మేకపోతు గాంభీర్యం!

ABN , First Publish Date - 2023-05-17T22:49:34+05:30 IST

ఒక మేకల మందలో గాంభీర్యమైన మేకపోతు ఉండేది. దానికి కోపం ఎక్కువ. అదేరీతిలో తెలివి ఎక్కువ. ఇతరులను భయపెట్టడంలో..

మేకపోతు గాంభీర్యం!

ఒక మేకల మందలో గాంభీర్యమైన మేకపోతు ఉండేది. దానికి కోపం ఎక్కువ. అదేరీతిలో తెలివి ఎక్కువ. ఇతరులను భయపెట్టడంలో అది ముందుంటుంది. అందుకే ఆ మేకపోతుతో ఎవరూ గొడవపడేవారు కాదు. ఒక రోజు మేకల మందలోంచి ఆ మేకపోతు తప్పిపోయింది. గడ్డి తినుకుంటూ తోటి స్నేహితులను గమనించలేదు. అలా ఒక్కతే మిగిలింది. గడ్డి తింటూ తింటూ ఓ పెద్ద కొండమీదకు వెళ్లింది. ఆ కొండనుంచి కిందకు చూస్తే అంతా పచ్చికబయళ్లే కనిపించాయి. ఆహా.. ఈ పచ్చికబయళ్లు ఇంకా బావున్నాయే అనుకున్నది.

కొండపైనుంచి చూస్తూ చివర్లో నిలబడి ఉంది. ఆ మేకపోతును ఓ నక్క చూసింది. ఆహా.. ఈ మేసిన మేకపోతు మాంసం ఎంత రుచిగా ఉంటుందో అనుకుంది మనసులో. మేకపోతును.. గట్టిగా పిలిచింది. వింటున్నావా? అన్నది. మేకపోతు పలికింది. ‘నువ్వు కిందకు వచ్చేయ్‌. ఇక్కడ చూడు కొండమీద కంటే గడ్డి బాగా ఉంది. కావలసినన్ని చెరువులున్నాయి. దయచేసి కిందికి వచ్చేయ్‌. నేను కూడా నీతో ఉంటా. నీకెలాంటి భయం అవసరం లేదు. పైగా క్రూరమృగాలనుంచి కాపాడతానని భరోసా ఇచ్చింది. ‘ఎంతటి తెలివి?’ అనుకున్నది మేకపోతు మనసులో.అక్కడ ఉంటే ప్రమాదం. కిందపడిపోతే నీ ప్రాణాలు దక్కవు.. అంటూ భయపెట్టింది.

పర్లేదు నక్కబావా.. గడ్డి ఉంటే ఉండనీ.. ఇక్కడ గడ్డి నాకైతే రుచిగా ఉంది. నీళ్లు నువ్వే తాగు బావుంటే. నాకిప్పుడు అవసరం లేదు. కొద్దిసేపు ఇక్కడే ఆగిపోతా. ఇక్కడికి వచ్చేయ్‌.. నీకు ఓపిక ఉంటే. ఈ కొండమీద ఆహారం నీకు దొరుకుతుందన్నది. ‘నువ్వే ఇక్కడికి వచ్చేయ్‌. కొండమీద ప్రమాదం ఉంటుందేమో’ అంటూ పలువిధాల నక్క మేకపోతుతో నచ్చచెప్పింది. ‘కొద్దిసేపు అక్కడే ఆగు.. మా యజమాని మంచి వేట కుక్కలను తోలుకుని నన్ను వెతుకుతూ వస్తాడు చూడు’ అన్నది. వామ్మో వేటకుక్కల బారిన పడితే అంతే సంగతులు అని.. అక్కడ నుండి జారుకుంది నక్క. వాస్తవానికి మేకపోతుకు తన యజమాని వస్తాడో లేదో తెలీదు కానీ నక్కను మాత్రం అటువైపు మళ్లీ రాకుండా భయపెట్టింది.

Updated Date - 2023-05-17T22:49:34+05:30 IST