రూ.లక్ష కోట్లతో గోదాములు

ABN , First Publish Date - 2023-06-01T01:14:58+05:30 IST

దేశంలోని ధాన్యాగారాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు గాను....

రూ.లక్ష కోట్లతో గోదాములు

2 వేల టన్నుల సామర్థ్యంతో మండలానికి ఒకటి

పైలట్‌ ప్రాజెక్టుగా 10 జిల్లాల్లో నిర్మాణం

ప్రస్తుత గోదాముల సామర్థ్యం 14.5 కోట్ల టన్నులు

ప్రాజెక్టు పూర్తయితే 21.50 కోట్ల టన్నుల సామర్థ్యం

తాజా ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ధాన్యాగారాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు గాను.. 2 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మండలానికొక అదనపు గోదామును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్రవేసింది. ఇందుకోసం రూ. లక్ష కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం దేశంలోని గోదాముల్లో 14.5 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం ఉండగా.. తాజా నిర్ణయంతో ఐదేళ్లలో ఆ సామర్థ్యం 21.5 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరుకుని, అతిపెద్ద ధాన్యాగారంగా మారనుంది. ఈ ప్రణాళిక అమలు కోసం కేంద్ర వ్యవసాయ, వినయోగదారులు-ఆహార-పౌర సరఫరాలు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖల్లోని ఏడు కీలక పథకాలను ఏకీకృతం చేయనుంది. అంతర్‌మంత్రిత్వ శాఖల కమిటీ (ఐఎంసీ)ని ఏర్పాటు చేయనుంది. కేంద్ర సహకార శాఖ మంత్రి చైర్మన్‌గా ఏర్పడే ఐఎంసీలో కేంద్ర వ్యవసాయ, పౌరసరఫరాలు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖల మంత్రులు, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ విలేకరులకు వివరాలను తెలియపరిచారు. ‘‘ఈ ప్రాజెక్టు కోసం వారం రోజుల్లో జాతీయ స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాం. 45 రోజుల్లో ప్రణాళికను అమలు చేయాలని గడువును నిర్దేశించుకున్నాం. 10 జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టును చేపడతాం’’ అని ఆయన వివరించారు.

7 పథకాల ఏకీకృతం

మూడు మంత్రిత్వ శాఖల్లోని ఏడు పథకాలను ఈ ప్రణాళిక కోసం ఏకీకృతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర వ్యవసాయ శాఖలోని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్‌), వ్యవసాయ మార్కెటింగ్‌ మౌలికసదుపాయాల పథకం(ఏఎంఐ), మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌(ఎంఐడీహెచ్‌), వ్యవసాయ యాంత్రీకరణ మిషన్‌ (ఎస్‌ఎంఏఎం), కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖలోని జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేటాయించే ఆహార ధాన్యాల పథకం, కనీస మద్ధతు ధరకు సేకరణ కార్యకలాపాలు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖలోని ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం(పీఎంఎ్‌ఫఎంఈ), ప్రధాన మంత్రి కృషి సంపద యోజన(పీఎంకేఎ్‌సవై) పథకాలను కేంద్రం ఏకీకరించనుంది. కాగా, సిటీ ఇన్వె్‌స్టమెంట్స్‌ టు ఇన్నోవేట్‌, ఇంటిగ్రేట్‌ అండ్‌ సస్టైన్‌(సిటీ్‌స) 2.0కు కూడా క్యాబినెట్‌ పచ్చజెండా ఊపింది.

Updated Date - 2023-06-01T01:14:58+05:30 IST