Tortoise, Rat, Deer: ఐకమత్యమే అసలైన బలం

ABN , First Publish Date - 2023-03-30T22:58:53+05:30 IST

ఒక చెరువుకు దగ్గరగా కాకి, తాబేలు, ఎలుక ఉండేవి. ఈ ముగ్గురు స్నేహితుల దగ్గరకు ఒక రోజు ఒక జింక వచ్చింది. ‘ఎందుకు వచ్చావు?’ ఇక్కడికి అని అడిగింది తాబేలు.

 Tortoise, Rat, Deer: ఐకమత్యమే అసలైన బలం

దేశం- మాల్దీవులు

ఒక చెరువుకు దగ్గరగా కాకి, తాబేలు, ఎలుక ఉండేవి. ఈ ముగ్గురు స్నేహితుల దగ్గరకు ఒక రోజు ఒక జింక వచ్చింది. ‘ఎందుకు వచ్చావు?’ ఇక్కడికి అని అడిగింది తాబేలు. ‘నేను అడవిలో ఉండేదాన్ని. నాకెవరూ స్నేహితుల్లేరు. మీతో స్నేహంగా ఉండొచ్చా?’ అని అడిగేసరికి ముగ్గరూ ఒకరికొకరు చూసుకున్నారు. ఈ లోపు తాబేలు ముందుకు వచ్చి ‘ఇపుడు మనం నలుగురం మిత్రమా’ అన్నది. జింక సంతోషపడింది.

ప్రతిరోజూ ఆహారంకోసం వెళ్లి సాయంత్రానికల్లా ఒకేచోట కలిసేవాళ్లు నలుగురు స్నేహితులు. ఒక రోజు జింక ఇంటికి రాలేదు. తాబేలు, కాకి, ఎలుక కంగారు పడ్డారు. అనుకున్నదే తడవుగా కాకి గాల్లోకి ఎగిరి పైనుంచి చూసింది. అడవి మధ్యలో జింక అరుపులు వినిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే వలలో బంధీ అయింది జింక. తిరిగి ఇంటికి వెళ్లి తాబేలు, ఎలుకతో ఈ విషయాన్ని చెప్పింది కాకి. ఎలుకను తనమీద కూర్చోబెట్టుకుని జింక దగ్గరకు తెచ్చింది. ఈ లోపు తాబేలు కూడా మెల్లగా అక్కడకు వచ్చింది. వల పక్కనబడింది. జింక నిలబడి ఉంది. అంతలో దూరం నుంచి వేటగాడు చూశాడు. పరిగెత్తుకొచ్చాడు. ఈ లోపు కాకి, జింక పారిపోయాయి. ఎలుక దగ్గర ఉండే కన్నంలో దాక్కుంది. తాబేలు మెల్లగా నడుస్తోంటే.. వేటగాడు వచ్చి దాన్ని సంచిలో వేశాడు. తీసుకెళ్లాడు. ఆ తర్వాత ముగ్గురు మిత్రులు కలసి ఆలోచించారు. కాకికి ఓ ఉపాయం తోచింది. వేగంగా కాకి, జింక వేటగాడు ఇంటికి వెళ్లే మార్గంలోకి వెళ్లాయి. జింక చచ్చినట్లు పడుకుంది. జింక కన్నును పొడిచినట్లు కాకి నటించింది.

వేటగాడు దారిలో వస్తూ ఇది చూశాడు. జింక దొరికిందని సంతోషపడి పరిగెత్తాడు ముందుకు. క్షణాల్లో వెనకనుంచి ఎలుక సంచి దగ్గరకు వచ్చి కొరికేసింది. తాబేలు, ఎలుక వెళ్లి పొదల్లో దాక్కున్నారు. దగ్గరకు వెళ్లాడో లేదో జింక, కాకి వేగంగా పారిపోయాయి. వేటగాడికి విషయం అర్థమైంది. చేసేదేమీ లేక ఖాళీ చేతులతో ఇంటికెళ్లిపోయాడు. నలుగురు స్నేహితులు మళ్లీ కలసి ఆనందంగా జీవితం గడిపారు.

Updated Date - 2023-03-30T22:58:53+05:30 IST