Couple Sell Baby: ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా.. ఐఫోన్ కోసం కన్నకొడుకునే అమ్మేశారు
ABN , First Publish Date - 2023-07-27T19:58:12+05:30 IST
తాము ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నా సరే.. తమ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా.. నెలలు నిండిన పిల్లల్నైతే ఈగ కూడా...
తాము ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నా సరే.. తమ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా.. నెలలు నిండిన పిల్లల్నైతే ఈగ కూడా వాలకుండా ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. తమ ఆకలి, ఇష్టాలు, కోరికల్ని చంపుకొని మరీ పిల్లల్ని పోషిస్తారు. పూట గడవడానికి కష్టంగా ఉన్నా సరే.. పిల్లలే ప్రాణంగా బతుకుతుంటారు. కానీ.. వెస్ట్ బెంగాల్‌లోని ఓ జంట అందుకు భిన్నంగా ఏం చేశారో తెలుసా? కేవలం ఐఫోన్ కోసమని తమ 8 నెలల కన్నకొడుకుని అమ్మేశారు. ఆ ఫోన్ కూడా ఎందుకు తీసుకున్నారనుకుంటున్నారు? రీల్స్ చేయడం కోసం! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
వెస్ట్ బెంగాల్ జిల్లా నార్త్ 24 పర్గనస్ జిల్లాలోని పనిహాటి గాంధీనగర్ ఏరియాలో జయ్‌దేవ్, సాఠి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఏడు సంవత్సరాల కూతురితో పాటు 8 నెలల కొడుకు ఉన్నాడు. వీరిది చాలా పేద కుటుంబం. పూటగడవడం కూడా కష్టమే. అలాంటి ఈ దంపతుల చేతిలో సడెన్‌గా ఐఫోన్ దర్శనమిచ్చింది. ఈ ఫోన్‌తో వాళ్లు రీల్స్ షూట్ చేయడం మొదలుపెట్టారు. పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లి, అందమైన లొకేషన్స్‌లో రీల్స్ షూట్ చేశారు. అయితే.. ఐఫోన్ వచ్చినప్పటి నుంచి వీరి 8 నెలల బాబు కనిపించకపోవడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వాళ్లు ఉండలేక.. ఆ జంటని నిలదీశారు. ‘మీ 8 నెలల బాబు ఏమయ్యాడు? కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు’ అని అడిగారు. అందుకు ఆ జంట.. ‘‘డబ్బుల కోసం మా బాబుని ఒక వ్యక్తికి అమ్మేశాం’’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఖంగుతిన్న స్థానికులు.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. మొదట తల్లి సాఠిని అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు.. బాబుని రెస్క్యూ చేశారు. అలాగే.. ఆ బాబుని కొనుగోలు చేసిన ప్రియాంక అనే మహిళని సైతం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చారన్న సంగతి తెలిసి జయ్‌దేవ్ పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ, చివరికి అతడు కూడా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. నిజానికి.. కొడుకుని అమ్మిన తర్వాత కూతురిని సైతం అమ్మేయాలని జయదేవ్ ప్లాన్ చేశాడు. ఒక వ్యక్తితో ఒప్పందం కూడా కుదుర్చున్నాడు. ఈలోపే వీరి బండారం బయటపడటంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు.