Twitter : ట్విటర్‌ బ్లూటిక్‌ కావాలా?

ABN , First Publish Date - 2023-02-10T03:57:27+05:30 IST

దిగ్గజ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ భారత్‌లో బ్లూటిక్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ప్లాన్లను ప్రకటించింది. టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ట్విటర్‌ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్లాన్లను ప్రకటించగా.. తాజాగా భారత్‌లోనూ తమ ప్లాట్‌ఫాంను ప్రీమియంగా

Twitter : ట్విటర్‌ బ్లూటిక్‌ కావాలా?

ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వెర్షన్లకు నెలకు రూ. 900 చెల్లించాల్సిందే

వెబ్‌ వెర్షన్‌కు రూ. 650

భారత్‌లో ధరలను ప్రకటించిన ట్విటర్‌

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, ఫిబ్రవరి 9: దిగ్గజ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ భారత్‌లో బ్లూటిక్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ప్లాన్లను ప్రకటించింది. టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ట్విటర్‌ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్లాన్లను ప్రకటించగా.. తాజాగా భారత్‌లోనూ తమ ప్లాట్‌ఫాంను ప్రీమియంగా మార్చింది. ఇలా ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకునే వారికి బ్లూటిక్‌తోపాటు.. అదనపు ఫీచర్లను అందించనుంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు బ్లూటిక్‌ కోసం నెలకు రూ.900 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్‌ వెర్షన్‌ను మాత్రమే వాడేవారు నెలకు రూ. 650 చెల్లించాలి. వెబ్‌ వెర్షన్‌ యూజర్లకు ఏడాది ప్లాన్‌ను కూడా ట్విటర్‌ ప్రకటించింది. వీరు ఏడాదికి రూ. 6,800 చెల్లించాలి. అంటే.. వీరికి నెలకు రూ. 566 చెల్లించినట్లవుతుందని ట్విటర్‌ పేర్కొంది. కొత్తగా ట్విటర్‌ ఖాతా తెరిచేవారికి వెంటనే బ్లూటిక్‌ సబ్‌స్ర్కిప్షన్‌ సదుపాయం ఉండదని, అలాంటి వారు కనీసం 90 రోజులు ఎదురుచూడాల్సి ఉంటుందని వివరించింది. బ్లూటిక్‌ సబ్‌స్ర్కైబర్లకు కొన్ని నిబంధనలను కూడా విధించింది. అదనపు ఫీచర్లను ప్రకటించింది. అవి..

  • ఒక్కసారి బ్లూటిక్‌ సబ్‌స్ర్కిప్షన్‌ జరిగాక.. యూజర్లు తమ ప్రొఫైల్‌ ఫొటోను లేదా డిస్‌ప్లే పిక్చర్‌(డీపీ)ని మారిస్తే.. ట్విటర్‌ వాటిని ధ్రువీకరించే వరకు బ్లూటిక్‌ ఉండదు.

  • వినియోగదారులు బ్లూటిక్‌ సబ్‌స్ర్కిప్షన్‌ను రద్దుచేసుకోవచ్చు. అయితే.. బిల్లింగ్‌ సైకిల్‌కు ముందే ఆ పనిచేయాలి. ఆటోరెన్యూవల్‌ను రద్దుచేసుకోవాలి. ఒక్కసారి ఆటో రెన్యూవల్‌ అయితే.. సబ్‌స్ర్కిప్షన్‌ రద్దయ్యాక.. ఆ డబ్బును వాపస్‌ ఇవ్వరు.

  • బ్లూ సబ్‌స్ర్కైబర్లకు అదనపు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ట్వీట్లను రద్దుచేయడం, పబ్లిష్‌ అవ్వక ముందే ఉపసంహరించుకోవడం, ట్వీట్‌ చేసిన 30 నిమిషాల్లోపు ఐదు సార్లు ఎడిట్‌ చేసుకోవడం వంటి అవకాశాలుంటాయి.

  • ప్రీమియం సబ్‌స్ర్కైబర్లకు ప్రకటనల నుంచి కొంత మేర విముక్తి ఉంటుంది. వీరు 60 నిమిషాల నిడివిగల/2జీబీ సైజుగల వీడియోలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

  • సాధారణంగా ట్విటర్‌ యూజర్లు 280 అక్షరాల్లోనే ట్వీట్‌ను పూర్తిచేయాలి. అందుకే ట్విటర్‌ను మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అంటారు. ప్రీమియం సబ్‌స్ర్కైబర్లు మాత్రం 4 వేల అక్షరాల్లో ట్వీట్‌ చేసుకోవచ్చు. పెయిడ్‌ సబ్‌స్ర్కైబర్ల విషయంలో ఇది మాక్రోబ్లాగింగ్‌లా పనిచేస్తుంది.

  • ప్రస్తుతం అమెరికా, కెనడా, జపాన్‌, ఇండోనేషియా, న్యూజిలాండ్‌, బ్రెజిల్‌, బ్రిటన్‌, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియాల్లో ట్విటర్‌ బ్లూటిక్‌ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అక్కడ కూడా బ్లూటిక్‌ చార్జీలు ఇండియాలో మాదిరిగానే ఉన్నాయి.

Updated Date - 2023-02-10T03:57:28+05:30 IST