Akash Anand: మాయావతి ప్రకటించిన రాజకీయ వారసుడు ఆకాశ్ ఆనంద్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
ABN , First Publish Date - 2023-12-10T18:05:11+05:30 IST
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి ఆదివారం ఒక సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ తన రాజకీయ వారసుడు అని, ఇకపై అతను బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు.
Akash Anand Background: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి ఆదివారం ఒక సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ తన రాజకీయ వారసుడు అని, ఇకపై అతను బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే.. ఆకాశ్ ఆనంద్ పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పార్టీ అధ్యక్ష స్థాయికి ఎదిగిన అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. పదండి.. ఆకాశ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో మనమూ ఓ లుక్కేద్దాం.
28 ఏళ్ల ఆకాశ్ ఆనంద్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. చాలా సంవత్సరాల నుంచే ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. బిజినెస్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాశ్.. అనేక సందర్భాల్లో పార్టీ సర్కిల్‌లలో కనిపించారు. బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా అధికారిక పదవిని కలిగి ఉన్నారు. గత సంవత్సరం నుండి రాజస్థాన్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరించారు. అంతకుముందు.. 2019లో మాయావతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆగస్టు నుంచి లక్నోలో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ఆకాష్ ఆనంద్ హాజరు కావడం.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో అతని స్థాయిని ఏంటో నిరూపించేందుకు మరో ఉదాహరణగా నిలిచింది. అదే నెలలో.. పార్టీ నిర్వహించిన 14 రోజుల ‘సర్వజన్ హితయ్, సర్వజన్ సుఖయ్ సంకల్ప్ యాత్ర’కి నాయకత్వం కూడా వహించారు.
నిజానికి.. 2019లో ఆకాశ్ ఆనంద్‌ని ఉపాధ్యాక్షుడిగా మాయావతి ప్రకటించినప్పుడు ఆమె నెపోటిజం విమర్శలను ఎదుర్కున్నారు. దీంతో.. స్వయంగా ఆనంద్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అప్పుడు మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించగా.. ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఆ ఏడాదిలోనే (2019లో) మాయావతిపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధాన్ని విధించినప్పుడు.. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతివ్వాలని ప్రజలను ప్రోత్సహిస్తూ ఆకాష్ ఆనంద్ తన మొదటి రాజకీయ ర్యాలీలో ప్రసంగించారు. అలా క్రమంగా ఎదుగుతూ.. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టే స్థాయికి ఆనంద్ చేరుకున్నారు.