విపక్షాల కూటమికి మేం దూరం

ABN , First Publish Date - 2023-06-11T02:49:08+05:30 IST

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేయనున్న మహాకూటమికి తమ పార్టీ దూరంగా ఉంటుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా సూచనప్రాయంగా వెల్లడించారు.

విపక్షాల కూటమికి మేం దూరం

● ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు

రాజౌరి/జమ్ము, జూన్‌ 10: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేయనున్న మహాకూటమికి తమ పార్టీ దూరంగా ఉంటుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా సూచనప్రాయంగా వెల్లడించారు. శనివారం రాజౌరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటువంటి పొత్తుతో తమ పార్టీకి, జమ్ము, కశ్మీర్‌కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదన్నారు. ‘‘వారికి అవసరమైనప్పుడు మా తలుపులు తడుతున్నారు.. కానీ 2019లో మేం పెద్దమోసాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ నాయకులంతా ఎక్కడ ఉన్నారు? వారిలో ఎంతమంది ఇక్కడి ప్రజలకు అండగా నిలబడ్డారు? అని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్‌–370ని రద్దు చేసినప్పుడు చాలా పార్టీలు మౌనంగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడున్న ఐదు స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని, మిగిలిన పార్టీల వారికి ఏం కావాలంటే అది చేసుకోమనండి అని ఒమర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల విజిల్‌ మోగకముందే కశ్మీర్‌లో పొత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందన్నారు.

Updated Date - 2023-06-11T02:49:08+05:30 IST