేణ్డువన కేట్టియేల్

ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన

పాలన్న వణ్ణత్తున్ పాఞ్‌జసన్నియమే

పోల్వన సఙ్గఙ్గళ్, పోయ్పాడుడైయనవే

సాలప్‌పెరుమ్ పఱైయే, పల్లాణ్డిసైప్పారే,

కోలవిళక్కే, కొడియే, విదానమే

ఆలిన్ ఇలైయాయ్! అరుళేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

మోహనా! రత్నవర్ణుడా! మార్గశిరస్నానం కోసం

ఉన్నతమైనవాళ్లు కావాల్సిన వాటిని‌ అడిగితే

భూలోకమంతా అదిరిపోయేట్టు మోగే

పాలరంగున్న నీ పాంచజన్యాన్ని

పోలి ఉండే పెద్ద పెద్ద శంఖుల్నీ,

చాలపెద్ద తప్పెటల్నీ, పల్లాణ్డు పాడేవాళ్లనూ

చక్కని దీపాల్నీ, ధ్వజాల్నీ, వితానాల్నీ

వటపత్రశాయీ! అనుగ్రహించు; ఓలాల నా చెలీ!

అవగాహన-

"మోహనా, రత్నవర్ణుడా, మార్గశిరస్నానం కోసం

ఉన్నతమైనవాళ్లు కావాల్సిన వాటిని‌ అడిగితే"

ఏమేం ఇవ్వాలో వాటిని ఇమ్మంటూ ఈ పాసురాన్ని చేసింది ఆణ్డాళ్.

మార్గశిర స్నానాన్ని కోరుకునేవాళ్లు ఉన్నతమైన వాళ్లు అవుతారు. స్నానం అంటే దైవచింతనకు ప్రతీక. దైవచింతనకు సిద్ధమైనవాళ్లు ఉన్నతమైనవాళ్లే.

మార్గశిరమాసం దైవారాధన మాసం. మార్గశిమాసాన్ని దేవతలమాసం అంటారు. ఇంగ్లిష్ కాలండర్ ప్రకారం డిసెంబర్ 21న లేదా 22న ఉత్తరాయణం మొదలౌతుంది. మన పంచాంగం ప్రకారం అప్పటికి‌ పుష్యమాసం వస్తుంది. పుష్యమాసం మొదలుగా ఆఱునెలలు ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి. పగలు దేవతలు మేలుకుని ఉంటారని ఉత్తరాయణాన్ని మంచి లేదా పుణ్యకాలమని అంటారు.

ఉత్తర, దక్షిణాయనాలు దేవతలకు ఒక దినం. దేవతలకు‌ ఒక దినం మనకు ఒక సంవత్సరం. పుష్యమాసం దేవతలదినారంభం. దానికి ముందు అంటే దినారంభానికి ముందు వచ్చే ఉషః కాలం (సూర్యోదయానికి 96నిమిషాల ముందు సమయం) గా మార్గశిరమాసాన్ని పరిగణించారు‌. అందుకనే మార్గశిరాన్ని గొప్పమాసం అని అన్నారు. మృగశీర్ష నక్షత్రంతో కలిన పౌర్ణమి ఏ మాసంలో వస్తుందో అదే మార్గశీర్ష లేదా మార్గశిరం. ఈ మార్గశిరానికి 'ఆగ్రహాయణికం' అనే పేరుంది. హాయనః అంటే సంవత్సరం అనీ, అగ్రం అంటే ఆరంభం అనీ అర్థాలు, వెరసి మార్గశిరం అంటే సంవత్సరారంభం అని. ఉత్తరాయణానికి ఉషఃకాలం మార్గశిరం. ఉషఃకాలం‌ జపం, తపస్సు వంటి వాటికీ, ఆరోగ్యానికీ శ్రేష్ఠమైన కాలం."మాసానామ్ మార్గశీర్షోऽహం" అని భగవద్గీత (అధ్యాయం 20 శ్లోకం 35)లో కృష్ణుడు అన్నాడు. చాలపూర్వంనాళ్లలో మార్గశిరంలో పంట ఇంటికి వచ్చేది. ఆ పంటను భగవంతుడికి అర్పించి దాన్ని 'అన్నయజ్ఞం' అనేవాళ్లు. మహాభారతం కాలంలో సంవత్సరం మార్గశిరంలో మొదలయ్యేది (అనుశాసనపర్వంలో ఈ విషయం ఉంది). వాల్మీకి రామాయణంలో మార్గశిరం మాసశిరోభూషణం అని చెప్పబడింది‌. హేమంత ఋతువులో వచ్చే ఈ మార్గశిరమాసం వాతావరణం రీత్యా ఆరోగ్యానికి ఎంతో మంచిదని‌ చెబుతారు. మాసశిరోభూషణం కనుక, దేవతారాధన మాసం కనుక ఆణ్డాళ్ మార్గశిరాన్ని ఎంచుకుంది.

