రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువ

ABN , First Publish Date - 2023-03-26T00:42:50+05:30 IST

పరువు నష్టం కేసులో రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. శిక్ష పడిన వెంటనే అనర్హత వేటు వేయడాన్ని తప్పుపట్టారు. సంకుచితమైన మనసుతో ఎవరూ గొప్పవాళ్లు కాలేరన్న మాజీ ప్రధాని దివంగత ..

రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌

న్యూఢిల్లీ, మార్చి 25: పరువు నష్టం కేసులో రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. శిక్ష పడిన వెంటనే అనర్హత వేటు వేయడాన్ని తప్పుపట్టారు. సంకుచితమైన మనసుతో ఎవరూ గొప్పవాళ్లు కాలేరన్న మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి మాటలను బీజేపీ నాయకులు గుర్తుచేసుకోవాలని సూచించారు. పెద్ద మనసుతో వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, తొందరపడకుండా కొన్నాళ్లు వేచి చూడాల్సిందన్నారు. ఎన్నికల వేడిలో నేతలు ఎన్నో మాట్లాడతారని, ఇదే మొదటిసారి కాదు... చివరిసారి కాబోదని చెప్పారు. రాహుల్‌ గాంధీని లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హుడిగా ప్రకటించి బీజేపీ ‘సెల్ఫ్‌ గోల్‌’ చేసుకుందని, ఈ చర్య ప్రతిపక్షాలు ఏకం కావడానికి దోహదం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలతో రాహుల్‌ బీసీలను అవమానించారని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అనురాగ్‌ ఠాకూర్‌ చేస్తున్న విమర్శలు అర్థరహితమని కాంగ్రెస్‌ ఎంపీ కపిల్‌ సిబ్బల్‌ విమర్శించారు. రాహుల్‌పై బహిష్కరణ వేటు వేయడం గాంధేయవాద సిద్ధాంతాలకు, భారతీయ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమేనని భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ట్విట్టర్‌లో విమర్శించారు. తన తాత ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది, త్యాగాలు చేసింది దీని కోసం కాదని వ్యాఖ్యానించారు. రో ఖన్నా తాత అమర్‌నాథ్‌ విద్యాలంకార్‌ భారత స్వాతంత్య్ర పోరాటంలో లాలా లజపతిరాయ్‌తో కలిసి పాలుపంచుకున్నారు.

Updated Date - 2023-03-26T00:42:50+05:30 IST