BBC Documentary Screening: ఏడాది పాటు ఇద్దరు డీయూ విద్యార్థుల డిబార్

ABN , First Publish Date - 2023-03-20T15:54:31+05:30 IST

గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని క్యాంపస్‌లో ప్రదర్శించేందుకు సహకరించిన పలువురిపై ఢిల్లీ..

BBC Documentary Screening: ఏడాది పాటు ఇద్దరు డీయూ విద్యార్థుల డిబార్

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ (BBC Documentary)ని క్యాంపస్‌లో ప్రదర్శించేందుకు సహకరించిన పలువురిపై ఢిల్లీ యూనివర్శిటీ (Delhi University) కొరడా ఝళిపించింది. క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ కార్యదర్శి లోకేష్ చుగ్, మరో లా విద్యార్థిని ఏడాది పాటు పరీక్షలు రాయకుండా డీబార్ (Debarred) చేసింది. ఆంథ్రోపాలజీ డిపార్ట్‌మెంట్‌లో డాక్టరేట్ విద్యార్థిగా చుగ్ ఉండగా, లా ఫ్యాకల్టీ విద్యార్థిగా రవీందర్ ఉన్నాడు. యూనివర్శిటీ లేదా కాలేజీ, లేదా డిపార్టమెంటల్ పరీక్ష లేదా పరీక్షల్లో ఏడాది పాటు పాల్గొనకుండా డీయూ (DU) రిజిస్ట్రార్ డిబార్ చేసినట్టు ఈనెల10న ఒక మొమొరాండంలో తెలిపింది.

జనవరి 27వ తేదీ ఘటనలో ప్రమేయమున్న మరో ఆరుగురు విద్యార్థులకు తక్కువపాటి శిక్ష విధించినట్టు డీయూ అధికారిణి ఒకరు తెలిపారు. అయితే ఆ శిక్ష ఏమిటనేది ఆమె వెల్లడించలేదు. ఇద్దరు స్టూడెంట్లను డిబార్ చేశామని, మరో ఆరుగురికి తక్కువ శిక్ష పడిందని చెప్పారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించామని, రాబోయే రోజుల్లో మరింత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు.

బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్'పై నిషేధం ఉందని డిబార్ చేసిన ఇద్దరు విద్యార్థులకు జారీ చేసిన మెమొరాండంలో డీయూ పేర్కొన్నారు. నిషేధిత బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడం, అందులో పాల్గొన్నందుకు లోకేష్ చుగ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారంపై గత జనవరిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వీడియో లింక్‌లు తొలగించాల్సిందిగా యూట్యూబ్, ట్విట్టర్‌లను ఆదేశించింది. కాగా, అధికారులు అనుమతి నిరాకరించినప్పటికీ స్టూడెంట్ యాక్టివిస్టులు పలు యూనివర్శిటీల్లో డాక్యుమెంటరీ స్క్రీనింగ్ నిర్వహించారు. బీబీసీ డాక్యుమెంటరీని జనవరి 27న డీయూలోని ఆర్ట్స్ ఫ్యాకల్టీ బిల్డింగ్ వెలుపల ప్రదర్శించారు. దీనిపై దర్యాప్తునకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని యూనివర్శిటీ ఏర్పాటు చేసింది. ''కమిటీ సిఫార్సులను క్రమశిక్షణా అథారిటీ పరిగణనలోకి తీసుకుని లోకేష్ చుగ్‌పై ఏడాది పాటు నిషేధం విధించాలని నిర్ణయించింది'' అని ఆ మెమొరాండం పేర్కొంది. ఇదే తరహా నోటీసును రవీందర్‌కు కూడా పంపారు.

చుగ్, ఎన్‌ఎస్‌యుఐ ఖండన...

కాగా, ఘటన జరిగిన రోజు ఆర్ట్స్ ఫ్యాకల్టీకి తాను హాజరుకాలేదని ఎన్ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి చుగ్ తెలిపారు. డాక్యుమెంటరీపై ఎలాంటి నిషేధం లేదని కూడా ఆయన అన్నారు. మరోవైపు ఎన్ఎస్‌యూఐ ఒక ట్వీట్‌లో ఈ చర్యను ఖండించింది. పరీక్షలకు హాజరు కాకుండా విద్యార్థులపై ఆంక్షలు విధించడం అనైతికమని, గర్హనీయమని పేర్కొంది.

Updated Date - 2023-03-20T16:03:17+05:30 IST