నువ్వులతో ఏయే లాభాలు?

ABN , First Publish Date - 2023-09-03T11:27:14+05:30 IST

నువ్వులలో తెల్ల, నల్ల రకాలున్నాయి. వాటి పోషక విలువల్లో తేడాలు ఉంటాయా? నువ్వులను బెల్లంతో కలిపి లడ్డూ చేసుకొని రోజూ తినడం వల్ల ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?

నువ్వులతో ఏయే లాభాలు?

నువ్వులలో తెల్ల, నల్ల రకాలున్నాయి. వాటి పోషక విలువల్లో తేడాలు ఉంటాయా? నువ్వులను బెల్లంతో కలిపి లడ్డూ చేసుకొని రోజూ తినడం వల్ల ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?

నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని అనాదిగా ఔషధంగా ఉపయోగిస్తున్నాం. ముప్ఫయి గ్రాముల నువ్వులు 3 గ్రాముల పీచు పదార్థాన్ని అందిస్తాయి. పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం తదితరాలను దూరంగా ఉంచుతాయి. వీటిలో ఉన్న అన్‌ సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌, లిగ్నాన్స్‌ ఫైటోస్టెరాల్స్‌ తదితరాల వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అధిక ట్రై గ్లిసెరైడ్స్‌, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పొట్టు తొలగించని నువ్వుల్లో కాల్షియం కూడా ఎక్కువే. ఐరన్‌, కాపర్‌, సెలీనియం, మాంగనీసు లాంటి ఖనిజాలూ అధికం. నూనె తొలగించిన నువ్వుల పప్పు లేదా తెలగ పిండిలో మాంసకృత్తులు ఎక్కువ. కాబట్టి ఎదిగే పిల్లలకు, బాలింతలకు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి తెలగ పిండి మంచి ఆహారం. నువ్వుల్లోని ఫైటో ఈస్ట్రోజన్లు మహిళల్లో మెనోపాజ్‌ లక్షణాలను కొంత వరకు నియంత్రిస్తాయి. నువ్వులను పొడి చేసి కూరల్లో చల్లడం, కొద్ది బెల్లంతో కలిపి లడ్డూలా తీసుకోవడం, తాలింపులో, రోటి పచ్చళ్లలో వాడడం మంచిదే. అయితే అధిక క్యాలరీల వల్ల రోజుకు పదిహేను గ్రాములకు మించకుండా తీసుకోవాలి. నల్ల నువ్వుల్లో తెల్ల నువ్వులకంటే యాంటీఆక్సిడెంట్లు అధికం.

- స్వాతి, అమలాపురం

Untitled-7.jpg

మార్కెట్లో దొరికే రెడీ టు కుక్‌ - సూప్‌ మిక్స్‌లను తరచూ వాడితే ఏమైనా ఇబ్బందా? నెలలో ఎన్ని సార్లు ఈ మిక్స్‌లతో సూప్‌ చేసుకొని తాగొచ్చు?

వర్షాలు మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరగడానికి, వ్యాపించడానికి ఎంతో అనుకూలం. కాబట్టి వర్షాలు పడగానే జలుబులు, జ్వరాలు వస్తాయి. వైరస్‌, బ్యాక్టీరియాల లాంటి సూక్ష్మజీవులే ఈ అనారోగ్యాలకు కారణం. సూప్స్‌ వేడిగా ఉండడం వల్ల సూక్ష్మజీవులు అందులో పెరగలేవు. కూరగాయల్లో అధికంగా ఉండే బీ విటమిన్‌, ఏ విటమిన్‌, అనేక యాంటీ ఆక్సిడెంట్స్‌, పీచు పదార్థాలు మొదలైనవన్నీ రోగనిరోధక వ్యవస్థ భద్రతకు సహాయపడతాయి. సూప్స్‌ లో వాడే మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి లాంటివి ఆరోగ్యాన్ని కాపాడతాయి. మార్కెట్లో దొరికే రెడీ టు మేక్‌ సూప్‌ మిక్స్‌లలో ప్రిజర్వేటివ్స్‌, క్యాలరీలను పెంచే కొవ్వులు, చక్కెర మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఇంట్లో అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరలతో సూప్స్‌ చేసుకోవడం ఉత్తమం. సమయాభావం వల్ల రెడీమేడ్‌ సూప్‌ మిక్స్‌లు వాడాలంటే వారానికి ఒకసారి చాలు. అందులో కొద్దిగా కూరగాయలు చేర్చడం, ఉప్పు వేయకపోవడం మంచిది.

- షాలిని, భీమిలి

Untitled-6.jpg

మా బాబుకి ఎనిమిదేళ్లు. ఎత్తు 124 సెం.మీ. బక్కపలచగా అనిపిస్తాడు. కానీ చురుగ్గా ఉంటాడు. వాడికి తరచూ జలుబు, దగ్గు. రోగనిరోధక శక్తి బాగుండాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

- ఆనంద్‌, తిరుపతి

మీ బాబు ఎత్తు వయసుకు తగ్గట్టే ఉన్నా, బరువు కొంత తక్కువగా ఉన్నాడు. సరైన పోషకాలున్న ఆహారం ఇస్తే ఎదుగుదల మెరుగవుతుంది. దీనికి క్యాలరీలు, ప్రొటీన్లు, మంచి కొవ్వులు, శక్తినిచ్చే పిండిపదార్థాలపై దృష్టి పెట్టాలి. విటమిన్లు, ఖనిజాల వల్ల రోగనిరోధక శక్తి బాగుంటుంది. చిన్నతనం నుండి చేసే చక్కని ఆహారపు అలవాట్ల వల్ల పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. బరువు పెరిగేందుకు మామూలు ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చ గింజలు తదితరాలను పొడి చేసి పిండిలో కలిపి చపాతీ, పరాఠాల్లా చేసి ఇవ్వండి. ఈ పొడినే పాలలోనూ కలపండి. వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగు కూడా పెట్టవచ్చు. ఆకలి సరిగా లేదనిపిస్తే వైద్యులను సంప్రదించండి. భోజన సమయానికి రెండు గంటల ముందు పాలు, వేయించిన చిరుతిళ్ళు లాంటివి పెట్టకూడదు. ఇంట్లో తయారు చేసిన నువ్వులు, బెల్లం ఉండలు, మినప సున్ని ఉండలు, ఉడికించిన సెనగలు రోజులో ఓసారి ఇవ్వవచ్చు. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అన్ని రకాల గింజలు, పాలలో నానబెట్టి గ్రైండ్‌ చేసి మిల్క్‌ షేక్‌ లాగ ఇస్తే మంచిది. ఆకుకూరలు, పండ్లు రోజూ తినాలి. అలాగే రోజుకు కనీసం ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నిద్ర పోయేలా చూడాలి.

fff.jpg

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2023-09-03T11:27:14+05:30 IST