Swaroopanandendra: మంత్ర తంత్ర శాస్త్రాల్లో విశాఖ శారదాపీఠానికి సాటి లేదు
ABN , First Publish Date - 2023-02-21T22:08:39+05:30 IST
హర్యానా కురుక్షేత్ర వేదికగా చేపట్టిన లక్ష చండీ మహా యజ్ఞం ద్వారా విశాఖ శారదాపీఠం కీర్తి పతాకం విశ్వమంతటా రెపరెపలాడుతోందని..
కురుక్షేత్ర: హర్యానా కురుక్షేత్ర (kurukshetra) వేదికగా చేపట్టిన లక్ష చండీ మహా యజ్ఞం (Lakh Chandi Maha yagya) ద్వారా విశాఖ శారదాపీఠం (Visakha Sri Sarada Peetham) కీర్తి పతాకం విశ్వమంతటా రెపరెపలాడుతోందని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి (Swaroopanandendra Saraswati) చెప్పారు. అతి సనాతనమైన వైదిక చరిత్రలోనే ఇలాంటి యజ్ఞం మునుపెన్నడూ జరగలేదన్నారు. 2100 మంది బ్రాహ్మణులను సమన్వయపరచుకుంటూ నిత్యం వేలకొద్దీ హవనాలను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ యజ్ఞం నిర్విఘ్నంగా ముందుకు వెళుతుండటంతో యావత్ భారతదేశమంతటా తమ పీఠం పేరు మార్మోగుతోందని, మంత్ర, తంత్ర శాస్త్రాల్లో విశాఖ శ్రీ శారదాపీఠానికి సాటి లేదని నిరూపితమైందని ఆయన స్పష్టం చేసారు. కురుక్షేత్రలో యాగశాలను సందర్శించినపుడు పండితులను ఉద్దేశించి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు.
మరోవైపు 11వ రోజు నాటికి లక్ష చండీ మహా యజ్ఞంలో 76వేల 32 హవనాలను పూర్తి చేసారు. స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు పారాయణల సంఖ్యను పెంచి నిర్ణీత వ్యవధిలో యజ్ఞం పూర్తయ్యేలా పండిత వర్గాలు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాయి. యజ్ఞభూమిలో చండీమాత రేణుకాదేవి అవతారంలో దర్శనమిచ్చింది. అమ్మవారి అలంకరణకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర, గుంతిమాత విశేష పూజలు నిర్వహించారు.
హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్ వేదికగా 16 రోజులపాటు శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం జరుగుతుంది. ఈనెల 26వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగుతుంది. గుంతి మాత సంకల్పించిన ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి (swatmanandendra saraswati) పర్యవేక్షిస్తారు. దీనికి అష్టోత్తర శత కుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా నామకరణం చేసారు. ఇంత పెద్ద ఎత్తున చండీ యజ్ఞాన్ని గతంలో తలపెట్టినట్లు దాఖలాలు లేవు. పూర్వకాలంలో చత్రపతి శివాజీ మహరాజ్, పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. ఇప్పటివరకు సహస్ర, అయుత చండీ యాగాలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా భరత భూమి సాక్షిగా లక్ష చండీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ద్వాపర యుగంలో ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగం చేయడం వల్ల దక్కిన ఫలితం ఈ యజ్ఞాన్ని సందర్శించిన వారికి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కలౌ చండీ వినాయకౌ అని ఆగమ శాస్త్రం చెబుతోంది. కలియుగంలో ప్రార్ధించిన వెంటనే ఫలితాన్నిచ్చేది చండీ దేవత, వినాయకుడు మాత్రమే అంటారు. అలాంటి చండీమాతను ప్రార్ధిస్తూ దేశ సంక్షేమం కోసం చేపడుతున్న యజ్ఞాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 17 రోజులపాటు యాగ ప్రాంగణంలోనే ఉండి పర్యవేక్షిస్తారు.