Tiruppavai: అతని కడుపులో నిప్పై నిలిచిన మహామోహనా...

ABN , First Publish Date - 2023-01-08T20:36:16+05:30 IST

మేలైన విభూతుల్నీ, వీరాన్నీ మేం గానం చేసి దుఃఖాన్ని తీర్చుకుని సంతోషిస్తాం అంటూ... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Tiruppavai: అతని కడుపులో నిప్పై నిలిచిన మహామోహనా...
Andal Tiruppavai Pasuram 25

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవయ్యైదోరోజు; తిరుప్‌పావై ఇరవయ్యైదో పాసురమ్ రోజు.

పాసురమ్ 25

ఆణ్డాళ్ కృష్ణుడికి అభివాదం చేశాక, తప్పెటను తీసుకోవడానికి వచ్చామని మనవి చేసుకున్నాక ఇదిగో ఇలా ఇరవయ్యైదో పాసురాన్ని పలుకుతోంది...

మూలం-

ఒరుత్తి మగనాయ్‌ప్ పిఱన్దు ఓరిరవిల్

ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర

తరిక్కిలానాగిత్తాన్ తీఙ్గు నినైన్ద

కరుత్తైప్ పిళ్షైప్పిత్తు కఞజన్ వయిఱ్ట్రిల్

నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే! ఉన్నై

అరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుది యాగిల్

తిరుత్తక్క సెల్వముమ్, సేవగముమ్ యామ్‌పాడి

వరుత్తముమ్ తీర్‌న్దు మగిళ్ష్ న్దేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

ఒకామెకు కొడుకువై పుట్టి ఒక రాత్రిలో

ఒకామెకు కొడుకువైపోయి గుట్టుగా పెరుగుతూండగా

సహించలేక చెడు చెయ్యాలనుకున్న

చింతనల్ని చెడగొట్టి, కంసుడి కడుపులో

నిప్పై నిలిచిన మహామోహనా! నిన్నే

అర్థించి వచ్చాం; తప్పెటను ఇచ్చేస్తే

మేలైన విభూతుల్నీ , వీరాన్నీ మేం గానం చేసి

దుఃఖాన్ని తీర్చుకుని సంతోషిస్తాం; ఓలాల నా చెలీ!

అవగాహన-

దేవకికి కొడుకై పుట్టి ఒక్క రాత్రిలో యశోదకు కొడుకై పోయాడు కృష్ణుడు. దాన్నే "ఒకామెకు కొడుకువై పుట్టి ఒక రాత్రిలో ఒకామెకు కొడుకువైపోయి..." అని చెబుతోంది ఆణ్డాళ్. తనకు కీడు చెయ్యాలనుకున్న కంసుడి ఆలోచనల్ని భగ్నం చేసి, ఆ కంసుడికే ముప్పైన వైనాన్ని స్మరించుకుంటూ "చెడు చెయ్యాలనుకున్న చింతనల్ని చెడగొట్టి..." అనీ, "కంసుడి కడుపులో నిప్పై నిలిచిన..." అనీ అంటోంది. కడుపులో నిప్పై అని అనడం గొప్పగా ఉంది. కృష్ణుణ్ణి "మహామోహనా" అని అంటూ "నిన్నే అర్థించి వచ్చాం, తప్పెటను ఇచ్చేస్తే... " అని అంటూ అనుగ్రహాన్ని అర్థిస్తోంది‌ ఆణ్డాళ్. అంతేకాదు "మేలైన విభూతుల్నీ, వీరాన్నీ మేం గానం చేసి దుఃఖాన్ని తీర్చుకుని సంతోషిస్తాం" అంటూ దైవగానం చేస్తే దుఃఖం తీరిపోగా సంతోషం కలుగుతుంది అనే సత్యాన్ని వక్కాణిస్తోంది ఆణ్డాళ్.

'చెప్పడం' అన్నది చాలచక్కని రూపాన్ని పొందింది ఈ‌ పాసురమ్‌లో.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon02.jpeg

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-01-09T07:13:01+05:30 IST