పల్లాణ్డు అంటే మంగళాశాసనం. వైష్ణవసంప్రదాయంలో తిరువారాదనై, గోష్టి , సేవాకాలం‌ వీటిల్లో చివరగా పల్లాణ్డు పాడడం ఉంటుంది‌. అప్పటినాళ్లల్లో పూజారంభంలో శంఖనాదం ఉన్న కారణాన శంఖులు ఇంకా తప్పెటల్ని,‌‌‌ పల్లాణ్డు పాడేవాళ్లని, దీపాల్ని, ధ్వజాల్ని, వితానాల్ని ఇమ్మని వటపత్రశాయీ అని సంబోధిస్తూ కృష్ణుణ్ణి ఆణ్డాళ్ అడుగుతోంది‌‌. వితానం అన్నది తలపై ఉండే వస్త్రం. దీన్ని మేల్కట్టు, చాందినీ అనీ కూడా అంటారు.

వటపత్రశాయి రూపంలో విష్ణువు లేదా కృష్ణుడు మార్కండేయ మునికి దర్శనమిచ్చాడు. మఱ్ఱిచెట్టు ఆకు లేదా వటపత్రంపైన పసిపిల్లాడిలా కృష్ణుడు పడుకున్న స్థితిలో (శాయి) ఉంటాడు. వటవృక్షం పవిత్రమైన చెట్టుగా మన పూర్వుల చేత పరిగణించబడింది. వటపత్రం పవిత్రతకు సంకేతం. పసిపిల్లాడు బీజానికి సంకేతం. ఆ బీజం సకల సృష్టికీ మూలం. వటపత్రం ఆదిశేషుడనీ,‌ ఆదిశేషుడంటే ఆధ్యాత్మికత అనీ పరిగణిస్తారు‌‌. కనుక ఇక్కడ వటపత్రం పవిత్రతకు మాత్రమే కాదు ఆధ్యాత్మికతకూ సంకేతమే. వటపత్రశాయి కల్పాంతంలోనూ ఉంటాడు. ఏ పరిస్థితిలోనూ నాశనమవకుండా శాశ్వతుడై ఉంటాడు. సర్వమూ వటపత్రశాయిలో ఉంటాయి. కృష్ణుడు మఱ్ఱి ఆకుపై ఉన్న బీజం అనీ, శాశ్వతమై సకలానికీ మూలం అనీ చెప్పేందుకే ఆణ్డాళ్ వటపత్రశాయీ అని అంది.

అర్జునా! సకలభూతాలలో ఏది బీజం అయిందో అది నేను అని తెలియజేస్తూ "యచ్చాపి సర్వభూతానాం బీజం తదమహమర్జున" అని భగవద్గీత (అధ్యాయం 10 శ్లోకం 39)లో కృష్ణుడు చెప్పాడు.

"తెప్పగా మఱ్ఱాకుమీఁదఁ దేలాడువాఁడు ఎప్పుడూ లోకములనెల్ల నేలేటి వాఁడు" అనీ, "తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన" అనీ అన్నమయ్యా అన్నారు.

శ్రీవిల్లిపుత్తూర్ ఆణ్డాళ్ స్వస్థలం. ఆ ఊళ్లో వటపత్రశాయికి ప్రశస్తమైన ఆలయం ఉంది. ఆ వటపత్రశాయిని అనుగ్రహించమని ఈ పాసురమ్‌లో కోరుకుంది ఆణ్డాళ్.

ఈ శ్రీ విల్లిపుత్తూర్ ఆలయగోపురం తమిళనాడు ప్రభుత్వం ఆధికారిక చిహ్నంగా ఉంది.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon02.jpeg

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-01-09T23:41:22+05:30 IST