ఏనుగులతో ఎలుకలు స్నేహం

ABN , First Publish Date - 2023-04-30T02:25:53+05:30 IST

ఒక అడవిలో మూడు గజరాజులు ఉండేవి. అవి వేటికీ భయపడేవి కావు. కలసి కట్టుగా ఉండేవి. దీంతో సింహరాజు కూడా వాటివైపు చూసేది కాదు. అడవిలోకి ఎవరైనా మనుషులు వచ్చినా..

ఏనుగులతో ఎలుకలు స్నేహం

ఒక అడవిలో మూడు గజరాజులు ఉండేవి. అవి వేటికీ భయపడేవి కావు. కలసి కట్టుగా ఉండేవి. దీంతో సింహరాజు కూడా వాటివైపు చూసేది కాదు. అడవిలోకి ఎవరైనా మనుషులు వచ్చినా బీభత్సం చేసేవి. ఆ ఏనుగుల భయానికి అడవిలోకి ఎవరూ వచ్చేవారు కాదు. దీంతో జంతువులన్నీ సంతోషంగా ఉండేవి.

అదే అడవిలో ఓ ఎలుకలు గుంపు ఉండేది. వాటిని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. దీంతో వాటి రాజుకి కోపం వచ్చింది. మనక్కూడా బలవంతులైన మిత్రులుండే సరిపోతుంది కదా! కనీసం మనల్ని గుర్తిస్తారు అనుకున్నది. మిగతా ఎలుకలకు చెబితే అవి మనతో స్నేహానికి ఎవరొస్తారు? అన్నవి. దీంతో ఆ ఎలుకరాజు ఒక్కతే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆలోచించసాగింది. ఏనుగులు గొప్పతనాన్ని అందరూ చెప్పటమే కాక.. వాటి బలాలు అందరికీ తెలుసు.. వాటితో స్నేహాన్ని చేయాలని మనసులో అనుకుంది. అనుకున్నదే తడవుగా అడవిలోకి పోయింది. ఓ ఏనుగును పలకరించి.. మీతో స్నేహాన్ని చేయాలనుంది అని అడిగింది. ఆ ఏనుగు ‘మీతో మాకు స్నేహామా.. ఎందులో సాటిరారు మాకు’ అన్నది. వెనక్కి వెళ్లి పోయి మళ్లీ తన పరివారంతో వచ్చింది. అప్పుడు మూడు ఏనుగులున్నాయి అక్కడ. ‘గజరాజుల్లారా మాతో స్నేహం చేయండి’ అంటూ బతిమాలాడాయి. ‘మీతో స్నేహం చేస్తే పరువు పోతుంది. నవ్వుతారు అంతా’ అన్నవి ఆ మూడు ఏనుగులు. అప్పుడు మూషికరాజు కలగజేసుకుని ‘మీకు తోక ఉంది.. మాకూ ఉంది. మీలాగే మాకు నాలుగు కాళ్లు ఉన్నాయి. చిన్నప్రాణాలమే కావొచ్చు స్నేహానికి సరితూగమని తూలనాడితే బావుండదు’ అన్నది కోపంగా. ‘మీ పని చూసుకోండి’ అంటూ ఏనుగులు అడవిలోపలికి వెళ్లిపోయాయి.

ఒక రోజు అడవిలోకి ముగ్గురు వేటగాళ్లు వచ్చారు. అరటిగెలలకు ఏదో మందుపూసారు. ఆ ఏనుగులు వచ్చేదారిలో అరటిగెలల్ని వేశారు. ఆ మూడు ఏనుగులు అరటిపండ్లు తిన్నాయి. కళ్లు తిరిగిపడిపోయాయి. నిద్రలేచేసరికి కాళ్లకు తాళ్లు కట్టారు. కాళ్లకు తాళ్లను చూసుకున్న ఆ ఏనుగులు గట్టిగా అరిచాయి. ఎలుకరాజు వాటిని చూసింది. ‘మిత్రులారా..ఏమీ భయపడకండి. దయచేసి కొద్ది సమయం ఉండండి. వేటగాళ్లు వాహనాలతో వచ్చేలోపల మిమ్మల్ని రక్షిస్తాను’ అన్నది. తన దండును తీసుకొచ్చింది. క్షణాల్లో ఏనుగులకు కట్టిన తాళ్లను కొరికి పడేశాయి. దీంతో ఆ ఏనుగులకు తెలివి వచ్చింది. ఎవరినీ తిట్టకూడదని అనుభవంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ‘మీలాంటి వాళ్లతో స్నేహం చేయలేకపోయామనే బాధ ఉంది. సిగ్గుపడుతున్నాము. మాతో స్నేహం చేస్తారా?’ అంటూ ఏనుగులు ఆ ఎలుకలను అడిగాయి. ఎలుకలన్నీ సంతోషంగా గెంతేశాయి. ఎలుకల రాజు ఆనందపడింది.

Updated Date - 2023-04-30T02:25:53+05:30 IST