A Sociable Weaver : సోషియబుల్‌ వీవర్‌!

ABN , First Publish Date - 2023-04-09T00:04:15+05:30 IST

ఈ పెద్ద గూటిని మనుషులు నిర్మించలేదు, కోతుల్లాంటి జంతువులూ కట్టుకోలేదు. 14 సెం.మీ. పొడవు, 32 గ్రాములుండే చిన్న పిచ్చుకల్లాంటి పక్షులు కట్టాయంటే...

A Sociable Weaver : సోషియబుల్‌ వీవర్‌!

ఈ పెద్ద గూటిని మనుషులు నిర్మించలేదు, కోతుల్లాంటి జంతువులూ కట్టుకోలేదు. 14 సెం.మీ. పొడవు, 32 గ్రాములుండే చిన్న పిచ్చుకల్లాంటి పక్షులు కట్టాయంటే నమ్ముతారా? అవును ఇలాంటి పెద్ద గూళ్లను కట్టే పక్షి ఒకటుంది. దాని పేరు సోషియబుల్‌ వీవర్‌!

  • ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానా దేశాల్లో జీవిస్తాయివి. ముఖ్యంగా కలహారి ఎడారిలో ఉంటాయి. ఈ సదరెన్‌ ఆఫ్రికానుంచి వేరే చోటకు వెళ్లటానికి ఇవి ఇష్టపడవు. ఇక ముఖ్యంగా ఎండు చెట్లకు గడ్డి, పుల్లలతో దట్టంగా గూటిని కడతాయి.

  • వీటిని సోషల్‌ వీవర్స్‌ అని ఎందుకన్నారంటే.. సుమారు ఒక గుంపులో 500 పక్షులుంటాయి. నేలమీద ఒకట్రెండగులు మాత్రమే వేస్తాయి. గాల్లో ఎగరటానికి ఇష్టపడతాయి. ఎడారిలో ఉండే ఎండు గడ్డి, పుల్లలను తీసుకొచ్చి పెద్ద గూళ్లు కట్టుకుంటాయి. పిల్లలు లేని పక్షులు ఇతర పిల్లలకు గింజలు ఇచ్చి చూసుకుంటాయి. ఇక ఈ పెద్ద గూళ్లలో వీటికి ఛాంబర్స్‌ ఉంటాయి. వాటిలోనే ఏ బెరుకూ లేకుండా నిద్రపోతాయి.

  • ఈ గూళ్లు కనీసం ఏడు మీటర్లు కడతాయి. విశాలమైన గదులను ఏర్పరుచుకుంటాయి. గూటిలో కాలనీలుంటాయి. వేటికవి ప్రత్యేక గదుల్లో ఉంటాయి. ఈ సోషల్‌ వీవర్స్‌తో పాటు ఇతర చిన్నాచితకా పక్షులు కూడా ఈ గూళ్లను ఉపయోగించుకుంటుంటాయి. అయినా ఇవి ఏమీ అనవు. ప్రపంచంలోనే ఏ పక్షులు కూడా ఇంత పెద్ద గూళ్లను కట్టలేవు.

  • ఇవి ఉదయాన్నే తిండికోసం వెళ్లినపుడు వీటి గుడ్లు, పిల్లలను పాములు తింటుంటాయి. వీటితో పాటు ముంగిసలు, అడవి పిల్లులు బారినపడుతుంటాయి. వీటి బారిన నుంచి తప్పించుకోవటానికి కొమ్మపైభాగంలో గూళ్లు కడతాయి.

  • ఇవి ఎక్కువగా చిన్న పురుగులు, ఆకులు, గింజలు తింటాయి. గూళ్లలో ఇతర ప్రాణుల వల్ల ఏదైనా హాని కలుగుతుందంటే వెంటనే గట్టిగా అరుస్తాయి. దీంతో మిగతావన్నీ తప్పించుకుంటాయి.

  • ఇవి నీళ్లు తాగవు. ఆహారంలోని నీటిశాతాన్ని గ్రహించి జీవిస్తాయి.

  • వీటి సంతతి 16 వేల నుంచి 25 వేల మధ్యలో ఉంది. ఇక జీవనకాలం సుమారు పదిహేనేళ్లు.

Updated Date - 2023-04-09T00:04:19+05:30 IST