Health Tips: టూత్‌బ్రష్‌పై పేస్ట్‌ వేయడం బోర్‌గా ఫీలవుతున్నారా.. అయితే ఈ టాబ్లెట్‌ ఒకటి చప్పరిస్తే చాలు..!

ABN , First Publish Date - 2023-06-25T14:58:50+05:30 IST

పొద్దున్న లేవగానే టూత్‌బ్రష్‌పై పేస్ట్‌ వేయడం బోర్‌గా ఫీలవుతున్నారా? పైగా పర్యావరణ స్పృహ పెరిగిన తర్వాత... వాడి పారేసిన టూత్‌పేస్ట్‌ ప్లాస్టిక్‌ ట్యూబులు ఈ భూమికి ఎంత హాని చేస్తున్నాయో అర్థమవుతోంది.

Health Tips: టూత్‌బ్రష్‌పై పేస్ట్‌ వేయడం బోర్‌గా ఫీలవుతున్నారా.. అయితే ఈ టాబ్లెట్‌ ఒకటి చప్పరిస్తే చాలు..!

పొద్దున్న లేవగానే టూత్‌బ్రష్‌పై పేస్ట్‌ వేయడం బోర్‌గా ఫీలవుతున్నారా? పైగా పర్యావరణ స్పృహ పెరిగిన తర్వాత... వాడి పారేసిన టూత్‌పేస్ట్‌ ప్లాస్టిక్‌ ట్యూబులు ఈ భూమికి ఎంత హాని చేస్తున్నాయో అర్థమవుతోంది. అందుకే వీటికి ప్రత్యమ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ ‘టూత్‌పేస్ట్‌ టాబ్లెట్‌’లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అంటే పేస్ట్‌కు బదులు టాబ్లెట్‌ నోట్లో వేసుకుని చప్పరించాలన్నమాట.

మనం రోజూ ఉపయోగించే టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌లు పర్యావరణంతో పాటు మానవాళికీ ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతీ ఏడాది సుమారుగా 90 కోట్ల టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌లను వాడి పడేస్తున్నారని తేలింది. అలా వాడిపారేసిన ట్యూబ్‌లు భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఐదు వందల ఏళ్లు పడుతుందట. అందుకే ఈ ప్లాస్టిక్‌ ట్యూబ్‌ల వాడకం తగ్గించడం మంచిదని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు.

ఏమిటీ టాబ్లెట్లు?

టూత్‌పేస్ట్‌ టాబ్లెట్లు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. దీని ప్యాకేజింగ్‌ కోసం వాడే గ్లాస్‌, టిన్‌, కంపోస్టబుల్‌ పౌచ్‌లను తిరిగి ఉపయోగించొచ్చు లేదా రీసైకిల్‌ చేయవచ్చు. ఇవి ప్లాస్టిక్‌ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ టాబ్లెట్లను జిలిటోల్‌, కాల్షియం కార్బోనేట్‌, టార్టారిక్‌ యాసిడ్‌ ఉత్పన్నాలు, సోడియం బై కార్బోనేట్‌ వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి దంతాలను పాలిష్‌ చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంచడంలోను, పళ్లపై ఏర్పడిన మరకలను తొలగించడంలోనూ బాగా పనిచేస్తాయి.

ఎలా ఉపయోగించాలి...

టాబ్లెట్‌ను కొరికి, చిన్న చిన్న ముక్కలుగా చేసి కొన్ని సెకన్ల (కనీసం 5 సెకన్లు) పాటు నమలాలి. ఆ తర్వాత తడి టూత్‌ బ్రష్‌తో దంతాలను రెండు నిమిషాలు తోమితే సరి. పొద్దున్న, రాత్రి అన్నం తిన్నాక.. ఇలా రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేస్తే మంచిది. ఇందులో ఎలాంటి పారాబెన్స్‌ లేవు కాబట్టి నిస్సంకోచంగా ఉపయోగించొచ్చు. మార్కెట్‌లో దొరికే రకరకాల టూత్‌పేస్ట్‌ల మాదిరిగానే ఇవి కూడా చాలా రకాల ఫ్లేవర్లలో (మింట్‌, చార్‌కోల్‌ మొదలైనవి) అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ప్రతికూలతలు...

ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి సహజంగానే రోజువారి ఉపయోగించే టూత్‌ పేస్ట్‌లతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువ.

ఐదేళ్ల లోపు పిల్లలు వీటిని వాడకపోవడమే మంచిదని వైద్యుల సలహా. బదులుగా ఫ్లోరైడ్‌ క్రీమ్‌ పేస్ట్‌, మృదువైన బ్రష్‌ వాడడం మంచిది.

డెంటల్‌ గ్రాఫ్ట్‌లు ఉన్నవారికి ఈ టాబ్లెట్ల వాడకం అంత సౌకర్యవంతంగా అనిపించదు. వీటిని నమలడం కాస్త ఇబ్బందిని కలిగించొచ్చు.

ప్రయోజనాలివి...

ఇవి దంతాలు, చిగుళ్లను శుభ్రపరిచి తాజా శ్వాసను అందించడంతో పాటు, తళతళ మెరిసేటట్లు చేస్తాయి.

ఈ టాబ్లెట్లు ప్రయాణానికి అత్యంత అనుకూలమైనవి. బ్యాగ్‌లో తక్కువ స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తాయి. ఇవి పూర్తిగా పౌడర్‌తో రావడం వల్ల టూత్‌పేస్టుల్లాగ ఎక్కడ లీక్‌ అవుతుందోనన్న భయం ఉండదు.

ఆఫీసులో ఉన్నా లేదా ఎక్కడికైనా ఔటింగ్‌కి వెళ్లినా... బిజీ వల్ల బ్రష్‌ చేయలేని పరిస్థితుల్లో ఉంటే గనుక ఈ టాబ్లెట్‌ని నోట్లో వేసుకుని నమిలితే చాలు. నిమిషాల్లో నోరు తాజాగా మారుతుంది.

ఎంత పరిమాణంలో టూత్‌పేస్ట్‌ బ్రష్‌కి పెట్టుకోవాలో ఇప్పటికీ చాలామందికి తెలియదు. అదే టూత్‌ పేస్ట్‌ టాబ్లెట్‌ ఒకటి చప్పరిస్తే చాలు.

ఇవి పర్యావరణ హితమైనవి. వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. రీసైకిల్‌ చేయగల ప్యాకేజింగ్‌తో లభిస్తున్నాయి.

Updated Date - 2023-06-25T16:40:57+05:30 IST