Women Reservation Bill ; తరుణీ తరుణం!
ABN , First Publish Date - 2023-09-22T03:04:02+05:30 IST
భారత రాజకీయ ముఖచిత్రంపై చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్ట సభల్లో మహిళలకు పట్టం కట్టే దిశగా కీలక ఘట్టం పూర్తయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తూ
మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఓకే
దేశ రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం
బిల్లుకు రాజ్యసభా సై.. ఏకగీవ్రంగా ఆమోదం
అంతకుముందు 7 గంటలపాటు సుదీర్ఘ చర్చ
రిజర్వేషన్లను 2024లోనే అమలు చేయండి
రాజ్యాంగ సవరణ మీకు పెద్ద పనికాదు: ఖర్గే
రాజ్యాంగం ప్రకారమే వెళ్తున్నాం
ఖర్గే విమర్శలకు బీజేపీ చీఫ్ నడ్డా జవాబు
పార్లమెంటు చరిత్రలో సువర్ణాధ్యాయం
సభ్యులందరికీ ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: భారత రాజకీయ ముఖచిత్రంపై చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్ట సభల్లో మహిళలకు పట్టం కట్టే దిశగా కీలక ఘట్టం పూర్తయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో పాస్ అయింది. తాజాగా రాజ్యసభలోనూ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గురువారం పెద్దల సభలో చర్చల అనంతరం బాగా పొద్దుపోయాక బిల్లు మీద ఓటింగ్ జరిగింది. సభకు హాజరైన 215 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశా రు. అంతకుముందు మహిళా బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఏడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు చర్చలో భాగంగా మాట్లాడారు. వారు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున మంత్రులు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ పార్టీ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇప్పటికప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు ఎప్పటిదాకానో ఎందుకు? వచ్చే ఏడాది జరిగే ఎన్నికల నుంచే అమలు చేయండి. రాజ్యాంగ సవరణ పెద్ద పనికాదు. మీరు తలుచుకుంటే ఇప్పుడే చేసేయొచ్చు. ఐనా 2031 వరకు ఆగ డం అంటే అర్థం ఏమిటి?’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ పార్టీ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా పరిషత్, పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్ ఉన్నందున చట్టసభల్లోనూ అమలు చేసేందుకు ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ‘రేపటి పనిని నేడే చేయండి.. నేటి పనిని ఇప్పుడే చేసేయండి’ అంటూ ప్రఖ్యాత కవి కబీర్‌దాస్ పద్యాన్ని ఖర్గే ఉటంకించారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమల్లోకి తేవాలంటూ ఖర్గే గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ కలగజేసుకుని.. సీట్లో కూర్చోవాల్సిందిగా కోరారు. అయినా, ప్రసంగం కొనసాగించిన ఆయన.. ఇందులో చట్ట వ్యతిరేకం, ఇతరత్రా ఏమీ లేదని రిజర్వేషన్ అమలుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీంతో ఖర్గే మైక్‌ను ఆఫ్ చేసిన ధన్‌ఖడ్.. ‘ఇది ఎగువ సభ.. పెద్దల సభ’ అని పేర్కొంటూ బీజేపీ అధ్యక్షు డు జేపీ నడ్డాను మాట్లాడాల్సిందిగా కోరారు. కాగా, ఖర్గే విమర్శలకు కౌంటర్‌గా నడ్డా తన ప్రసంగంలో వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం సరైన పద్ధతిలో వెళ్లాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తేలేదనే ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ‘‘ఏకాభిప్రాయాన్ని తీసుకురావడాన్నే మేం నమ్ముతాం’’ అని వ్యాఖ్యానించారు. కాగా, చట్టసభల్లో మహిళలకు 33ు రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తదుపరి ప్రక్రియలో భాగం గా గురువారం రాజ్యసభలో పెట్టగా పార్టీలకు అతీతంగా సభ్యులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మేఘ్వాల్ మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం అనేక చ ర్యలు చేపట్టిందన్నారు. మరోవైపు బిల్లుపై చర్చకు ఏడున్నర గంటల సమ యం ఇచ్చినట్లు చైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. పీటీ ఉష, కనిమొళి (డీఎంకే), జయాబచ్చన్ (ఎస్పీ), ఫౌజియా ఖాన్ (ఎన్సీపీ), డోలాసేన్ (టీఎంసీ).. చర్చ సమయంలో సభా కార్యకలాపాల నిర్వహణకు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాగా, లోక్‌సభలో మహిళా బిల్లు ఆమోదం పొందడం.. పార్లమెంటు చరిత్రలో సువర్ణాధ్యాయం అని ప్రధాని మోదీ కొనియాడారు. సభా నాయకుడిగా.. సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
2011 జనాభా లెక్కలనే తీసుకోవాలి: కేకే
జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కాకుండా మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను వేగిరం చేయాలని పలువురు సభ్యులు కోరారు. 2011 నాటి లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవాలని, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని బీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశరావు కోరారు. రాజ్యసభ, శాసనమండళ్లలోనూ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ కె. రవీంద్రకుమార్, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, వైసీపీ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ సైతం చర్చలో పాల్గొన్నారు.