త్వరలో కాంగ్రెస్‌లోకి వరుణ్‌ గాంధీ?

ABN , First Publish Date - 2023-01-09T01:46:34+05:30 IST

గాంధీ-నెహ్రూ కుటుంబాల వారసుడు, సంజయ్‌ గాంధీ-మేనకాగాంధీల కుమారుడు, ఫిలిబిత్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ బీజేపీని వీడేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది...

త్వరలో కాంగ్రెస్‌లోకి వరుణ్‌ గాంధీ?

బీజేపీని వీడేందుకు సన్నాహాలు

పార్టీపై విమర్శలే నిదర్శనమన్న విశ్లేషకులు

మోదీ-షాల హయాంలో తగ్గిన ప్రాధాన్యం

ఇక పార్టీలో భవిష్యత్తు లేదనే భావన

న్యూఢిల్లీ, జనవరి 8: గాంధీ-నెహ్రూ కుటుంబాల వారసుడు, సంజయ్‌ గాంధీ-మేనకాగాంధీల కుమారుడు, ఫిలిబిత్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ బీజేపీని వీడేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అడపాదడపా సొంత పార్టీ(బీజేపీ)పైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టడం, మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దీనికి సంకేతంగా భావిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రముఖ జర్నల్‌లలో అడపాదడపా ప్రచురితమవుతున్న ఆయన వ్యాసాలలో సొంతపార్టీ విధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ‘నేనేమీ నెహ్రూకూ, కాంగ్రె్‌సకూ వ్యతిరేకిని కాను. మన రాజకీయాల లక్ష్యం ప్రజలను కలిపి ఉంచేలా ఉండాలేగానీ, అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉండకూడదు. నేడు మతం, కులం పేరిట ఓట్లు అడుగుతున్నవారిని.. ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి తీవ్రమైన అంశాలపై మీరు ఏం చేస్తున్నారని ప్రజలు అడగాల్సి ఉంది’ అంటూ తన నియోజకవర్గ(ఫిలిబిత్‌) ప్రజలను ఉద్దేశించి వరుణ్‌గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ సహా బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆయన ఎంతగా విమర్శిస్తున్నారో ఈ పదాలే తెలియజేస్తున్నాయి. వరుణ్‌ తల్లి మేనకాగాంధీకి 2019లో తిరిగి మోదీ కేబినెట్‌లో స్థానం కల్పించనప్పుడే ఆయన అసమ్మతి బయటపడింది. ఆ సమయంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి కూడా ఇద్దరినీ(మేనక, వరుణ్‌లను) పక్కన పెట్టారు.

మోదీషా హయాంలో తగ్గిన ప్రాధాన్యం..

వాజపేయి-ఆడ్వాణీల హయాంలో వరుణ్‌గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీకి బీజేపీలో మంచి ప్రాధాన్యం లభించింది. నితిన్‌ గడ్కరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యదర్శిగా వరుణ్‌గాంధీని నియమించారు. రాజ్‌నాథ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతి చిన్న వయసు(33) ప్రధాన కార్యదర్శిగానూ వరుణ్‌ నియమితులయ్యారు. అయితే, అమిత్‌షా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తల్లీ, కొడుకుల రెక్కలు కత్తిరించడం ప్రారంభమైంది. అమిత్‌షా హయాంలోనే వరుణ్‌ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మోదీ-అమిత్‌షాల హయాంలో ఇక తమకు పార్టీలో భవిష్యత్తు ఉండదని వరుణ్‌గాంధీ భావిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీని వీడి, కాంగ్రె్‌సలో చేరాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్‌ పార్టీలోకే ఎందుకంటే..?

వరుణ్‌గాంధీకి ప్రముఖ స్థానం కల్పించే రాజకీయ పార్టీలకు కొరత లేదు. అయితే, కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీల్లో తనకు జాతీయస్థాయిలో గుర్తింపు కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చు. ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ తదితర పార్టీలు ఆయనకు ముక్తకంఠంతో స్వాగతం పలికే అవకాశం ఉంది. అధికార పార్టీలో తనకు పొగపెడుతున్నారని, తన భవితకు బీజేపీ ఫుల్‌స్టాప్‌ పెట్టేసిందని స్పష్టమైపోయినప్పటికీ.. బీజేపీ పెద్దలు తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే సందర్భం కోసం ఆయన వేచి చూస్తున్నారని, తద్వారా ఆయన బయటికి వెళ్లడానికి ఒక స్పష్టమైన కారణం కనిపిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-01-09T01:46:35+05:30 IST