Sankranti: హాయ్‌ లిటిల్స్‌..

ABN , First Publish Date - 2023-01-15T02:07:55+05:30 IST

ఈ రోజు సంక్రాంతి పండగ. మనకు కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండగ. సంక్రాంతి అంటే ముగ్గులు. ముగ్గుల మధ్యలో గొబ్బిళ్లు. రంగురంగుల ముగ్గులు ఇళ్లకి అందాన్ని తెస్తాయి.

Sankranti: హాయ్‌ లిటిల్స్‌..

కథ

ఈ రోజు సంక్రాంతి పండగ. మనకు కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండగ. సంక్రాంతి అంటే ముగ్గులు. ముగ్గుల మధ్యలో గొబ్బిళ్లు. రంగురంగుల ముగ్గులు ఇళ్లకి అందాన్ని తెస్తాయి. గంగిరెద్దుల కోలాటాలు ఇక చెప్పనక్కర్లేదు. అంతేనా సందళ్లు, సరదాలు. ఇక ఎడ్ల పందేలు, కోళ్లపందేలు బోలెడు. మీరంతా.. రంగురంగుల గాలిపటాలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోండి. అప్పుడే సంక్రాంతికి అసలు సిసలైన మజా వస్తుంది!

అసలు ఈ సంక్రాంతి పండగకి ఎందుకింత ప్రాముఖ్యం అంటే.. పంట చేతికొచ్చే సమయం కాబట్టి. పల్లెల్లోని రైతులు తమ ఇంటికి ధాన్యలక్ష్మి నడిచొచ్చినవేళ.. ఆనందాల సిరులే సంపదగా ఈ పండగను జరుపుతారు. కొత్త ధాన్యం, కొత్త బియ్యం రుచి, కొత్త బట్టలు ఆహా.. సంక్రాంతి అంటే ఆనందాల కాంతులే ప్రతి ఇంటా విరుస్తాయి.

క్రాంతి అంటే ముందుకు జరగటం అనే అర్థం సంస్కృతంలో ఉంది. సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించే సందర్భానే ‘సంక్రాంతి’ పండగ చేసుకుంటాం. అనగా మకరరాశి వస్తుందనమాట. సూర్యుడి మార్పును సూచించే ఈ పండగను మన దగ్గర ‘మకర సంక్రాంతి’ అని పిల్చుకుంటాం. మనలాగే దేశంలోని పలుచోట్ల ఈ పండగను పలు రకాల పేర్లతో జరుపుతారు. తమిళనాడులో ‘పొంగల్‌’ అంటారు. ఈ పండగ సందర్భంగా అక్కడ జరిగే ‘జల్లికట్టు’ దేశవ్యాప్తంగా పేరుగాంచింది. పంజాబ్‌లో ‘లోరీ’, అస్సాంలో ‘బిహు’, గుజరాత్‌లో ‘మకర్‌ సంక్రాంతి’.. ఇలానే పశ్చిమబెంగాళ్‌, ఈశాన్య రాష్ర్టాల్లో పలుపేర్లతో ఈ పండగను జరుపుతారు.

మొత్తానికి ఇళ్లంతా హాయిగా.. ఉదయాన్నే పాలు, కొత్త ధాన్యం కలిపిన వంటల రుచి చేసుకుని తినటం. పట్టణాలనుంచి పల్లెలకు తరలివెళ్లి ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకోవటం అందంగా, అద్భుతంగా ఉంటాయి. పల్లె అందాలు, మనుషుల మధ్య ఆప్యాయతలకు ఇలాంటి పండగలే వేదిక. మీ అందరికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు!

Updated Date - 2023-01-15T02:07:56+05:30 IST