MUNGISA: ముంగిస విశ్వాసం!
ABN , First Publish Date - 2023-02-28T02:42:20+05:30 IST
ఒక ఊరిలో ఒక జంట ఉండేది. ఒకరోజు ఆ ఇంటి ఆసామి ఒక గ్రామానికి వెళ్తుంటే.. దారిలో చిన్న ముంగిస పిల్ల కనిపించింది. దాన్ని పెంపుడు జంతువులా ఇంటికి తెచ్చి చూసుకున్నాడు.
ఒక ఊరిలో ఒక జంట ఉండేది. ఒకరోజు ఆ ఇంటి ఆసామి ఒక గ్రామానికి వెళ్తుంటే.. దారిలో చిన్న ముంగిస పిల్ల కనిపించింది. దాన్ని పెంపుడు జంతువులా ఇంటికి తెచ్చి చూసుకున్నాడు. ఏ లోటూ రానివ్వకుండా పెంచుకున్నాడు. సంవత్సరం తర్వాత ఆ జంటకి ఓ కొడుకు పుట్టాడు. కొడుకు లాలన పాలనా ఎంత ఉన్నా ముంగిసను బాగా చూసుకునేవాళ్లు. ముంగిస అంటే ఆ పిల్లవాడు ప్రత్యేకమైన ఇష్టాన్ని కనబరుస్తున్నాడు. వారిద్దరూ స్నేహితుల్లా మసలుకునేవారు.
ఒక రోజు ఉదయాన ఆ పిల్లవాడు నిద్రపోతుంటే.. చూసుకోమని తన భర్తకు చెప్పి కూరగాయలు తీసుకురావటానికి వెళ్లింది. అతను కూడా ఏదో పని ఉందని బయటికి వెళ్లిపోయాడు. ఎలాగూ ముంగిస చూసుకుంటుందనేది తన ఆలోచన. కూరగాయలు కొన్ని ఇంటికి వచ్చేసరికి ముంగిస నోటిలో రక్తం కనిపించింది. ఆ అమ్మమనసు తల్లడిల్లింది. కొడుకును చంపేసిందేమోనని భావించి క్షణాల్లో ఎదురుగా ఉండే కట్టెతో తలమీద బాదింది గట్టిగా. ముంగిస పడిపోయింది. ఇంట్లోకి వెళ్లి చూడగానే పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు. పక్కన చూస్తే తుంటలు తుంటలుగా పాము భాగాలు వెదజల్లినట్లున్నాయి. ఆ భయానకరపరిస్థితి చూశాక.. ముంగిసనే తన కొడుకును కాపాడిందని తల్లి హృదయానికి అర్థమైంది. అంతలోనే ఆ ఇంటి యజమాని వచ్చాడు. విషయం చెప్పింది. బయటికి వెళ్లి చూశాడు. తలపగిలి ఆ ముంగిస చచ్చిపోయింది. ముంగిసను చూసి ఆ ఇద్దరూ ఏడ్చారు. పిల్లవాడి కోసం ప్రాణాలను కూడా ఫణంగా పెట్టింది అనుకున్నారు. ఆ పిల్లవాడు కూడా ముంగిస కనపడకుంటే ఏదో వెలితిగా కనపడ్డాడు.
నీతి- ఏదీ ఆవేశంలో చేయరాదు.