AAP Maha Rally: నియంతృత్వానికి చరమగీతం పాడదాం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2023-06-11T14:58:28+05:30 IST

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నియంతను గద్దె దింపేందుకు ఉద్యమించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం కేజ్రీవాల్ పరోక్షంగా మోదీ సర్కార్‌ను ఉద్దేశిస్తూ పిలుపునిచ్చారు. ఢిల్లీ పాలనాధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో ఆదివారం భారీ సభను ఏర్పాటు చేశారు.

AAP Maha Rally: నియంతృత్వానికి చరమగీతం పాడదాం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, నియంతను గద్దె దింపేందుకు ఉద్యమించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పరోక్షంగా మోదీ సర్కార్‌ను ఉద్దేశిస్తూ పిలుపునిచ్చారు. ఢిల్లీ పాలనాధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తూ రాంలీలా మైదానంలో ఆదివారంనాడు భారీ సభను ఏర్పాటు చేశారు. 12 ఏళ్ల క్రితం ఇదే వేదికపై అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించామని, ఇప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నామని ఆయన చెప్పారు.

''ఇదొక పవిత్రమైన వేదిక. 12 ఏళ్ల క్రితం అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. అప్పట్లో మన ఉద్యమం విజయవంతమైంది. నియంతృత్వానికి చరమగీతం పాడి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉద్యమించే సమయం ఇప్పుడు వచ్చింది'' కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ తనను ప్రతిరోజూ అవమానిస్తూనే ఉందని విమర్శించారు. తనను అవమానించినా పట్టించుకోననని, ఢిల్లీ ప్రజల కోసమే తాను పోరాడుతున్నానని, సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ప్రధానమంత్రి మోదీకి దేశం పట్ల ఏమాత్రం పట్టింపులేదని, ప్రతిరోజూ ఆయన నిద్ర లేస్తారని, ఢిల్లీలో జరుగుతున్న పనులను ఆపిస్తుంటారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని పని చేయడానికి అనుమతించడం లేదని ఆరోపించారు.

ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ తెస్తారు...

ఇవాళ ఢిల్లీలో తీసుకువచ్చిన ఆర్డినెన్సును ఇతర రాష్ట్రాల్లోనూ తీసుకురానున్నట్టు తనకు సమాచారం ఉందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ 'డిక్లరేషన్ ఆఫ్ డిక్టేటర్‌షిప్‌' అని, ప్రజల హక్కులను ఊడలాక్కోవడమేనని, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలోనూ ఈ ఆర్డినెన్స్ రానుందని అన్నారు. ఈ మహా ర్యాలీలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ ఇంజన్ కాదు, డబుల్ బ్యారల్...

'ఆప్' మహా ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. ''ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాదు, డబుల్ బ్యారల్ ప్రభుత్వం. ఒక బ్యారల్ ఈడీ అయితే, రెండవది సీబీఐ. ఢిల్లీని బ్యూరోక్రాట్రతో పాలించాలని బీజేపీ కోరుకుంటోంది. సీఎంకు ఏ అధికారాలు లేకుండా చేయలనుకుంటోంది. ఇది ఎలాంటి జోక్ అనాలి?'' అని కపిల్ సిబిల్ ప్రశ్నించారు.

Updated Date - 2023-06-11T16:54:42+05:30 IST