మామిడి చెట్టు!

ABN , First Publish Date - 2023-01-18T22:52:23+05:30 IST

అది అక్బర్‌ రాజ్యం. ఒక ఊరిలో రంగయ్య, జంగయ్య అనే ఇద్దరు వ్యక్తులుండేవారు. వాళ్ల ఇంటి మధ్యలో ఒక మామిడి చెట్టు ఉండేది.

మామిడి చెట్టు!

అది అక్బర్‌ రాజ్యం. ఒక ఊరిలో రంగయ్య, జంగయ్య అనే ఇద్దరు వ్యక్తులుండేవారు. వాళ్ల ఇంటి మధ్యలో ఒక మామిడి చెట్టు ఉండేది. మామిడి కాయలు ఎప్పుడు కాసినా ‘ఇవి నావే’ అంటూ కొట్లాడుకునేవాళ్లు. ఒకరి మీద మరొకరు దాడి కూడా చేసుకునేవారు. ఒక ఏడాది మామిడికాయలు బాగా కాచాయి. ‘ఈ చెట్టుమీద నాదే హక్కు’ అంటూ వాదులాడుకున్నారు. ఎప్పటిలాగే పోట్లాడుకున్నారు. రంగయ్య, జంగయ్యలిద్దరూ అక్బర్‌ ఆస్థానానికి వెళ్లారు. వారి బాధను వెళ్లిబుచ్చారు. ‘నాదంటే నాది’ అంటూ చెట్టు గురించి చెప్పారు. బాధపడ్డారు. ఇదంతా సభలో ఉండే బీర్బల్‌ చూశాడు. అక్బర్‌ ఎదుటనే బీర్బల్‌ ఇలా అన్నారు. ‘మీరు ఇద్దరూ ఇక ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆ మామిడిచెట్టు ఎవరిదో ఆలోచించి చెబుతా’ అన్నారు. మరుసటి రోజు ఆ దారిన వెళుతూ మామిడి చెట్టును చూశాడు బీర్బల్‌. తిరిగి రాజ్యానికి వెళ్లాక ఒక సైనికుడిని పిలిచి రంగయ్య, జంగయ్య దగ్గరకు వెళ్లి మామిడి పండ్లను దొంగలు తీసుకుపోతున్నారు అని చెప్పమన్నాడు. వారు ఏమి చేశారో తెలియజేయి అన్నారు.

అన్నట్లే రంగయ్య దగ్గరకి సైనికుడు వెళ్లాడు. ‘మామిడి పండ్లను దొంగలు తీసుకెళుతున్నారు’ అన్నాడు. ‘ఇది మామూలే. దొంగలను ఆపలేం. నాకు పనుంది’ అంటూ తాపీగా కూర్చున్నాడు రంగయ్య. సైనికుడు జంగయ్య దగ్గరకి వెళ్లి ఇదే విషయం చెబుతూనే కర్ర తీసుకుని జంగయ్య బయటకి వచ్చాడు. అక్కడ జరిగిన విషయాలన్నీ సైనికుడు రాజ్యానికి వచ్చి బీర్బల్‌తో చెప్పాడు. మరుసటి రోజు రంగయ్య, జంగయ్యను సభకు రమ్మని కబురంపారు. రాజు అక్బర్‌ కూడా ఆసీనులై ఉన్నారు. చుట్టూ సభికులు. అంతలో రంగయ్య, జంగయ్య వచ్చారు. అంతలోనే బీర్బల్‌ ఇలా అన్నారు.. ‘ఈ చెట్టును ఇద్దరికీ ఇవ్వాలనుకున్నా. చెట్టును అమ్మి వచ్చిన డబ్బులతో చెరో సగం ఇస్తాన’న్నారు. వెంటనే రంగయ్య ‘సరే’ అన్నారు. ఆ తర్వాత ‘అయ్యా.. ఆ చెట్టును రంపంతో కోస్తుంటే చూడలేను. చిన్నప్పటినుంచి అదే మామిడిచెట్టును చూస్తూ బతికా. చెట్టును నరికితే చూడలేను’ అంటూ బాధపడ్డాడు జంగయ్య. వెంటనే బీర్బల్‌ ఇలా అన్నారు.. ‘ఈ మామిడి చెట్టు జంగయ్యదే. దీని జోలికి ఎవరైనా వస్తే కఠినంగా శిక్షించబడతారు. ఇది రాజుగారి ఆజ్ఞ’ అంటూ అరిచారు. ‘క్షమించమ’ని రంగయ్య రాజు కాళ్లమీద పడ్డాడు. బీర్బల్‌ చాతుర్యానికి అక్బర్‌ ఆశ్చర్యపోయారు.

Updated Date - 2023-01-18T22:52:24+05:30 IST