Birbal: బీర్బల్‌ చెప్పిన పునర్జన్మ కత!

ABN , First Publish Date - 2023-09-07T23:24:49+05:30 IST

అక్బర్‌, బీర్బల్‌ మంచి స్నేహితుల్లానే ఉండేవాళ్లు. కనుకనే ఒక రోజు బీర్బల్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని అక్బర్‌ అనుకున్నాడు. ఈ విషయం అక్బర్‌ బంధువైన హుస్సేన్‌కు నచ్చలేదు. ఆ విషయం అక్బర్‌కు తెలిసింది.

 Birbal: బీర్బల్‌ చెప్పిన పునర్జన్మ కత!

అక్బర్‌, బీర్బల్‌ మంచి స్నేహితుల్లానే ఉండేవాళ్లు. కనుకనే ఒక రోజు బీర్బల్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని అక్బర్‌ అనుకున్నాడు. ఈ విషయం అక్బర్‌ బంధువైన హుస్సేన్‌కు నచ్చలేదు. ఆ విషయం అక్బర్‌కు తెలిసింది. మరుసటి నాడు ఇద్దరినీ పిలిపించాడు. బీర్బల్‌, హుస్సేన్‌ను పక్కపక్కనే నిలబడుకోమన్నాడు. వారిద్దరికీ రెండు ఉత్తరాలు ఇచ్చాడు. రెండు ఉత్తరాలు పొరుగు దేశం బర్మా రాజుకు అందిస్తే ‘తగిన ఫలితం’ ఉంటుందని చెప్పాడు. వెంటనే ఇద్దరూ బర్మాకు వెళ్లిపోయారు. అక్బర్‌ శాంతంగా ఉంటే.. హుస్సేన్‌ మాత్రం కోపంగా ఉన్నాడు.

బర్మాదేశానికి వెళ్లిన తర్వాత ఇద్దరూ సేద తీరారు. ఒకేసారి మాట్లాడుకుని రాజుగారి దగ్గరకు వెళ్లి ఆ రెండు ఉత్తరాలను ఇచ్చారు. ‘ఉత్తరం అందిన వెంటనే తలను తీసేయండి. ఇది నా ఆజ్ఞ’ అని అక్బర్‌ పేరు ఉంది అందులో. బర్మా రాజు ఆశ్చర్యానికి గురయ్యారు. అక్బర్‌గారు ఆదేశించారు కనుక పాటించాలనుకున్నాడు. ఇద్దరికీ విషయం చెప్పాడు. బీర్బల్‌ ప్రశాంతంగా ఉంటే.. హుస్సేన్‌ వణికిపోయాడు. ఇద్దరినీ సైనికులు బంధించారు. ఆ రాత్రికే సంహరింటానికి సిద్ధం చేశారు. బీర్బల్‌, హుస్సేన్‌లను ఒక చోటకు చేర్చారు. కత్తితో సంహరించేప్పుడు రాజు ఏదైనా కోరిక కోరుకోమన్నారు. బీర్బల్‌ ఇలా మాట్లాడారు.. ‘బర్మా దేశపు రాజావారు. నాకెలాంటి కోరికల్లేవు. చావు అంటే భయమేమీ లేదు. కాకపోతే బర్మాదేశంలో ఎవరైనా ఇలా రాజుగారి ముందు సంహరించబడితే.. మరుజన్మలో కచ్చితంగా ఈ దేశానికి రాజుగా పుడతారని.. మా అక్బర్‌ గారికి ఓ జ్యోతిష్యుడు చెప్పారు.

అందుకే మీ దగ్గరకు పంపారు. వచ్చే జన్మలో అయినా రాజును అవుతా’ అన్నాడు గర్వంగా. దీంతో బర్మా రాజు దిగులుపడ్డాడు. అదేంటీ.. ‘బర్మారాజుగా మేమే ఉండాలి. మా వారసులే ఉండాలి’ అంటూ వాళ్లిద్దరినీ వదిలేశారు. రాజరికం మీద ఇంత ప్రేమ అవసరం లేదు అన్నారు బీర్బల్‌. బర్మా రాజు వీరిద్దరినీ వెళ్లిపోమన్నాడు. తిరిగి అక్బర్‌ రాజ్యానికి చేరుకున్నారు. వెళ్లగానే హుస్సేన్‌ ఇలా అన్నారు.. ‘మమ్మలను సంహరించటానికి ఇంత పథకం చేయాలా?’ అని అడిగాడు. ‘అదేమీ కాదు.. బీర్బల్‌ను నీతో పంపా. అతను ఏదోటి చేసి నిన్ను తప్పించగలడు. తనూ తప్పించుకోగలడు’ అంటూ అక్బర్‌ మాట్లాడాడు. దీంతో బీర్బల్‌ స్థాయి ఏంటో అక్బర్‌కు ముందే తెలుసని అర్థమైంది. హుస్సేన్‌ ఆనందంతో అక్బర్‌ మాటను అంగీకరించి.. బీర్బల్‌కు సముచిత ముఖ్యమంత్రి స్థానం కల్పించారు.

Updated Date - 2023-09-07T23:25:11+05:30 IST