Lalitha S.A.: మరో తరమైనా బాగుండాలని...

ABN , First Publish Date - 2023-08-14T02:14:46+05:30 IST

‘‘దుర్భరమైన పరిస్థితులు తరతరాల వారసత్వం కాకూడదంటే విద్య, సాధికారత అత్యవసరం. సమాజం చేయూతనిస్తేనే అది సాధ్యం’’ అంటారు లలిత ఎస్‌.ఎ. ( Lalitha S.A. )ఢిల్లీలో సెక్స్‌ వర్కర్ల పిల్లల బతుకుల్ని చూసి చలించిన ఆమె మూడు దశాబ్దాల క్రితం చేపట్టిన చిన్న ప్రయత్నం కొన్ని వందల మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎందరో తల్లుల విముక్తికి దోహదం చేసింది.

 Lalitha S.A.: మరో తరమైనా బాగుండాలని...

‘‘దుర్భరమైన పరిస్థితులు తరతరాల వారసత్వం కాకూడదంటే విద్య, సాధికారత అత్యవసరం. సమాజం చేయూతనిస్తేనే అది సాధ్యం’’ అంటారు లలిత ఎస్‌.ఎ. ( Lalitha S.A. )ఢిల్లీలో సెక్స్‌ వర్కర్ల పిల్లల బతుకుల్ని చూసి చలించిన ఆమె మూడు దశాబ్దాల క్రితం చేపట్టిన చిన్న ప్రయత్నం కొన్ని వందల మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎందరో తల్లుల విముక్తికి దోహదం చేసింది.

‘‘నేను పుట్టిందీ, పెరిగిందీ కర్ణాటక రాష్ట్రంలో. పొలిటికల్‌ సైన్స్‌లో ఎం.ఏ. పూర్తయ్యాక... ఉద్యోగం చేస్తూనే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేదాన్ని. ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా నివారణ, దేవదాసీల సమస్యలపై కృషి చేసేవాళ్ళం. ఈలోగా బదిలీ మీద ఢిల్లీ రావాల్సి వచ్చింది. అక్కడ స్థానిక ఉద్యమకారుల బృందంతో పరిచయం ఏర్పడింది. ఇది 1988 నాటి సంగతి. ఆ రోజుల్లో ఢిల్లీలోని జి.బి.రోడ్డు ప్రపంచంలో రెండవ అతి పెద్ద రెడ్‌లైట్‌ ప్రాంతంగా ఉండేది. సుమారు వంద వేశ్యాగృహాల్లో నాలుగు వేలమందికి పైగా సెక్స్‌ వర్కర్లు ఉండేవారు. వారి స్థితిగతుల మీద మా బృందం అధ్యయనం చేస్తున్నప్పుడు... ఆ మహిళల్లో చాలామంది మోసపోయి అక్కడికి చేరుకున్నారనీ, విధిలేక ఆ వృత్తిలో కొనసాగుతున్నారనీ తెలిసింది. వారిలో కొందరి పిల్లలు కూడా అదే వృత్తిలోకి తప్పనిసరై రావాల్సి వస్తోంది. ‘ఇలా కొన్ని తరాలు దుర్భరమైన అవే పరిస్థితుల్లో మగ్గిపోతూ ఉండాలా?’ అనే ఆలోచన నన్ను నిద్రపోనివ్వలేదు. అదే సమయంలో, హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ సోకిన సెక్స్‌ వర్కర్లు, వారి పిల్లల మరణాలు కూడా సంభవించాయి. ఆ వాతావరణానికి దూరంగా పిల్లలు పెరిగి, చదువుకొని, తమ కాళ్ళమీద తాము నిలబడగలిగినప్పుడే... ఈ సమస్య పరిష్కారమవుతుందనిపించింది. కొందరు మిత్రుల సహకారంతో 1991లో ఒక డే కేర్‌ సెంటర్‌ ప్రారంభించాను. అయితే ఆ కేంద్రానికి తమ పిల్లల్ని పంపడానికి చాలామంది సంకోచించారు. జీవితంలో అన్ని విధాలుగానూ మోసపోయిన వాళ్ళు ఇతరుల్ని అంత తేలికగా నమ్మరని నాకు తెలుసు. ‘‘మీ పిల్లలు పెరగడానికి ఇది సురక్షితమైన చోటు కాదు. వారికి రోజులో ఎక్కువ సేపు ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు... చదువు నేర్పిస్తాం. మరో తరం ఆడపిల్లలు సెక్స్‌ వర్కర్లుగా, మగపిల్లలు అసాంఘిక శక్తులుగా మారకుండా చూస్తాం. వాళ్ళకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది. నన్ను నమ్మండి’’ అని వారికి నచ్చజెప్పి ఒప్పించాను. ‘ఎస్‌ఎంఎస్‌ సెంటర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ ప్రాస్టిట్యూషన్‌’ పేరుతో ఒక ఎన్జీవోను ఏర్పాటు చేశాను. క్రమంగా మా కేంద్రంలో చేరే పిల్లల సంఖ్య పెరిగింది.

