United Nations: ఇండియా పేరును భారత్‌ అని మార్చే అంశంపై ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-09-08T20:45:02+05:30 IST

ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చుతామని అయితే ఇందుకు సంబంధించి ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) అధికారిక ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పష్టం చేశారు.

United Nations: ఇండియా పేరును భారత్‌ అని మార్చే అంశంపై ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చుతామని అయితే ఇందుకు సంబంధించి ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) అధికారిక ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పష్టం చేశారు. ఈ అంశం ఐక్యరాజ్య సమితి పరిధిలోనిది కాదని, అందువల్ల యునైటెడ్ నేషనల్స్ ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్య చేయదని తెలిపారు.

జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని పేర్కొనడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తదితర హేమాహేమీలు హాజరవుతున్న అంతర్జాతీయ సదస్సులో రాష్ట్రపతిని సంభోదించే తీరును మార్చడం అత్యంత గణనీయమైన మార్పుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక అధికారిక కార్యక్రమంలో ఇండియా పేరును భారత్‌ అని మార్చడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు అంటున్నాయి. అంతేగాక విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేసిన జీ-20 బుక్‌లెట్‌లో కూడా ‘భారత్‌’ అనే పేర్కొన్నారు.


జీ-20 కూటమి అధ్యక్ష స్థానంలో ఉన్న భారతదేశం గురించి అందులో వివరిస్తూ.. ‘భారత్‌, ప్రజాస్వామ్యానికి తల్లి (ద మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ)’ అనే శీర్షిక పెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని మోదీ ఇండొనేసియా పర్యటనకు సంబంధించి అధికారిక నోట్‌లోనూ ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’గా పేర్కొనడం విశేషం. అధికార వర్గాలు మాత్రం దేశానికి భారత్‌ అని అధికార నామం ఇప్పటికే ఉందని అంటున్నాయి. రాజ్యాంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని, 1946-48 మధ్య రాజ్యాంగ అసెంబ్లీలో ఈ విషయంపై లోతుగా చర్చ కూడా జరిగిందని తెలిపాయి. రాజ్యాంగంలోని మొదటి అధికరణలో.. ఇండియా అంటే భారత్‌, ‘ రాష్ట్రాల సంఘం’గా ఉంటుందన్న వాక్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఇక నుంచి ఇండియా అని ఉన్న చోటల్లా భారత్‌ అని మారుస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొదటి అధికరణను సవరించే బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-08T20:45:04+05:30 IST