1.jpg


అన్నీ ఆపెయ్యాలనుకున్నాను...

ఆ కేంద్రాన్ని నడిపించడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. మాకు ఆర్థికంగా అండదండలు లేవు. విరాళాల సేకరణ చాలా కష్టమయ్యేది. దీంతో 2009లో... మా సంస్థ కార్యకలాపాలన్నిటినీ ఆపేయాలనే నిర్ణయానికి వచ్చాను. అయితే ఊహించని విధంగా ‘సొసైటీ ఫర్‌ పార్టిసిపేటరీ ఇంటిగ్రేటెడ్‌ డెవల్‌పమెంట్‌’ (ఎస్‌పిఐడి) అనే ఎన్జీవో మాతో భాగస్వామ్యానికి ముందుకు వచ్చింది. మాకు అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చింది. దాంతో మా కేంద్రంలో పిల్లలు రోజంతా ఉండేలా మార్పులు చేశాం. వారికి భోజనం, వసతి, చదువు అన్నీ అక్కడే... ఇప్పుడు ఢిల్లీలో నాలుగు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో ఒకటి పదేళ్ళ లోపు బాలబాలికల కోసం, రెండవది పదేళ్ళు పైబడిన అమ్మాయిలకి, మూడోది పదేళ్ళు దాటిన అబ్బాయిలకి, మరొకటి పద్ధెనిమిదేళ్ళు దాటిన అమ్మాయిలకి. ప్రతి కేంద్రంలో ఒక వంట మనిషి, కనీసం నలుగురు టీచర్లు ఉంటారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో నూట పాతికమంది పిల్లలున్నారు. వారికి వయసును బట్టి బోధన ఉంటుంది. ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీ, సోషల్‌ సైన్స్‌, లెక్కలతో పాటు ఆటపాటలు, హస్తకళల్లాంటివి నేర్పిస్తున్నాం. హైస్కూల్‌ చదువు పూర్తి చేసుకున్నవారికి టైలరింగ్‌, ఆభరణాల తయారీ, నర్సింగ్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌, సేల్స్‌, కస్టమర్‌ రిలేషన్‌షి్‌ప్స లాంటి వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నాం. మా కేంద్రాల్లోని పిల్లందరినీ ప్రాథమికమైన బోధన తరువాత ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నాం.

అది అందరూ గుర్తుంచుకోవాలి...

సెక్స్‌ వర్కర్ల పట్ల, వారి పిల్లల పట్ల సమాజమే కాదు... అధికార, పాలక వర్గాల్లోనూ చిన్నచూపు ఉందనేది వాస్తవం. కానీ వారికీ ప్రాథమిక హక్కులు ఉంటాయి. అది అందరూ గుర్తుంచుకోవాలి. ఎస్‌పిఐడి సాయంతో సెక్స్‌ వర్కర్లకు ఆధార్‌ కార్డులు ఇప్పించడం, ఓటర్లుగా నమోదు చేయించడం, బ్యాంకు ఖాతాలు తెరిపించడం లాంటివి చేస్తున్నాం. మా కేంద్రాల్లో ఆశ్రయం పొందిన పిల్లల్లో ఇప్పుడు సాఫ్ట్‌పేర్‌ ఇంజనీర్లు, టీచర్లు, నర్సులు... ఇలా అనేక వృత్తుల్లో స్థిరపడినవారు కొన్ని వందలమంది ఉన్నారు. చాలామంది తమ తల్లులకు వేశ్యా గృహాల నుంచి విముక్తి కలిగించారు. ఆ పిల్లలు నన్ను ఆప్యాయంగా పలకరిస్తున్నప్పుడు... ఎంతో ఉద్వేగానికి లోనవుతాను. అది నాకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది.’’

Updated Date - 2023-08-14T02:14:46+05:30 IST